Archive for the ‘అనుభవాలు’ Category


గత వారం అర్జెంట్‌గా ఆంధ్ర ప్రదేశ్ వెళ్ళవలిసి వచ్చింది.చాలా సంవత్సరాల తరువాత మన ఎర్ర బస్సు కూడా ఎక్కడం జరిగింది.అలా అనుకోకుండా ఒక సారి ఎర్ర బస్సు ఎక్కినప్పుడు జరిగినది అందరి తో పంచుకుందామనుకున్నాను. అయితే రవిచంద్ర గారి అంతర్వాహిణి లో కూడా ఇదే విషయం గురించి ఆయన చర్చించడంతో ఈ టపా అవసరం లేదు అనుకున్నా!కాని ఒక కామెంట్ గా నా ఆలోచనలు అన్ని చెప్పడం కూడా కుదరక మనసు మార్చుకున్నాను.వైజాగ్ లో నాన్‌స్టాపు బస్సు ఎక్కి శ్రీకాకుళం వెళ్ళవలిసిన పని పడింది.అప్పటికే కొంచెం లేట్ కూడా అయిపోయింది.రాత్రి 8 గంటలకి బయలు దేరాము.రెండు గంటల ప్రయాణం!లేట్ అయితే హోటల్లు కూడా కట్టేస్తారు అని నన్ను నేనే తిట్టుకోవలిసిన పరిస్థితి.బస్సు మంచి స్పీడు మీద వుండడంతో ఆలోచనలు కట్టి పెట్టి కునుకు మొదలెట్టా. హఠాత్తుగా ధడ్ ధుడ్ మంటు శబ్దాలు.కునుకు మత్తు కళ్ళగప్పి పోయింది.ఏమయ్యిందో కాసేపటి వరకు తెలియలేదు.ఆ కాసేపటి తరువాత కూడా తెలిసినది సగం సగం!మా బస్సు లారిని గుద్దిందో లేక లారి నే మా బస్సు ని గుద్దిందో గాని,ఒక చిన్న పాటి యాక్సిడెంట్ అయ్యింది.

మా బస్సు డ్రైవరు ఒక చిన్నపాటి చేజింగ్ చేసి ఆగకుండా వెళ్ళిపోయిన లారిని పట్టుకున్నాడు.పెద్దపాటి గొడవ వేసుకున్నాడు ఆ లారి డ్రైవరు తో!లారి డ్రైవరు మటుకు ఏమి పట్టించుకోకుండా డాబాకి వెళ్ళి భోజనం చెయ్యడం మెదలెట్టాడు.మధ్యలో పాసింజర్లంతా వెర్రి మోహాలు వేసుకుని చూస్తున్నాము మా పరిస్థితి ఏంటి అని?ముందు లారి డ్రైవరిని ఆడిపోసుకున్నాము మా వాడితో కైలిసి,తరువాత నెమ్మదిగా మా పరిస్థితి ఏంటని అడిగాము వాడిని.”డిపో కి ఫోను చెయ్యాలి,ఎవరైనా వచ్చి కంప్లయింటు రాసుకుని పోలిసు రిపోర్టు రాసుకున్నాకా బస్సు కదులుతుంది” అన్నాడు. సరెలెమ్మని అందరు ఫోన్లు తీసిచ్చారు,తొందరగా అక్కడ నుండీ బయట పడుదామని.ట్విస్టు ఏమిటంటే వాడికి డిపో ఫోను నంబరు తెలీదంటా!!కుడితిలో పడ్డ ఎలుక లా తయారయింది మా పరిస్థితి!ఎవడో శనిగొట్టుగాడు మా తో పాటు బస్సు ఎక్కడం వల్లే ఇలా అయిందని ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నాము.ఇలాగయిత ఎలాగా మాపరిస్థితి అని ఒక పెద్దాయన గొడవ వేసుకున్నాడు.”మీ పరిస్థితి కి ఏమయ్యిందండీ,నా తప్పు లేకపోయినా ఈ నష్టం అంతా నా జీతంలోనె కట్ చేసి కవరు చేస్తారు” అని ఏడుపు ముఖం పెట్టాడు మా డ్రైవరు!ఏదొ ప్రైవేటు సర్వీసు అయితే ఎలగో వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి క్షమించమని అడిగెయ్యొచ్చు.ఆర్టీసు వారి కి అంత దయ ఎక్కడ?”అని అన్నాడు వాడు.ఇంతలో ఒక బస్సు అటు వైపు వస్తే దాని ఆపి మమ్మలని అందులో ఎక్కించాడు.అది కూడా డొక్కు పాసింజరు!69 రుపాయలు పెట్టి నాన్‌స్టాపు టికెట్ తీసుకుని,డొక్కు పాసింజరు లో వెళ్ళవలిసి వచ్చింది.అదే మేము పాసింజరు బస్సులో వుండి దానికి ఏదయినా రిపైరు వస్తే నాన్‌స్టాప్ బస్సు ఆపుతాడా?

అసలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సంస్థ లా పని చేస్తుందా మన ఆర్టిసీ?ఇది ప్రజల సౌలభ్యం కోసం నడుపుతున్నారా?లేక లాభ ఆపేక్ష కోసమా?ప్రజలనే కాదు,వారి సిబ్బంది కూడా ఈ డబ్బు పిశాచి లాంటి సంస్థ,దాని వెనక తోడ్పాటు అందివ్వని ప్రభుత్వం కి బలి అయ్యిపోతున్నారు.వైజాగు లో బస్సు చార్జీల కంటే ఆటో చార్జీలు చాలా తక్కువ!విధ్య,వైధ్యం మరియు రవాణా కనీస అవసరాలు కావా?ప్రభుత్వం నడిపే స్కూల్లు,ఆసుపత్రులు నష్టాల్లో వున్నాయని మూసేస్తారా?కనీసం సిబ్బంది కి కూడా జీతాలు సమకూర్చుకోలేవు కదా ఆ స్కూల్లు,ఆసుపత్రులు?అంతర్వాహిణి రవిచంద్ర గారు తమ కామెంట్ లో బిజీ వేళలో బస్సులు తక్కువని వాపోయారు.కరక్టే!కాని నేను అనేదేమంటే,రాష్ట్రం లో రోజుకి ఒక బస్సు అది కూడా ఒక్కసారే తిరిగే వూళ్ళెన్నో?మన దేశం లో అయితే అసలు బస్సు సర్వీసు లేని ప్రాంతాలు ఎన్నో కదా?అలాంటి చోట ఏ మెడికల్ ఎమర్జన్సి అయినా కేవలం రవాణా సదుపాయం లేక ఎన్ని ప్రాణాలు పోతాయో కదా?మన ప్రభుత్వాలకి ఏమి భాద్యత వుండదూ?


గత నవంబరు లో ఒకే రోజు మా స్నేహితుల్లో ముగ్గురి పెళ్ళి కుదిరింది.అందులో ఇద్దరి పెళ్ళి వైజాగు లో ,మరొకడిది నాగ్‌పూర్ లో.మోకాలిని తడుముకుంటు తెగ ఆలోచించా!చించగా మిగిలింది ఏమిటంటే వైజాగు లో ఇద్దరి పెళ్ళి అయినా ముహుర్తం టైముకి ఎవరో ఒకరి దగ్గర మాత్రమే వుండగలం,ఇంకా ఇద్దరిలో ఎవరి పెళ్ళి ముహుర్తానికి హాజరు అయినా మరొకరు ఆడిపోసుకుంటారు ఇంత దూరం వచ్చి పెళ్ళి చూడలేదు అని.అందుకని నాగ్‌పూర్ చెక్కేశా హుషారుగా,కాని నాకేమి తెలుసు పెళ్ళికని బయలు దేరి చావు చూస్తానని?

అమ్మాయి అబ్బాయి ఇద్దరు గుజరాత్ లోనే సూరత్ లో ఎస్సార్ స్టీల్స్ లో జాబు చేస్తుండెవాళ్ళు.అసలే మావాడిది లవ్‌మ్యారేజ్!అతి కష్టం మీద మావాడి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు.వాళ్ళిద్దరికి సపొర్టుగా మా స్నేహితులంతా అక్కడ నుండె ఒక టయొటా బుక్ చేసుకుని వచ్చారు.ఇంకా ట్విస్ట్ ఏమిటంటే రవిగాడి అన్న ఇంకా పెళ్ళికాని బాలా కుమారుడాయే!అన్నగాడు పెళ్ళికూతురు చెల్లికి లైను వేస్తుంటే నవ్వు ఆపుకోలేకపొయాము.వెదవకి ఇన్నాళ్ళు బుద్ది ఏమి అయ్యింది?తమ్ముడు ఎవరినో ప్రేమించి పెళ్ళి చేసుకోడానికి రెడీ అయ్యేంతవరకు మీనమేషాలు లెక్కపెట్టుకునొ,అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే వచ్చె కట్నం మీద ఆశతోనొ మంచి కాలం మించనిచ్చి,ఆకులు వెతుకుతుంటే పగలబడీ నవ్వుకున్నాము.మావాడి కజిన్ సిస్టర్ హడావుడి కూడా చూడవలిసిందే.మగపెళ్ళివారి హూందా అంతా ఆవిడ తన భుజస్కందాల పైనే మోసింది.ఎలాగంటే పెళ్ళికూతురు చీర కంటే ఖరీదైన చీర కొనుక్కుని.??!!ఆడ పెళ్ళివారిని  ఆవిడ, పెళ్ళి కూతురి చెల్లిని మా వాడి అన్నగాడు చెడుగుడు ఆడేసుకుంటుంటే మా స్నేహితులంతా కలిసి వీలయిన దగ్గరల్లా కవర్ చేసేము.చాలా రోజులు కి కలిసారు మా ఫ్రెండ్స్ అందరు.అందులో ముగ్గురు పెళ్ళి అయిన వాల్లు,ముగ్గురు బ్రహ్మచారులు.టయోటా లో వాళ్ళ ప్రయాణం ఒక పెద్ద స్టోరి.

సరయిన కాగితాలు లేని ఆ బండిని సూరత్ నుండీ నాగ్‌పూర్ కి తెచ్చెటప్పటికి తడిసి మోపెడు అయ్యిందట మావాళ్లకి.అసలే ఆ డ్రైవర్ బాగా తేడా అని మా వాళ్ళందరు అంటున్నా నేను మరుసటి రోజు మా ఫ్రెండ్ ని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కి బలవంతంగా బయలుదేరించాను.ముఖం చిటపటలాడించుకుంటూ ఆ డ్రైవర్ ఎలాగో బయలుదేరినా కొద్ది దూరం వెళ్ళటప్పటికే ఒక సైకిల్ కుర్రాడిని గుద్దేసి, నా సరదా కూడా తీర్చేసాడు.అది కూడా ట్రాఫిక్ సిగ్నల్ కి ఎదురుగా!!అటు సైకిల్ కుర్రాడికి ,ఇటు ట్రాఫిక్ పోలీసులకి చదివించుకున్నాకా ఇక పెళ్ళిలో చదివించడానికి పెద్దగా మిగల్లేదు!బుద్దొచ్చింది నాకు కూడా.మా కాటేజ్ కి ఎదురుగా వాడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కుర్చున్నా కాళ్ళీడదీసుకుంటూ, తిరిగాము మేము ఆ తరువాత! ఆ రోజు మధ్యాహ్నం నేను ఎదురుగా హోటల్లో టీ తాగుతున్నప్పుడు ఒక టీ వాడికి పంపి శాంతి ఒప్పందం చేసుకున్నాను.మనిషి మంచోడె! మళ్ళీ మనకి అవసరం పడినప్పుడు కుట్ర పన్ని జేబులో దాచుకున్న నాలుగు రాళ్ళు రాలగొట్టడని!

ఇంకా ఆడ పెళ్ళివాళ్ళు పూర్తిగా ఉత్తర భారత  సంప్రదాయాలు పాటించారు.సాయంత్రం పెళ్ళి కొడుకుని తెచ్చెటప్పుడు వాళ్ళలోనే కొంతమంది,బారాతి గా బయలుదేరి డాన్సులు చెయ్యడం మొదలు పెట్టారు.ఇంకా మాకు తప్పింది కాదు.మగ పెళ్ళివారికి ఇది అలవాటు లేదాయే!తెగ ఇబ్బంది పడిపోయారు.వాళ్ళు ఇబ్బంది పడ్డంత వరకు మాకు ఇబ్బంది అనిపించలేదు కాని,మా వాడిని కూడా కారు దింపి డాన్సు చెయ్యడానికి పిలవమని పెళ్ళికూతురి చెల్లి మా రవి గాడి అన్నని అడిగింది.అన్న కూడా మేము వెళ్ళి బలవంతం చేస్తే కారు దిగిన మా వాడు ప్రళయ తాండవం మొదలు పెట్టాడు.అయితే మమ్మల్ని తన్నేటట్టు కాళ్ళు చేతులు విసరడం లేక పోతె అసహ్యంగా నడుము వూపడం!!బిత్తర చూపులు చూడడం ఆడ పెళ్ళి వారి వంతయ్యింది.కళ్యాణ మండపం కి చేరుకున్నాక కొంత సేపు సేద తీరి,బయటకి వచ్చాము చల్లగా ఏమయినా తాగుదామని గార్డెన్లోకి.

ఇంతలో మా కాటేజ్ కి ఎదురుగా వున్న హోటెల్ సప్లయర్ ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి చెప్పాడు మా డ్రైవర్ పడిపోయాడు  అని.అప్పుడే వాడు చేసిన నిర్వాకాల గురించి తిట్టుకుంటున్నాము మేము.తెగ సిగరెట్లు కాలుస్తున్నాడు తొందరగా పోతాడని.ఇది వినగానే వడి వడిగా పరిగెట్టుకుంటు అక్కడికి వెళ్ళాము.నోటి దగ్గర నురగ.ఫిట్సా అని కంగారు పడుతుంటే హోటెల్ వాడు చెప్పాడు స్పృహ తెప్పించడానికి తానే వుల్లిపాయ పెట్టానని.గుండెల్లో మంటగా వుంది,తిన్నదరగలేదేమోనని తన దగ్గర డైజిన్ మాత్రలు తీసుకున్నాడని చెప్పాడు.భారీ విగ్రహమాయె!కిందపడ్డవాడిని సరిగా పెట్టడానికి చాలా కష్టం అయ్యింది.శ్వాస ఆడుతున్నట్టూ అనిపించింది?పక్కనే వున్న చిన్న హాస్పిటల్కి తీసుకెల్లాము.ఎమర్జెన్సీ సర్వీసు వుంది అని బోర్డు వున్నా డాక్టరు లేరని నర్సు అడ్మిట్ చేసుకోలా.అసలు పెళ్ళి హడావుడీ లో వున్నారు కదా అని మా వాళ్ళెవరి కి చెప్పొద్దని ఒక ఫ్రెండ్ ని అక్కడే వదిలి మిగిలిన వాళ్ళం హాస్పిటల్ కి బయలు దేరాము. 

దారి పొడుగునా కృత్రిమ శ్వాస అందివ్వడానికి ప్రయత్నించాను.కాని భయం తో మెదడు మొద్దుబారి పోయింది.టయోటా నడుపుతున్న మా ఫ్రెండ్ కూడా డ్రైవింగ్ కి కొత్త.ఈ పరిస్థితి కి ఇంకా భయపడిపోయాడు.హాస్పిటల్ చేరుకునేటప్పటికే గుండె పోటు తో   చనిపోయాడని ధృవీకరించారు డాక్టర్లు.అప్పటి వరకు వాడినే సిగరెట్లు ఎక్కువ కాలుస్తాడు ఎక్కువ కాలం బతకడు అని తిట్టిన మా ఫ్రెండ్ కంటి కొలుకన కన్నీటి చుక్క!తన మాట నిజమయ్యిపోయిందేమో అని?దారి పొడుగున వాడికి ఏమి కాదు అని హడావిడీ చేస్తు మాకు ధైర్యం చెప్పి వచ్చి రాని కృత్రిమ శ్వాస అందించిన వాడు స్తబ్దుగా వుండిపోయాడు.అందరికి షాక్!వాడి సామానులు మాకు ఇచ్చేసారు.అందులో ఫోను తీసుకుని నంబర్లు చెక్ చేసాను.లక్కీగా వాడి ఇంటివాళ్ళ నంబర్లు కాకుండా ఇంకొన్ని నంబర్లు వున్నాయి.తక్కువ సార్లు ఫోను చేసిన నంబరికి చేసి వాడి ఇంటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను.ఒక రెండు మూడు ఫోను కాల్స్ తరువాత వాడి ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసు నంబరు దొరికింది.వాడి ఒక్కగానొక్క కూతురి పుట్టిన రోజంట ఆ రోజు.సెలవు అడిగినా ఇవ్వనందుకు చాలా కోపంగా వున్నాడని,అతడు వాపోయాడు.

మార్చురి కూడా లేని ఆ హాస్పిటల్ నుండీ గవర్నమెంట్ హాస్పిటల్ కి బాడీ వాన్ లో తీసుకు వెళ్ళేటప్పుడూ చాలా భయ పడ్డాము.మా కళ్ళ ఎదుటే బాడీ నల్ల పడిపోవడం,కళ్ళ నుండీ ,చెవుల నుండీ నీళ్ళు కారుతుంటే చావుని అంత దగ్గర నుండి చూసి వణికిపోయాము.గవర్నమెంట్ హాస్పిటల్ లో పోలీసుల విచారణ,అనుమానపు చూపులు రాత్రి రెండు వరకు భరించి,పెళ్ళి అయ్యేంత వరకు ఆగి అప్పుడూ మా స్నేహితుడు ద్వారా పెళ్ళి కూతురు తండ్రి తాలుకు వారికి కబురు పెడితే వారు వచ్చి మమ్మల్ని తొందరగా ఆ వాతావరణం నుండి బయటకి రావడానికి ఇంఫ్లుయెన్స్ ఉపయోగించారు.పెళ్ళి బాగానే జరిగిందట!థాంక్‌గాడ్ !!కాకపోతె వాడి బాడీ రికవరీ చేసుకునేటప్పటికి వాడి ఇంటివాళ్ళకి మూడు రోజులు పట్టిందట!!!! 

  జీవితం ఎంత క్షణ భంగురం?