Posts Tagged ‘మతం’

ఏది సత్యం???

Posted: మే 24, 2010 in అఙ్నానం
ట్యాగులు:

మనిషి మంచి మార్గం లో నడవడానికి ప్రోత్సహించేది మతం.నాకు కొన్ని అనుమానాలు వున్నాయి ఈ విషయం లో.ప్రతి మతం లో అందరూ చెప్పేది మంచి మాత్రమే వుంది అని.మరి ప్రతి మతం లో చెడ్డవారు కూడా వున్నారు.మరి ఒక మతం మంచిదా కాదా అన్నది ఎలా తెలుసుకోవడం? నాకు మత విషయాల పైన నాకు తెలియకుండానే ఆసక్తి ఏర్పడింది. నా మతాన్ని తెలుసుకునే పని లో నాకు కలిగిన అనుమానాలకి సరైన సమాధానాలు ఇవ్వగలిగే గురువులు ఎవరూ దొరకలేదు.దొరికిన వారు ఎవరు కూడా సరైన సమాధానాలు ఇవ్వలేదు.సరే ఈ మతం కాదు, మరొక మతం లో నీకు సమాధానాలు దొర్కుతాయి అన్నారు కొందరు. ఆ మతం కూడా తెలుసుకుందామని ప్రయత్నించాను. అలాగే మరొక మతం… ఇంకొక మతం….. నా సమాధానాలకి సరైన సమాధానాలు ఎవరూ ఇవ్వలేదు.మీకు గాని , మీకు తెలిసిన వారు గాని నాకు నా ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వగలిగితే చాలా చాలా, చెప్పలేనంత సంతొషిస్తాను.ఎందుకంటే ఒక మంచి మతంని తెలుసుకునే ప్రయత్నంలో ప్రతి మతంలో నాకు చెడు కనిపించింది.ఇక మతం అన్న విషయం మీద నమ్మకం పోయినప్పుడు ఇక మిగిలింది నాస్తికవాదం! ఇక్కడ అంతా బాగుంది కాని, దేముడు విషయం??? నాకు కనిపించనంత మాత్రానా, అతడు లేడా?అతడి తత్వం గురించి మతస్థులు కూడా ఊహాగానాలే చేస్తారు, నాస్తిక వాదులు కూడా ఊహాగానాలే చేస్తారు.వున్నాడొ లేడొ తెలియాలి అంటె సృష్టి రహస్యం తెలియాలి లేదా ఆయనే వచ్చి చెప్పాలి.కాబట్టి నాస్తిక వాదం కూడా పూర్తిగా నన్ను సతృప్తి పరచలేదు.ఇక్కడ చర్చ మతం పై నాకున్న అనుమానాలకి పరిమితం చేద్దాము.

1)ప్రతి మతం తమ మతాన్ని ఆచరించే (లేదా ఆచరిస్తున్నామనుకునే ) వారిలో చెడ్డవారిని తృణీకరిస్తూ, వారు అసలు మతాన్ని సరిగా అర్ధం చేసుకొలేదు అంటుంది.మరి మతాన్ని బాగా అర్ధం చేసుకుని దానిలో మంచిని ప్రపంచానికి చాటి చెప్పిన వారిని తమ మతం గొప్పతనంగా చాటుకుంటుంది.మరి మతాన్ని బాగా అర్ధం చేసుకోవడం గాని, సరిగా అర్ధం చేసుకోలేక పోవడం గాని మనిషి గొప్పా లేక తప్పా? మతం గొప్పా లేక తప్పా? చెడు పనులు చేసె మతస్థులు బుద్ధిహీనులయ్యి తమ తమ మతగ్రంధాలలో (లేదా ధర్మ గ్రంధ సంపుటిలో) వున్న మంచి తెలుసుకోలేక పోయారు కాబట్టి అలా తప్పుగా ప్రవర్తించారు అంటూంది. మరి మతం గర్వపడేలా ఆచరించిన వారు తమ సుబుధ్ధి వలన మత / ధర్మం లో వున్న మంచిని గ్రహించారు అన్న మాట!అంటె మనిషి లోని సుబుధ్ధిని తమ గొప్పగా చాటుకునే మతాలు, దుర్బుద్ధి ని త్యజించడం వలన తమ అవకాశ వాదాన్ని చాటుకుంటున్నాయి.మంచైనా చెడు అయినా అది మనిషిలోనె వుంది అన్న మాట! మంచి జరిగితే మతాన్ని పొగడకూడదు, చెడు జరిగితే మతాన్ని తెగడకూడదు. దీనికి సమాధానం?

2)ప్రజాస్వామ్యం, కమ్యూనిజం, రాజరికం, నియంతృత్వం ఇలా పాలనా పద్ధతులు చాలా వున్నాయి.వాటిలో ఏది మంచిది? ఎక్కువ మంది దేనిని పాటిస్తే అదా? కాదు కదా!ఎక్కువ మంది ఒకప్పుడు భూమి బల్లపరుపుగా వుంది అనుకున్నారు.అంత మాత్రానా భూమి బల్లపరుపు అయిపోతుందా?భూమి చుట్టు సూర్య చంద్రులు తిరుగుతున్నారని అనుకున్నారు!అదే నిజమయిపోయిందా?మనిషి తన తప్పులని వదిలి ముందుకు పోతున్నాడు! కాలం తో పాటు తనతో ఇప్పుడు ప్రస్తుతం వున్నదాంట్లో తప్పులు తరచి చూసుకుని, లాభదాయకం కాని వాటిని వదిలివేస్తాడు, రేపు గాని, మరు నాడు గాని.నేడు అందరూ ప్రజా స్వామ్యాన్ని పాటించినా అందులో తప్పులు లేవని కాదు.వాటిని మార్చుకోవడానికి ప్రయత్నిస్తాడు.అందులో మంచి కన్నా చెడు ఎక్కువ అని గాని, సాదారణ జనం సరిగా ఆచరించలేనంత సక్లిష్టంగా గా గాని వుంటె దానిని వదిలి కొత్త పద్దతి మొదలు పెడతాడు.రాజరికం మాని ప్రజాస్వామ్యం ఆచరించినట్టు.నేడు ప్రజాస్వామ్యం లో ఎన్నికలులో ఒక పాతిక శాతం మంది ఓట్లు పడిన వారు ప్రభుత్వ నేతలు అయ్యిపోతుంటే అది ప్రజాస్వామ్యపు తప్పా?ప్రజల తప్పా?ఇందులో తప్పులు వున్నాయి అంటే రాజ్య ద్రోహిని అయ్యిపోతానా?అలాగే ఏ మతం అయినా మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తుంది అనుకుంటే కొత్త మతం గాని మతానికి ప్రత్యమ్నాయం గాని పుట్టుకు వస్తే మానవాళికి మంచిదే కదా!

3) ఒకప్పుడు ఒక సమాజం లో ఒక మతం మాత్రమే వుండేది, అది మనుషులని కలిపి వుంచేది.కాని కాలం గడిచే కొద్ది వేరు వేరు సమాజాలలో వున్న ఒక మతం లో నచ్చని విషయాల వలన మరొక కొత్త మతం(కొత్త మతాలు) పుట్టుకు వచ్చాయి.నేడు ప్రపంచమంతా ఒక కుగ్రామం అయ్యిపోయినప్పుడు అన్ని మతాలు అన్ని సమాజాలలో వున్నయి.మతాలలో మళ్లీ చిన్న వర్గాలు వున్నా, పక్క మతం విషయం వచ్చేటప్పటికి ఆ చిన్న చిన్న వర్గాలు అన్ని కలిసి పోతాయి.అంటే మతం ఒకప్పుడు మనుషులని కలిపేదిగా వుంటే నేడు ఒక పెద్ద వర్గానికి వ్యతిరేకంగా మరొక పెద్ద వర్గంగా విడిపోవడానికి పనికి వస్తుంది అన్న మాట!సరే మా గుంపు పక్క గుంపు పై దాడికి దిగదు అంటే, మరి పక్క వర్గం మీ మీద దాడి చేసినప్పుడు? దాడి, ప్రతి దాడి ఒకే పరిమాణం గల తప్పులు కాకపోయినా తప్పులే! రెండింటా హింస తప్పదు.మరి ఏమి కర్తవ్యం? అసలు దాడి ఎందుకు జరుగుతుంది?ఒక వర్గం/మతం కి చెందిన వారి గా చెప్పుకుని మరొక మతంకి చెందిన వారిని తమ స్వార్ధ ప్రయొజనాల కోసం లక్ష్యం చేసుకుని దాడి చేస్తె, అది వ్యక్తిగత విషయం కాక తమ వర్గం పై మరొక వర్గ దాడిగా మనిషి అనుకోవడం వలన! అంటె మనిషిలో ఐకమత్యం, విడిపోవడానికి పనికి వస్తుంది అన్న మాట!ఇలా మతం పేరు చెప్పుకుని కలిసి వుందామనుకుని కొట్టుకునే కంటే విడిపోయి సుఖంగా వుండవచ్చు కదా!

4) ఒక అబ్బాయి చెడు తిరుగుళ్లు తిరిగి చెడిపోయి, ఇంటికి, వాడకి, ఊరుకి, సమాజానికి ఒక పీడలా తయారు అయితే, అతడిని సరిగా పెంచని తల్లి తండ్రులని ఆడిపోసుకోవడం తప్పు కాదు కదా!క్రమ శిక్షణ లేకుండా అలా పెంచారేమిటి అని ఎవరన్నా అడిగితే సమంజసమే! మరి ఒక్కో సమాజం లో ఒక్కో మతం వుండేది కనుక ఆ సమాజం లో అవినీతి, నిజాయితీ లేమి, దురాచారాలు వుంటే దానికి మతంని బాధ్యత వహించమని అడగడం ఎంత వరకు అసమంజసం? ప్రతి సమాజం మత గ్రంధాలని వల్లె వేయడం విధ్యగా భావించే కాలంలో ఆ విధ్య మనుషులని మంచిగా మార్చలేకపోతె, దురాచారాలని పాటించేటట్టు చేస్తె, వాటిని నిరోదించాలన్న స్పృహ కలిపించలేక పోతె, అటువంటి విధ్య ఎంత వరకు ప్రయోజనకరం?నేడు అభివృధ్ధి చెందిన దేశాలలొ నేటి విధ్యా వ్యవస్థ కొంచెం ముందుగా అమలులోకి రావడం వలన ఆ సమాజపు దురాచారాలు తొందరగా తొలగిపోయాయి. ప్రజలలో తర్క బధ్ధంగా ఆలోచించడం మొదలయ్యింది నేటి విధ్యా వ్యవస్థ మూలానె కదా!అన్ని సమాజాలలో నేటి విధ్యా వ్యవస్థ అమలు లోకి రాక మునుపు కూడా సంఘ సంస్కర్తలు వున్నా వారు రాశిలో తక్కువ!వారు సూచించే మార్పులని అంగీకరించే స్థాయిలో ఆ సమాజం కూడా లేక పోయెను.దురాచారాలుని పెంచినా పెంచక పోయినా వాటిని ఉపేక్షించడం కూడా తప్పే! కాబట్టి ఆయా మత గ్రంధాలలో నేటి విధ్యా భోదన కన్నా గొప్పగా ఏమి లేక పోయిందా?

5) ఐన్‌స్టీను మహాశయుడు అణు విస్పోటన సిధ్ధాంతం ప్రతిపాదించింది, మానవాళి మంచి కోసమే!కాని దాని వలన అణుబంబులు కూడా తయారు చేసి మొత్తం మానవాళినే మట్టు పెట్టవచ్చు.ప్రతి విషయానికి మంచి చెడు అని రెండు పార్శ్వాలు వుంటాయి.ఇప్పుడు ప్రభుత్వాలు, అత్యంత భద్రత మధ్య అణు సంబంధిత కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నది, అవి తీవ్రవాదుల చేతిలో పడి దారుణాలకి దారి తీయకూడదనే!ప్రపంచ చరిత్రలో అణుదాడి జరిగింది ఒక్కసారే!అది ఎంత వినాశనానికి దారి తీస్తుందో అందరికి తెలిసింది.కాబట్టి ప్రతి ఒక్క ప్రభుత్వం గట్టి భద్రత తీసుకుంటుంది ఈ విషయంలో!కాని ప్రభుత్వమే విచక్షణ లేకుండా అణు బాంబులని ఉపయొగిస్తే! అసలు ప్రభుత్వం అంటూ ఒక నియంత్రణ లేకుండా అణు ధార్మిక పదార్ధాలు దొరికితే? మతం కూడా మంచి ఉద్దేశ్యం తోనె ప్రారంభం అయ్యినా, నేటి పరిస్థితిలో మత నియంత్రణ చెయ్యావలిసిన వారే దానిని స్వార్ధ ప్రయోజనాలకి వాడితే, అందరికి చేరువలో వున్న కారణంగా అప్పుడు జరిగే నష్టం అణు బాంబు చేసె నష్టం కి దరిదాపులలోనె వుంటుంది. అణు బాంబు దాడిలో అణు ధార్మికత వుంటే, మత దాడిలో విరిగిన మనసులు, విద్వేషాలు వుంటాయి.నియంత్రణ లేని మతం లో కూడా ప్రమాదం తక్కువేమి కాదు.ఎవరికి నచ్చినట్టు వారు మతాన్ని స్వార్ధ ప్రయోజనాలకి వాడుకుని, అమాయక ప్రజలని పావుకుగా వాడుకుంటారు.

6) అసలు నేడు ఆచరణలో వున్నవన్ని మతాలేనా? అసలు మతం నిర్వచనం ఏమిటి? గుఱ్ఱాలన్ని నాలుగు కాళ్లతో ఒక తోకతో, అతివేగంగా పరిగెట్టగలిగి వుంటాయి అని నిర్వచించామనుకోండి!ఒక గుఱ్ఱం మూడు కాళ్లతో అసలు పరిగెట్టలేకుండా తోక కూడా లేకుండా వుంది అనుకోండి.అది గుఱ్ఱం కాకుండా పోతుందా??అది ఒక ప్రత్యేకత కలిగిన గుఱ్ఱం.(ఇది నిర్వచనం లో బలహీనతని తెలపడానికి ఇచ్చిన ఉదాహరణ.మరే దురుద్దేశం లేదు!) అలాగే ఎవరొ నిర్వచించిన లక్షణాలు లేనంత మాత్రాన కొన్ని మతాలు కాకుండా పోవు. మిగిలిన మతాలతో వున్న ఇబ్బందులు ఆ మతం లో వుండబోవు అనుకోకూడదు.మహా అయితే మరొ రూపం లో వుండవచ్చు.కాబట్టి అది మతానికి ప్రత్యమ్నాయ వ్యవస్థ అవ్వబోదు. మతాల వలన జరిగే చెడుని నియత్రించలేనప్పుడు, మత ప్రత్యమ్నాయ వ్యవస్థ గాని, మత నిర్మూలన గాని అవసరం.

ఒక మతం లో గాని, ఒక వర్గం లో గాని పుట్టినంత మాత్రాన, ఆయా మతాలే గొప్ప అని చిన్నప్పటి నుండే పిల్లలకి నూరిపోయడం, ఆ చిన్న పిల్లల పట్ల వారి అమాయకత్వం పట్ల అమానుషత్వమే!మంచేదొ చెడెదో తెలియని వయసులో జరిగే ఈ మత మెంటల్ కండీషనింగ్ వారిని వారి జీవితం ఎంచుకోనివ్వక పోవడమే!

చెడు మతంలో కాక మనిషిలోనె వున్నా, ఆ చెడు అనే అగ్నికి ఆజ్యమయ్యి ఒక ఆటం బాంబులా మానవాళి మనుగడకే ప్రశ్నార్దకమయ్యే పరిస్థితిలో, మతంని వదిలివెయ్యడం అవసరం కాదా?

p.s.ఈ విషయం లో ఆరొగ్యకరమైన చర్చ (రచ్చ కాదండి, చర్చ )అవసరమే!

ప్రకటనలు