Posts Tagged ‘ఉరి’


వేడి వాడి విషయం మీద ఇన్ని వేరు వేరు అభిప్రాయాలు, అవి కూడా చదవగానె అప్పటికి పూర్తిగా సరైనదే అని అనిపిస్తుంటె ఏమని కామెంటాలో తెలియక తికమకలో ఈ టపా…సాధారణంగా నేను ఒక అభిప్రాయానికి బానిస అవ్వదలుచుకోను.నా అభిప్రాయం మార్చుకోవడానికి సిగ్గు పడను.మార్పు ఒక ఆరొగ్య కరమైన అలవాటు అని నా అభిప్రాయం.ఈ అభిప్రాయం కూడా మారవచ్చు:-)

క్రిందటి టపాలో మన న్యాయ వ్యవస్థ పైన నా ఆక్రోషం వెలిబుచ్చాను.అయితే వచ్చిన కామెంట్లన్ని కూడా వేరే వేరే విషయాల పైన….నాకు అర్ధం అయ్యిపోయింది, నేను రాద్దామనుకున్నది నాకు తప్ప ఇంకెవరి అర్ధం కాలేదు అని:-)తప్పు మీది కాదు లెండి. ఈ సారి కొంచెం స్పష్ఠత కోసం ప్రయత్నిస్తాను.

మన న్యాయ వ్యవస్థ ముందు నుండీ ఇంతే…..ఒక రాజకీయ నాయకుడు లేక ఒక పై హోదాలో వున్న అధికారి పై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా , వారు అరెస్ట్ అవ్వడం అరుదు.అయ్యినా బెయిలు మీద బయటకి రాకుండా వుండడం ఇంకా అరుదు.బెయిలు పైన బయటికి వచ్చినా తమ అధికారాన్ని, పలుకుబడిని దుర్వినియోగ పరచకుండా వుండడం ఇంకా ఇంకా అరుదు.అటువంటి వారి పైన కేసులు విచారణలు నత్త నడక నడుస్తాయి.వారి వలన సాక్ష్యాలు,విచారణ కూడా ప్రభావితం అవుతాయి.మరి కసబ్?కారాగారం లో వున్న ముద్దాయి.మన రక్షణ బలగాల సామర్ధ్యం అందరికి తెలిసినదే!ఎక్కువ కాలం కారాగారంలో వుంచలేమని మన ప్రభుత్వం చాటుకుంటుందా?ఇది విచారణ అలవాటుకి భిన్నంగా ఇంత ఆదరా బాదరా గా చెయ్యడం పైన్ నా అభిప్రాయం.

ఇక శిక్ష గురించి…. నా ముందటి టపాలో ఉరి శిక్ష కసబ్ చేసిన నేరం కి సరైనదా కాదా అన్నది చర్చించలేదు.నేను కేవలం అన్నది ఈ శిక్ష పడుతుందని నాకనిపిస్తుందని.దానిని సమర్ధించలేదు..అలాగె వ్యతిరేఖించలేదు.ఇప్పుడు నా అభిప్రాయం…అవును కసబ్ తనకి తాను గా ఒక తీవ్రవాది అయ్యాడు.తన అంగీకారం తోనె జిహాదిగా భారత్ లో అడుగు పెట్టాడు.చావుకి సిధ్ధ పడె ఇక్కడకి వచ్చాడు.పేదరికమా… ఆకలా… లేక మత మూఢత్వమా?మనకి తెలియదు.యువకుడు, పాపం ఏవొ బలీయమైన కారణాల వలన ఇలా చేసి వుండవచ్చు?ఒక అవకాశం ఇద్దాము.మారిపోయి సమాజానికి మంచి చేస్తాడు అనే వారు కూడా వున్నారు.అతడు మరీ మంచి చెడు తెలియని చిన్న పిల్ల వాడు కాదు.అతడు మారవచ్చు.ఇది ఎవరూ నిర్ధారణ గా చెప్పలెము. కాని ఆ మారణ కాండ చేసె ముందు మాదక ద్రవ్యాలు ఆ పది మంది(?) తీవ్రవాదులు తీసుకున్నారు.బహుశా తమకి నెప్పిని ఎక్కువ సేపు భరించగలిగి ఎదురు దాడి ఎక్కువ సేపు చెయ్యగలిగి వుండడానికి కావచ్చు.లేదా జాలి కనికరం లెకుండా అమాయకులని ఊచకోత పెట్టడానికి కావచ్చు.అంత మాత్రానా వారు మత్తు మందు ప్రభావం లో ఇది చేసారని సమర్ధించడం ….అనడానికి మాటలు రావడం లేదు.అసలే నా బ్లాగుని పిల్లలు పెద్దలు అందరు చదవాలని ఆకాంక్షిస్తున్నా!కాని ఇంకో వాదన వుంది.చావడానికి సిధ్ధ పడి వచ్చిన ఒక తీవ్రవాదిని మనం ఇంత ఖర్చు పెట్టి, ఇంత సమయం వెచ్చించి,ఇప్పుడు చంపడం లో కూడా వారిదే గెలుపు అవుతుంది అని.ఇలా ఉరి తీస్తారని భయపడి తీవ్రవాదులు మన దేశంలో అడుగు పెట్టడానికి సంకోచిస్తారా?లేదు.కాని ఒక ప్రతి దాడిలో ఒక తీవ్రవాదిని చంపడానికి, ఎంతో ఆలోచించి అతడికి ఉరి శిక్ష వేయడానికి చాలా తేడా వుంటుంది.సందర్భం వేడిలో ఆలోచితమో, అనాలోచితమో తెలీకుండా చంపడం వేరు.అతడికి తన వాదన వినిపించుకుని నిర్దోషిత్వం (?) నిరూపించుకునె అవకాశం ఇచ్చి అప్పుడు ఈ నిర్ణయానికి రావడం…తేడా లేదు?రెండిటిని ఒకే గాటిని కట్టడం సరి కాదు కదా?

మరి ఈ నిర్ణయం వలన కలిగే పరిణామాలు ఏమి కావచ్చు?కాందహార్ వంటి ఆకృత్యాలు ఆపగలిగే సత్తా లేనిదని మన దేశం పై ఒక గొప్ప అభిప్రాయం మన న్యాయ వ్యవస్థ ప్రపంచానికి తెలియబరుస్తుంది.అది కాకుండా శిక్ష విషయం లో పూర్తిగా కేసు పూర్వాపరాలు పై ఆధార పడకుండా మన ప్రభుత్వ రక్షణ దళాల సామర్ధ్యం వలన ప్రభావితం అయ్యిందని మన న్యాయ వ్యవస్థ పై కూడా ఒక చెడు అభిప్రాయం కలుగుతుంది.ఒక వ్యక్తి పై ఇంత ఖర్చు పెట్టి విచారణ జరిపినందుకు…దౌత్యపరంగా గాని, దేశ భద్రతపరం గా గాని, రక్షణ పరం గా గాని మనకి కలిగిన లాభాలు ఏమిటి?బహుశా కొన్ని జరగ బొయె దాడులు కి సంబందించిన రహస్యాలు తెలిసి వుండవచ్చు..తెలిసి వుండక పోవచ్చు.అది పెద్ద విషయం కాదు.ఇలా పట్టుబడ్డ తీవ్రవాదులు పైన మనం ఆధార పడీతే మన నిఘా వర్గాలు ఏమి చేస్తాయి?భద్రత పరంగా…జరగబొయె ఎన్ని దాడులు గురించి కసబ్ కి తెలుసు?ఆ లాభం కూడా తాత్కాలికమే!దౌత్య పరంగా దీనిని ఉపయోగించుకునే తీరు పై ఆధార పడుతుంది.ఉమ్మడి ప్రకటనలో బెలూచిస్తాను వగైరాల పై విచారణ లో సహకరిస్తాము వంటి ప్రకటనల వలన దౌత్య పరం గా మనకి చాలా నష్టం జరిగింది.అంటె లేని విషయాల వలన కూడా ప్రపంచ దేశాలలొ ఒక అభిప్రాయం కలగ జేయడం వలన మన పొరుగు దేశం దౌత్య విజయం సాధించింది.అయినా ఈ విషయాల వలన తమ దౌత్య నీతి మార్చుకునేటంత వెర్రిబాగులవి కావు ప్రపంచ అగ్ర దేశాలు.అది నెమ్మది నెమ్మదిగా మారె విషయం.ఇలాంటి విషయాలని లౌక్యంగా వాడుకోవడం పై ఫలితం వుంటుంది.కాని కొంతమంది అభిప్రాయం మన ప్రభుత్వం చేసినది సరైనదేఅని.విచారణలో తేలిన అన్ని విషయాలు మీడియా తో పంచుకోరు కాబట్టి ఎంత లాభం జరిగిందో పూర్తిగా అంచనా వెయ్యలేమన్నది నిజం.పారదర్శికత ఇలాంటి విషయాలలో కుదరదు.కాని నా లాంటి అల్ప సంతోషుల కోసమైనా మనం బొలేడన్ని విషయాలు తెలుసుకున్నామని ఢాంభికాలు పోవచ్చు కదా!దాని వలన తీవ్రవాద సంస్థలు కొంచెం ఆచి తూచి అడుగు వేస్తాయి, చేయబోయె దాడుల విషయం లో మన భద్రతా దళాలుకి ఎంత సమాచారం వుందో అన్న భయం వలన!

ఇక సూటిగా నా అభిప్రాయం చెబుతాను.వ్యంగ్యంగా రాద్దామన్న ప్రయత్నం లో ఎవరికి నా అభిప్రాయాలు సరిగా చెప్ప లేక పోతున్నాను కామోసు.ఇంటి దొంగలు తప్పించుకు పోతున్నారన్నది నా భయం, బాధ.బహుశా కసబ్ కి తెలియక పోవచ్చు.వాడికి ప్రత్యక్షంగా కలిసినవాళ్లు, వారి పైన వున్న వాళ్లు…వారి పైన వున్న వాళ్లు ఇలా ఈ గొలుసు చుట్టు తప్పకుండా ఇంటి దొంగ వద్దకి తీసుకు వెళుతుంది.మ్యాపులు అందించిన ఇద్దరు భారతీయుల పైన, వారు ఇచ్చిన మ్యాపులు కంటె గూగుల్ వారి మ్యాపులు ఇంకా వివరణాత్మకంగా వున్నాయి కాబట్టి నిర్దోషులగా వదిలి వేసింది కోర్టు.వారు చేసిన పని ఎంత తోడ్పాటు అందించిందో వేరె విషయం.వారు తెలియక చేసారా, తెలిసి చేసారా అన్నది ముఖ్యం.తెలిసి చేసి వుంటె దేశ ద్రోహ ఉద్దేశ్యం వుంటె వారికి శిక్ష పడాలి.ఇక రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ, పోలిసు వర్గాలు, కోస్టు గార్డు జనరల్, వీళ్లందరి పైన కూడా కోర్టు క్రమశిక్షణ చర్యలకి ఆదేశించాలి అన్నది మంచి వాదన.దీని వలన కూడా ఇంటి దొంగ ని పట్టుకోవచ్చు.పక్క దేశం లో మన మీద విషం కక్కుతున్నది ఒక్క జైషె మొహమ్మదు ఒక్కటె కాదు.ఇప్పుడు పక్క దేశం పైన వత్తిడీ తెచ్చి ఒకడిని కటకటాల వెనకకి పంపినా ఇంకొకడు తప్పక తయారు అవుతాడు.కాబట్టి మన కంట్లో వున్న దూలాన్ని తీసుకుని తరువాత ఎదుటి వాడి కంట్లో నలుసు చూసుకోమందాము. ఉరి శిక్ష వెసినా వెయ్యక పోయినా, ఈ విచారణ ముఖ్య ఉద్దేశ్యం, మన దేశ రక్షణకి ఉపయోగపడాలి.అంతే గాని, ప్రజల భావొద్వేగాలని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం లో ఒక పావు గా మారి పోకూడదు. కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నా పరవాలేదు,వాడిని తప్పించే ప్రయత్నాలు విచ్చిన్నం చేసె సత్తా మన బలగాలకి వుంది అని నిరూపించుకుని, ఈ విచారణని క్షుణ్ణంగా చెయ్యాలి.ఈ ఖర్చు అంతా మనం పన్నులు ద్వారా కట్టిన సొమ్ము.దీనిని సక్రమంగా వాడుతున్నారని మనకి నమ్మకం కలగాలి.తీర్పు వలన మన దేశ ప్రతిష్ఠ , న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ ఇనుమిడించాలి గాని,లోటు రాకూడదు.ఈ మాత్రం ఆశించడం కూడా అత్యాశేనా?

ప్రకటనలు