Archive for the ‘రాజకీయం’ Category


వేడి వాడి విషయం మీద ఇన్ని వేరు వేరు అభిప్రాయాలు, అవి కూడా చదవగానె అప్పటికి పూర్తిగా సరైనదే అని అనిపిస్తుంటె ఏమని కామెంటాలో తెలియక తికమకలో ఈ టపా…సాధారణంగా నేను ఒక అభిప్రాయానికి బానిస అవ్వదలుచుకోను.నా అభిప్రాయం మార్చుకోవడానికి సిగ్గు పడను.మార్పు ఒక ఆరొగ్య కరమైన అలవాటు అని నా అభిప్రాయం.ఈ అభిప్రాయం కూడా మారవచ్చు:-)

క్రిందటి టపాలో మన న్యాయ వ్యవస్థ పైన నా ఆక్రోషం వెలిబుచ్చాను.అయితే వచ్చిన కామెంట్లన్ని కూడా వేరే వేరే విషయాల పైన….నాకు అర్ధం అయ్యిపోయింది, నేను రాద్దామనుకున్నది నాకు తప్ప ఇంకెవరి అర్ధం కాలేదు అని:-)తప్పు మీది కాదు లెండి. ఈ సారి కొంచెం స్పష్ఠత కోసం ప్రయత్నిస్తాను.

మన న్యాయ వ్యవస్థ ముందు నుండీ ఇంతే…..ఒక రాజకీయ నాయకుడు లేక ఒక పై హోదాలో వున్న అధికారి పై తీవ్రమైన ఆరోపణలు వచ్చినా , వారు అరెస్ట్ అవ్వడం అరుదు.అయ్యినా బెయిలు మీద బయటకి రాకుండా వుండడం ఇంకా అరుదు.బెయిలు పైన బయటికి వచ్చినా తమ అధికారాన్ని, పలుకుబడిని దుర్వినియోగ పరచకుండా వుండడం ఇంకా ఇంకా అరుదు.అటువంటి వారి పైన కేసులు విచారణలు నత్త నడక నడుస్తాయి.వారి వలన సాక్ష్యాలు,విచారణ కూడా ప్రభావితం అవుతాయి.మరి కసబ్?కారాగారం లో వున్న ముద్దాయి.మన రక్షణ బలగాల సామర్ధ్యం అందరికి తెలిసినదే!ఎక్కువ కాలం కారాగారంలో వుంచలేమని మన ప్రభుత్వం చాటుకుంటుందా?ఇది విచారణ అలవాటుకి భిన్నంగా ఇంత ఆదరా బాదరా గా చెయ్యడం పైన్ నా అభిప్రాయం.

ఇక శిక్ష గురించి…. నా ముందటి టపాలో ఉరి శిక్ష కసబ్ చేసిన నేరం కి సరైనదా కాదా అన్నది చర్చించలేదు.నేను కేవలం అన్నది ఈ శిక్ష పడుతుందని నాకనిపిస్తుందని.దానిని సమర్ధించలేదు..అలాగె వ్యతిరేఖించలేదు.ఇప్పుడు నా అభిప్రాయం…అవును కసబ్ తనకి తాను గా ఒక తీవ్రవాది అయ్యాడు.తన అంగీకారం తోనె జిహాదిగా భారత్ లో అడుగు పెట్టాడు.చావుకి సిధ్ధ పడె ఇక్కడకి వచ్చాడు.పేదరికమా… ఆకలా… లేక మత మూఢత్వమా?మనకి తెలియదు.యువకుడు, పాపం ఏవొ బలీయమైన కారణాల వలన ఇలా చేసి వుండవచ్చు?ఒక అవకాశం ఇద్దాము.మారిపోయి సమాజానికి మంచి చేస్తాడు అనే వారు కూడా వున్నారు.అతడు మరీ మంచి చెడు తెలియని చిన్న పిల్ల వాడు కాదు.అతడు మారవచ్చు.ఇది ఎవరూ నిర్ధారణ గా చెప్పలెము. కాని ఆ మారణ కాండ చేసె ముందు మాదక ద్రవ్యాలు ఆ పది మంది(?) తీవ్రవాదులు తీసుకున్నారు.బహుశా తమకి నెప్పిని ఎక్కువ సేపు భరించగలిగి ఎదురు దాడి ఎక్కువ సేపు చెయ్యగలిగి వుండడానికి కావచ్చు.లేదా జాలి కనికరం లెకుండా అమాయకులని ఊచకోత పెట్టడానికి కావచ్చు.అంత మాత్రానా వారు మత్తు మందు ప్రభావం లో ఇది చేసారని సమర్ధించడం ….అనడానికి మాటలు రావడం లేదు.అసలే నా బ్లాగుని పిల్లలు పెద్దలు అందరు చదవాలని ఆకాంక్షిస్తున్నా!కాని ఇంకో వాదన వుంది.చావడానికి సిధ్ధ పడి వచ్చిన ఒక తీవ్రవాదిని మనం ఇంత ఖర్చు పెట్టి, ఇంత సమయం వెచ్చించి,ఇప్పుడు చంపడం లో కూడా వారిదే గెలుపు అవుతుంది అని.ఇలా ఉరి తీస్తారని భయపడి తీవ్రవాదులు మన దేశంలో అడుగు పెట్టడానికి సంకోచిస్తారా?లేదు.కాని ఒక ప్రతి దాడిలో ఒక తీవ్రవాదిని చంపడానికి, ఎంతో ఆలోచించి అతడికి ఉరి శిక్ష వేయడానికి చాలా తేడా వుంటుంది.సందర్భం వేడిలో ఆలోచితమో, అనాలోచితమో తెలీకుండా చంపడం వేరు.అతడికి తన వాదన వినిపించుకుని నిర్దోషిత్వం (?) నిరూపించుకునె అవకాశం ఇచ్చి అప్పుడు ఈ నిర్ణయానికి రావడం…తేడా లేదు?రెండిటిని ఒకే గాటిని కట్టడం సరి కాదు కదా?

మరి ఈ నిర్ణయం వలన కలిగే పరిణామాలు ఏమి కావచ్చు?కాందహార్ వంటి ఆకృత్యాలు ఆపగలిగే సత్తా లేనిదని మన దేశం పై ఒక గొప్ప అభిప్రాయం మన న్యాయ వ్యవస్థ ప్రపంచానికి తెలియబరుస్తుంది.అది కాకుండా శిక్ష విషయం లో పూర్తిగా కేసు పూర్వాపరాలు పై ఆధార పడకుండా మన ప్రభుత్వ రక్షణ దళాల సామర్ధ్యం వలన ప్రభావితం అయ్యిందని మన న్యాయ వ్యవస్థ పై కూడా ఒక చెడు అభిప్రాయం కలుగుతుంది.ఒక వ్యక్తి పై ఇంత ఖర్చు పెట్టి విచారణ జరిపినందుకు…దౌత్యపరంగా గాని, దేశ భద్రతపరం గా గాని, రక్షణ పరం గా గాని మనకి కలిగిన లాభాలు ఏమిటి?బహుశా కొన్ని జరగ బొయె దాడులు కి సంబందించిన రహస్యాలు తెలిసి వుండవచ్చు..తెలిసి వుండక పోవచ్చు.అది పెద్ద విషయం కాదు.ఇలా పట్టుబడ్డ తీవ్రవాదులు పైన మనం ఆధార పడీతే మన నిఘా వర్గాలు ఏమి చేస్తాయి?భద్రత పరంగా…జరగబొయె ఎన్ని దాడులు గురించి కసబ్ కి తెలుసు?ఆ లాభం కూడా తాత్కాలికమే!దౌత్య పరంగా దీనిని ఉపయోగించుకునే తీరు పై ఆధార పడుతుంది.ఉమ్మడి ప్రకటనలో బెలూచిస్తాను వగైరాల పై విచారణ లో సహకరిస్తాము వంటి ప్రకటనల వలన దౌత్య పరం గా మనకి చాలా నష్టం జరిగింది.అంటె లేని విషయాల వలన కూడా ప్రపంచ దేశాలలొ ఒక అభిప్రాయం కలగ జేయడం వలన మన పొరుగు దేశం దౌత్య విజయం సాధించింది.అయినా ఈ విషయాల వలన తమ దౌత్య నీతి మార్చుకునేటంత వెర్రిబాగులవి కావు ప్రపంచ అగ్ర దేశాలు.అది నెమ్మది నెమ్మదిగా మారె విషయం.ఇలాంటి విషయాలని లౌక్యంగా వాడుకోవడం పై ఫలితం వుంటుంది.కాని కొంతమంది అభిప్రాయం మన ప్రభుత్వం చేసినది సరైనదేఅని.విచారణలో తేలిన అన్ని విషయాలు మీడియా తో పంచుకోరు కాబట్టి ఎంత లాభం జరిగిందో పూర్తిగా అంచనా వెయ్యలేమన్నది నిజం.పారదర్శికత ఇలాంటి విషయాలలో కుదరదు.కాని నా లాంటి అల్ప సంతోషుల కోసమైనా మనం బొలేడన్ని విషయాలు తెలుసుకున్నామని ఢాంభికాలు పోవచ్చు కదా!దాని వలన తీవ్రవాద సంస్థలు కొంచెం ఆచి తూచి అడుగు వేస్తాయి, చేయబోయె దాడుల విషయం లో మన భద్రతా దళాలుకి ఎంత సమాచారం వుందో అన్న భయం వలన!

ఇక సూటిగా నా అభిప్రాయం చెబుతాను.వ్యంగ్యంగా రాద్దామన్న ప్రయత్నం లో ఎవరికి నా అభిప్రాయాలు సరిగా చెప్ప లేక పోతున్నాను కామోసు.ఇంటి దొంగలు తప్పించుకు పోతున్నారన్నది నా భయం, బాధ.బహుశా కసబ్ కి తెలియక పోవచ్చు.వాడికి ప్రత్యక్షంగా కలిసినవాళ్లు, వారి పైన వున్న వాళ్లు…వారి పైన వున్న వాళ్లు ఇలా ఈ గొలుసు చుట్టు తప్పకుండా ఇంటి దొంగ వద్దకి తీసుకు వెళుతుంది.మ్యాపులు అందించిన ఇద్దరు భారతీయుల పైన, వారు ఇచ్చిన మ్యాపులు కంటె గూగుల్ వారి మ్యాపులు ఇంకా వివరణాత్మకంగా వున్నాయి కాబట్టి నిర్దోషులగా వదిలి వేసింది కోర్టు.వారు చేసిన పని ఎంత తోడ్పాటు అందించిందో వేరె విషయం.వారు తెలియక చేసారా, తెలిసి చేసారా అన్నది ముఖ్యం.తెలిసి చేసి వుంటె దేశ ద్రోహ ఉద్దేశ్యం వుంటె వారికి శిక్ష పడాలి.ఇక రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థ, పోలిసు వర్గాలు, కోస్టు గార్డు జనరల్, వీళ్లందరి పైన కూడా కోర్టు క్రమశిక్షణ చర్యలకి ఆదేశించాలి అన్నది మంచి వాదన.దీని వలన కూడా ఇంటి దొంగ ని పట్టుకోవచ్చు.పక్క దేశం లో మన మీద విషం కక్కుతున్నది ఒక్క జైషె మొహమ్మదు ఒక్కటె కాదు.ఇప్పుడు పక్క దేశం పైన వత్తిడీ తెచ్చి ఒకడిని కటకటాల వెనకకి పంపినా ఇంకొకడు తప్పక తయారు అవుతాడు.కాబట్టి మన కంట్లో వున్న దూలాన్ని తీసుకుని తరువాత ఎదుటి వాడి కంట్లో నలుసు చూసుకోమందాము. ఉరి శిక్ష వెసినా వెయ్యక పోయినా, ఈ విచారణ ముఖ్య ఉద్దేశ్యం, మన దేశ రక్షణకి ఉపయోగపడాలి.అంతే గాని, ప్రజల భావొద్వేగాలని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నం లో ఒక పావు గా మారి పోకూడదు. కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నా పరవాలేదు,వాడిని తప్పించే ప్రయత్నాలు విచ్చిన్నం చేసె సత్తా మన బలగాలకి వుంది అని నిరూపించుకుని, ఈ విచారణని క్షుణ్ణంగా చెయ్యాలి.ఈ ఖర్చు అంతా మనం పన్నులు ద్వారా కట్టిన సొమ్ము.దీనిని సక్రమంగా వాడుతున్నారని మనకి నమ్మకం కలగాలి.తీర్పు వలన మన దేశ ప్రతిష్ఠ , న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠ ఇనుమిడించాలి గాని,లోటు రాకూడదు.ఈ మాత్రం ఆశించడం కూడా అత్యాశేనా?

ప్రకటనలు

మన దేశ చరిత్ర లోనె అత్యంత వేగవంతంగా విచారణ జరుపుకున్న చారిత్రకమైన కేసుగా అందరు ముంబయి దాడుల పైన ఉగ్రవాద వ్యతిరేక స్పెషల్ కోర్టు వారి విచారణని అనుకుంటున్నారు.గొప్ప విషయమే!ప్రజల మనొభావాలకి , దేశ భక్తి తదితర ఉగ్వేదాలకి బాగా సంబంధించిన విషయం కదా!అందుకేనా మన ప్రభుత్వం ప్రత్యేక శ్రధ్ధ తీసుకుని త్వరితగతిన ఈ కేసు ఒక కొలుక్కి వచ్చినట్టు చేసింది? లేక పక్క దేశానికి ఒక ఉదాహరణగా ఈ కేసుని చూపించి వారి వైపు నుండీ కూడా ఇలాంటి ఫలితాన్నె ఆశించి ఇలా చేసిందా?అదే కనుక అసలు ఉద్దేశ్యం అయితే మనం (ప్రజలు అని అర్ధం, ఈ పాడు రాజకీయ పార్టీలో, పనికి మాలిన ప్రభుత్వాల గురించి కాదు అంటుంది. )మెచ్చుకోతగ్గ ఫలితాలు అందవు.ఎందుకో కొంచెం వివరంగా చెబుతా! అసలు మనకి అలవాటు లేని పని చేస్తె ఫలితాలు ఎలా వుంటాయి?పులి ని చూసి నక్క వాతలు పెట్టుకుంటె ఎలా వుంటుంది? లతా మంగేష్కర్ బ్రేక్ డాన్స్, ప్రభు దేవా గానాలాపన చేస్తె ఎలా వుంటుంది?మన దేశ న్యాయ వ్యవస్థకి అలవాటు లేని విధంగా ఇలా తొందర తొందరగా కంగారుగా , నిఝంగానె వేగవంతంగా పూర్తి చేద్దామనుకున్న ఈ కేసు వలన మనం నేర్చుకోవలసిన గుణపాఠాలు నేర్చుకోగలిగామా? పోని తొందరగా పూర్తి చేద్దామనుకున్నప్పుడూ పధ్ధతి ఏమిటి? ముఖ్యమైన విషయాల పైనే పూర్తి శ్రధ్ధ పెట్టడమా?లేక అన్ని విషయాలని పై పైన చూసి ఒక నిర్ణయానికి రావడమా?అజ్మల్ కసాబ్ పైన పెట్టిన ఆరోపణలు ఎన్నో తెలుసాండీ?ఎనభై మూడు! అవును అక్షరాలా ఎనభై మూడు!! చాలా తక్కువ కదూ!అందుకే వాడు వాడికి వాడే విసుగుతో ఉరి వేసుకు చావక ముందే తీర్పు వచ్చింది.శిక్ష ఇంకా తేల్చవలిసి వుంది.అది కూడా తొందరగానే వచ్చేస్తుందట!అసలు అన్ని ఆరోపణలు కాకుండా ధృఢంగా ఒకటి రెండు ఆరోపణలు చాలవా?అందరి కళ్లెదుట జరిగినదానిని కూడా నిరూపించలేమని భయమా పబ్లిక్ ప్రాసిక్యూసిన్ వారికి?

ఎలాగు వాడు ఈ తీర్పు పైన హై కోర్టుకి, అక్కడ కూడా తీర్పు బాగోక పోతె సుప్రీము కోర్టుకి ,ఒక వేళ అక్కడ కూడా వాడికి నచ్చని విధంగా తీర్పు వస్తె రాష్ట్రపతి క్షమాభిక్షకి ప్రయత్నిస్తాడు కదా!(క్షమా భిక్ష అని అన్నానంటె వాడికి ఏ శిక్ష పడుతుందనుకుంటున్నానొ అర్ధం అయ్యింది కదా!)ఎలాగు ఇవన్ని పూర్తి అయ్యెటప్పటికి పుణ్యకాలం కాస్త తీరి పోతుంది. వాడిని చంపేద్దామా వద్దా అని మన వాళ్లు ఒక నిర్ణయానికి వచ్చెలోపు వాడే చచ్చి ఊరుకుంటాడు.కాబట్టి అప్పటికల్లా చాలా సమయం వుంది కాబట్టి, తాము తరచి చూసినా ఈ అధారాలు, సాక్ష్యాలు గట్రా పైవాళ్లు ఎలాగు చూస్తారనుకుని ఇప్పుడు అలా పై పైన చూసి ఊరుకోలేదు కదా!ఛా నాకు తెలుసు లెండి.మన ప్రజాస్వామ్యానికి నాలుగు స్థంభాలలో ముఖ్యమైన న్యాయ వ్యవస్థ ఇంకా అంత భ్రష్టు పట్టి పోలెదు, నేను ఒప్పుకుంటాను.ఇదంతా పని ఒత్తిడే కావచ్చు.ఆ…… అక్కడ కొంతమంది లంచగొండి న్యాయమూర్తులు వుండవచ్చు గాని మొత్తం వ్యవస్థగా చూస్తె,మిగిలిన వాటికి కంటె చాలా బెటరు.అంతే కదా!ఏ మొక్క లేనప్పుడు, కొత్తిమీర మొక్కే మహా వృక్షం.కాబట్టి న్యాయ వ్యవస్థ తప్పు లేదు అని రూఢిగా(?) చెప్పవచ్చు!

అసలు వీడిని ప్రాణాలతో పట్టుకుని మనవాళ్లు సాధించిన గొప్ప ఏంటో తెలియదు. మహా అయితే వాడి జాతీయత ప్రపంచానికి నిరూపించగలిగాము!వాడి మీద పెట్టిన ఖర్చుకి గిట్టుబాటు అయినట్టెనా?లేక అప్పుడే లేపేసి వుండాల్సిందా?ఏవొ కొంత మంది పేర్లు చెప్పాడు అని అంటున్నారు.కాని వాటి వలన మనం సాధించిన దౌత్య విజయాలు(?) ఏమిటి? ఈ ఇజ్రాయిలు, అమెరికాలు ఆ మాత్రం సాక్ష్యాలు లేక పోయినా మనని సమర్ధించేవి!ఈ చైనా వగైరాలు అవి వున్నా మనని వ్యతిరేకించేవి!మరి లాభం!ఈ విషయంలో నిజానిజాలు ఏమైనా సామాన్యుడిని వంచించె వ్యవస్థలు, ప్రభుత్వాలు వున్నంత వరకు,మనకి మిగిలేవి ఈ ఊహాగానాలే!వీటి అన్నిటికంటె నాకు అనిపించే అతి పెద్ద అనుమానం ఏమిటంటె, అసలు ఇంటిదొంగని (ఏదొ పెద్ద చేపే అయ్యుంటాది) వదిలేసె ప్రయత్నం కాదు కదా!ఇలాంటి ఆదరాబాదరా విచారణే పక్క దేశస్థులు కూడా చెయ్యాలనా మనం కోరుకోవాలి?చిన్న చేపలు మాత్రమేనా మనం పట్టుకోవలిసింది?పెద్ద చేపలు అసలు లేనె లేవా?వాడిని సులభంగా చంపేసె కంటె చావు అంటే భయం కలిపించి, వాడితో రాబట్టగలవలసినంతా రాబట్టి అప్పుడూ ఏమన్నా చేస్తె మంచిది అనుకుంటాను.

అసలు తొందరగా తీర్పు రావలిసిన కేసుల విషయంలో ఎక్కడ లేని జాప్యం చేస్తారు.ఏ మాజీ ప్రధాని మీదో,మాజి ప్రధాని కొడుకో మీదొ ఆయన చచ్చేటంతవరకు, తీర్పు రాదు.అది ఎంత అకస్మాత్తు మరణమైనా కానివ్వండి,ఎంత హృదయవిదారకమిన మరణమైనా కానివ్వండి, అతడిని దోషా, కాదా అన్నది తెలియబర్చవచ్చు కదా!తమ అధికార బలం తో తమ మీద కేసు పెట్టిన వాళ్లని చిత్రహింస పెట్టి, వారి చావుకి కారణమైనా వారిని,ముదు ముసలి కాలం వచ్చెటంత వరకు, కేసు నాన్చుతారు, అంతెగాని, మన కస్టడిలో వున్న వాడి పై ఆదరా బాదరాగా కేసు పూర్తి చేస్తారు.అసలు విషయం ఏదన్నా వుంటె అది బయటికి రాకూడదని అంతె తొందరగా మఠాష్ చేసినా ఆశ్చర్య పోనక్కరలేదు.నిఝం ఎప్పటికి ఇక బయటికి రాదు కదా!సంతోషించవలసిన విషయమే!మీ ఉద్దేశ్యం?


టాపిక్ అలాంటిదండి,అందుకే ముందుగా క్షమాపణలు అడిగేస్తున్నా!ఈ రోజు ఉదయం అర్జెంట్ పని మీద బైక్ మీద బయటికి వెళ్లాల్సిన పని పడింది.కొద్ది దూరం వెళ్లిన తరువాత బండిలో చూస్తే తైలం తక్కువనిపించింది.సరెలెమ్మని పెట్రోల్ బంకు కి వెళ్తే తాళ్లు దారాలు కట్టి ఎంట్రన్సు దగ్గర అడ్డం పెట్టారు.అయినా లోపలికి వెళ్లేవాళ్లు వెళుతున్నారు కదాని నేను కూడా వెళ్లా!తీరా చూస్తె త్రివర్ణ జెండా(జాతీయ జెండా కాదులెండి ఒక పార్టీ జెండా) పట్టుకుని కొంతమంది బంకు ఓనరు తో ‘బందు కరో బందు కరో’అని అరుస్తున్నారు.ఏమిటబ్బ విషయం అని అడిగితే నిన్న దంతేవాడ జిల్లాలో నక్సల్స్ దాడి కి వ్యతిరేకం గా చత్తీస్‌ఘడ్ ప్రతిపక్షం వాళ్లు కర్రలు గట్రా పట్టుకుని చాలా శాంతియుతంగా ధర్నా చేస్తున్నారంటా.అదే చెప్మా ఏంటి రోడ్లు కూడా ఇంత ప్రశాంతంగా వున్నాయని అప్పటివరకు అనుకుంటున్నా.బస్సులు తదితర రవాణా సదుపాయాలు కూడా ప్రభావితం అయ్యాయి.ఇంతలో ఒక పెద్దాయన బాటిల్ పట్టుకుని పెట్రోలు కోసం వచ్చాడు.ఎంత అవసరమో మరి అంతలా బతిమాలాడాడు.ఒక పోలిసు జోక్యం పుణ్యమా అని బంకు వాడు పెట్రోలు పోసాడు.ఆ పోలిసు జోక్యం చేసుకోకపోతె వాళ్లు మటుకు ఉపేక్షించేటట్టు అస్సలు లేరు,వారి సొమ్మేమి పోతుందొ మరి!

అసలు ఈ బందులు గట్రా కేవలం వారి బల ప్రదర్శన కోసమే తప్ప ప్రజల సమస్యలు వారికేమి పడతాయి?ఓ రెండు నెలల కిందట ఇక్కడి అధికార పార్టి కేంద్ర ప్రభుత్వం కి వ్యతిరేకంగా ధరల పెంపు  పైన తీవ్రమయిన బందు చేసింది.అసలే పవర్ లో వున్న పార్టి!ఇక పోలిసులు కూడా బందు పూర్తిగా సఫలం కావడానికి తమ వంతు కృషి చేసారు.అసలు ప్రజల అత్యావసరాలు కి ఏ మాత్రం లోటు రానివ్వం,ప్రజల వాహనాల రాక పోకలని అడ్డుకోము అన్నా వీళ్లు సొంత వాహనాలు లేని వారి పరిస్థితి పట్టించుకోరేమి?ఒక మందు మాకు కొందామన్నా,వెళ్లి రావడానికి పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వుండదు.ఆ రొజయితే ATMలు కూడా బందు చేసారు.పెట్రోలు బంకులు చెప్పక్కరలేదు.అసలు ధరలు పెంచింది కేంద్ర ప్రభుత్వం అయితే వీళ్లని ఎన్నుకున్న పాపానికి ఈ ప్రజలిని ఇలా ఎందుకు హింసించారో అర్దం కాదు.

అక్కడికి ధరలు వీళ్లే పెంచినట్టు.బహుశా కేంద్రం తమ ప్రత్యర్ది పార్టి వారిని గెలిపించినందుకు శిక్ష కాబోసు!ఇక మీదట బుద్దొచ్చి కేంద్ర రాష్ట్రాలలో ఎవరొ ఒకరినే గెలిపించాలి.ఈ రోజు విషయానికి వస్తే అసలు నక్సల్స్ మీద తమ అసంతృప్తి వెలిబుచ్చడానికి వీళ్లకి మామూలు ప్రజానికమే దొరికారా?వెళ్లి ఆ దండకారణ్యంలోనె నక్సల్స్ దగ్గరికి వెళ్లి తమ అసంతృప్తి తెలియబరచవచ్చు కదా.మామూలు జనం పోలిసు బలగాలని చంపిందా ఏమిటి?అసలు పాకిస్తాను లో క్రిందిటేడాది పోలిసు కేంపు మీద తీవ్రవాదులు దాడి చేస్తె మన దేశ మీడియా ఎద్దేవా చేసింది కదా?మరి మన దేశ పోలిసులుకి మాత్రం తమని తామే కాపాడుకోలెని దీన అవస్థలో వున్నారు కదా,ఇంక మామూలు ప్రజలని ఏమి కాపాడుతారని అడగరేమి?ఒహో అందరు సానుబూతి తెలపడం లో బిజిగా వున్నట్టు వున్నారు?ఇప్పుడూ ఇలాంటివి అడిగితే తప్పుగా అనుకుంటారేమో?అలా అన్నానని మీరు తప్పుగా అనుకోవద్దండీ!


ఇంక మగ మహరాజులు కి దిక్కేమిటి?ఇప్పటికే జరగవలిసినది జరిగిపోయింది,జరగాల్సినదైనా జరగక మానితె మనకు మేలు!!!రాజ్యసభలో మహిళాబిల్లు పాసయ్యిపోయింది.పాపం మన యాదవ బంధువులు తమ వంతు కృషి చేసినా ఫలం దక్కలేదు!!!అయినా మగవాడికి మగవాడే శతృవు అని ఊరకనే అనలేదు.ఇంత మంది మగవాళ్ళు చట్టసభల్లో వుండగా కూడా ఈ అన్యాయం ని ఆపలేదు.హూ !!ఏమి చేస్తాము ?ఎప్పుడు కూడా ఆడవారిదే కదా ఆధిపత్యం!!సృష్టి మొదలు నుండి ఇదే పద్దతి!ఆదిశక్తి నుండె ఈ పురుష వివక్ష మొదలు అయ్యింది.అప్పుడు ఏదొ మన జగన్నాటక సూత్రధారి  అడ్డుచక్రం వేసాడు కాబట్టి సరిపోయింది.మరి ఇప్పుడు ఏమయ్యావయ్యా నువ్వు?ఏదో ఒకటి చెయ్యు మరి?

చిన్నప్పటి నుండీ చూస్తున్నాను ఈ ధొరణి!అక్క పుట్టినప్పుడు మహాలక్ష్మి పుట్టిందన్నారు,మరి నేను పుట్టినప్పుడో? అక్క అల్లరి చేస్తె అందంగా వుందన్నారు,ముచ్చట పడిపోయారు!మరి నేను అల్లరి చేస్తె వీపు చీరేసారే?తప్పు చేసినా అక్క కి మంచి బుద్దులు చెప్పారు,మనకేమొ దవడ మీద ఒకటి ఇచ్చారు?స్కూలు కెల్లినా టీచర్లు,మాష్టార్లు అమ్మాయిలు తెలివైన వాళ్ళు ఒక్కసారి చెబితే చాలు అని, మమ్మల్ని మట్టిబుర్రలనే వాళ్ళు. హొము వర్క్ చెయ్యకపోతె మా వీపు చేరేసెవాళ్ళు,మరి అమ్మాయిలను?కొంచెం పెద్దయ్యాక చిరు తిళ్లు కొనుక్కోవడానికి కూడా మాకు మటుకు డబ్బులిచ్చేవాల్లు కాదు, చెడిపోతామని! అమ్మాయిలకి మటుకు పౌడర్లు,కాటుకలు ,జడ రిబ్బన్లు మన్ను మశానం ఇంకా మా పిండా కూడు ఒకటే తక్కువ!!కాసేపు క్రికెట్ ఆడుకుని లేటుగా ఇంటికి వస్తే బెత్తం పట్టుకుని తలుపు దగ్గరే మంగళ హారతులు!! అదే అమ్మాయిలకు ఎప్పుడైనా అల్లాంటి సత్కారాలు జరిగాయా?కొంచెం వయసు వచ్చి బయటకి వస్తే….. 

సిటి బస్సుల్లో వాళ్ళ సీట్లో ఎలాగు వాళ్ళే కుర్చుంటారు,మన సీట్లు ఆక్రమించెస్తారు!!పొరపాటున పక్క సీటు ఖాళి అయ్యినా కుర్చొనిస్తారా?ఆ చూపు తోనె చంపేస్తారు.ఖాళీ గా వుందని వాళ్ళ సీట్లో కుర్చున్నా బితుకు బితుకుమని భయపడుతు ఎప్పుడూ పిడుగులా వస్తారోనని కుర్చోవాలి.సరే,ఎందుకు వచ్చిన బాద రా అని కూలో నాలో చేసుకునొ, అయ్యనో,అమ్మనో కాళ్ళన పడో ఒక బైకు కొని రోడ్డన పడ్డా అక్కడా స్కూటిలు వేసుకుని తయారు!! పొరపాటున వాళ్ళు మనను గుద్దేసిన మనమే సారీలు చెప్పాలి,చెప్పక పోతె “చూసుకుని నడపడం రాదా అని” ఎదురు వాయింపుడు!మన గ్రహపాటు బాగుండక మనమే వారిని గుద్దేస్తె….ఇంకా చెప్పలా?జజ్జనకజనారె!!సీను చిరిగి చేట అంత అవుద్ది. చింపేదెవరయ్యా అంటె ….మన తోటి మగ బ్రెదర్సే!!ఊరకనే అన్నరా మగవాడికి మగవాడె శతృవని?

ఉద్యోగాలు వచ్చి ఆఫీసుల్లో జాయిన్ అయినా ఇక్కడ కూడా అదే పురుష వివక్ష!ఆఫీసుల్లో లేటు అవర్సు అన్ని మన ఖర్మే? బయట కి ఎండల్లో తిరిగి ,వానల్లో తడిసి బాధపడాల్సింది మనమే!వాళ్ళకి ఆఫీసు వర్కు లో సహాయం చెయ్యడానికి అందరు ఎగబడతారు,ఖాళీ సమయాల్లో సొల్లు కబుర్లు వాళ్ళకే చెబుతారు,ఇంకా ఇంక్రిమెంట్లు,ప్రమోషన్ల విషయానికి వస్తే,ఇద్దరు ఆడ మగ జూనియర్సు వుండి ఒక మగ సీనియరు వుంటే,చెప్పాల్సింది ఏమయినా వుందా?ఏమయినా కొద్దో గొప్పో మగ వాళ్ళకి ఫెయిర్ చాన్సు వున్నదెక్కడయ్య అంటె అది రాజకీయాలు!!అఫ్‌కోర్సు అక్కడా తెర వెనక తతంగం ఎవరిదో అందరికి తెలిసిందే!!ఇప్పుడు ఈ మాత్రం అవకాశాలు మిగలవు.ఆఖరికి మహిళా దినోత్సవం నాడు ఈ టపా వేద్దామన్నా ఎంత భయం వేసిందని?
(అంతా ఉత్తుత్తినే నవ్వుతాళ్ళకి!!హిహ్హిహిహ్హి!!!) 
((ఇలా అనక పోతే బతకనిస్తారా బ్రెదరూ??))


ఒకానొక తెలుగు రాజ్యం.అందలి ప్రజలు సుఖసంతోషాలతో వర్దిల్లుతున్నారని,అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతున్నారని చెప్పలేము గాని ఒక మోస్తరు జీవితాన్ని గడుపుతున్నారు. కప్పాల ద్వారా వసూలైనా ప్రజాధనం ఎక్కువ మొత్తం గ్రామాధికారుల చేతి అవినీతి పాలయినా మిగిలిన దానితోనె ఆ రాజ్యం అభివృద్ది పధంలో నడుస్తుంది.అటువంటి రాజ్యం లో ఇద్దరు పసికందులు పుట్టగానె పరిస్థితుల ప్రభావం వల్ల విడిపొయారు.ఒకరు భాగ్యనగరం అనబడు రాజధాని చేరుకునగా ,మరొకడు రాజమహెంద్రవరం అను మరొక పట్టణం చేరుకుని వారి బాల్యం అక్కడే గడిపారు.ఇరువురు వద్ద ఉన్న కంఠాహారములు మాత్రమే ఒకరిని ఒకరు పోల్చుకునటుకు ఆధారములు! తన సోదరుడు ఎక్కడొ తన లాగే ఒంటరిగా  జీవిస్తున్నాడని వారికి తెలుసు. రాజమహేంద్రవరం లో పెరిగిన రామ్ అన్నవాడు యుక్త వయసుకి వచ్చేటప్పటికి విధ్యార్దం అంధ్రా గురుకులం చేరుకున్నాడు.భాగ్యనగరంలో పెరిగిన శ్యామ్ కూడా ఉస్మాగురుకులం లో చదువుకున్నాడు. ఆశ్చర్యం గా ఇరువురు వారి వారి గురుకులం లందు విధ్యార్ది నాయకులు అయ్యారు.

అటువంటి సమయంలో భాగ్యనగర పరిసర ప్రాంతానికి చెందిన ముక్కుచంద్రేశ్వరం అనబడు ఒక గ్రామాధికారి రాజుగారు తనను మంత్రివర్గం లో తీసుకునలేదని అలిగితిడి.తన మందీ మార్భలం తో తిరుగుబాటు ప్రకటించి రాజుగార్కి తమ ప్రాంతం పై హక్కు వదులుకుని ప్రత్యేక రాజ్యంగా ప్రకటించవలసినదని వేగు పంపితిడి.ప్రజల వద్దకు వెళ్ళి వారిని కూడా ప్రతేకరాజ్యం కోసరమై  మద్దతు అడిగినాడు. అభివృద్ది లోను,జలాల,స్థలాల లోను మరియు ఉధ్యోగ అవకాశాలయందు జరుగుతున్న వివక్షకు ప్రత్యేక రాజ్యమే పరిష్కారమని వాదించాడు. అతని బెదిరింపులుకు రాజుగారు బెదరలేదు,అతని పిలుపులకు ప్రజలు కూడా పలకనూ లేదు!!!అయితే రాజమహేంద్రవరం పరిసర ప్రాంతానికి చెందిన లంగడా లంకేశ్వరం అను మరొక గ్రామాధికారి  రాజధానిలో తన అవినీతి ధనం తో చేస్తున్న వ్యాపారాలు ప్రత్యేక రాజ్యం ఏర్పడ్డ సజావుగా సాగుటందులకు కొంత లంచం ముక్కుచంద్రేశ్వరం ను మంచి చేసుకునటందుకు పంపి లోపాయకారిగా తన మద్దతు తెలిపినాడు.

ప్రజల మద్దతు కరువైన ముక్కుచంద్రేశ్వరం ఒక పాచిక వేసాడు.యుక్త వయసులో వున్న విధ్యార్దుల మనసులు తెల్ల కాగితం వంటివని,వాటిపై ఏమి రాస్తే అదే వారికి కనిపిస్తుందని తెలిసిన అతను ఉస్మాగురుకులం విధ్యార్ది నాయకుడు శ్యామ్ కి కబురు పెట్టాడు. తన స్వార్ధ ప్రయోజనాలకై అతడిని ఉధ్యమం పేరు తో రెచ్చగొట్టి విధ్యార్దులని వారి చదువులకి దూరం చేసి తన పబ్బం గడుపుకున్నాడు.రాజమహేంద్రవరం పరిసర ప్రాంత ప్రజలే తమ శ్రమఫలాలని దోచుకుంటున్నారని వారిని ఉసిగొల్పాడు. రాజమహేంద్రవరం ప్రజల పై విషం కక్కాడు. తమ ప్రాంత ప్రజలకు న్యాయం చేకూర్చడానికి ప్రాణాలు సైతం పణంగా పెట్టి ముక్కు చంద్రేశ్వరం చేతిలో పావులుగా మారిపొయారు ఆ గురుకుల విధ్యార్దులు.విధ్యార్దులు రంగంలోకి దిగడంతో ప్రజలు కూడా ఉధ్యమం లో పాలు పంచుకోసాగారు. రాజుగారు కూడా ప్రత్యేక రాజ్యంకి చూచాయగా సంకేతం ఇచ్చారు. మంత్రివర్గం లో భాగం చెయ్యనందులకు ఇప్పుడు తానే ప్రత్యేక రాజ్య రాజు కాబోతున్నానని  ఆనందించిన ముక్కుచంద్రేశ్వరం ఉధ్యమం ఖర్చులు మితిమీరినయని అందులకు లంగడా లంకేశ్వరం కు మరింత ధనం లంచంగా పంపమని కబురు పెట్టితిడి.అందులకు లంకేశ్వరం సమ్మతించక తాను కూడా సమైఖ్యం పేరుతో విధ్యార్దులని రెచ్చగొట్టి ఉధ్యమం జరిపిస్తానని బెదిరించితిడి.ముక్కు చంద్రేశ్వరం లెక్క చేయక పొయెను.

అంతట లంకేశ్వరం ఆంధ్రా గురుకుల విధ్యార్ది నాయకుడు రామ్ ని కలిసి చంద్రేశ్వరం కుట్ర ని వివరించి సమైఖ్య ఉధ్యమం కి మద్దతు అడిగాడు.సాటి విధ్యార్దుల ఉధ్యమం కి వ్యతిరేకం గా నడుచుకోవడం తనకి ఇష్టం లేదని,అయినా ముక్కు చంద్రేశ్వరం కుట్ర పారదని,ఇంతకమునుపు  చెన్నకేశవుడు అనే నాయకుడు కూడా ఇట్లానె నడిపిన స్వార్ద ఉధ్యమం గతి ఏమయ్యిందో తమకు తెలియదా అని రామ్ అడిగాడు.అయితే చావ చచ్చిన ముసలి రాజు ముక్కు చంద్రేశ్వరం కుట్రకి భయపడిపోయి ప్రత్యేక రాజ్య ప్రక్రియ మొదలుపెడుతున్నట్టు ప్రకటించగానె రాజమహెంద్రవరం పరిసర ప్రాంత ప్రజలు,ఆంధ్రా గురుకుల విధ్యార్దులు ఆశ్చర్య చకితులు అయ్యారు.తమ పైన చేసిన ఆరోపణలు నిజం అన్నట్టు చేసిన ఈ రాజుగారి ప్రకటన వారికి మింగుడు పడలేదు!దీనికి వ్యతిరేకం గా రామ్ విధ్యార్ది ఉధ్యమంకి నాయకత్వం వహించాడు.ఆ ప్రాంత ప్రజల వ్యతిరేకతని చూచి అక్కడ కూడా తన రాజరికం చెల్లదని భయపడి రాజుగారు తన ప్రకటన పై పునరాలోచించుతామని ప్రకటించినారు.

రాజుగారి మరల చేసిన ప్రకటనతో భాగ్యనగర పరసర ప్రాంతవాసులు నిరాశ చెందినారు. తక్షణమే ప్రత్యేక రాజ్యాన్ని ప్రకటించని పక్షంలో  శ్యామ్ తదితర విధ్యార్ది బలగం తో కోట ముట్టడింపు చేయిస్తానని ముక్కు చంద్రేశ్వరం ప్రకటించాడు.రాజధాని లో నివసిస్తున్న రాజమహేంద్రవర ప్రాంతవాసులని తరిమి కొడతామని బెదిరించాడు.వారి కోట ముట్టడింపు ని భగ్నం చేయడానికి లంగడా లంకేశ్వరం రామ్ తదితురులుని తమ విధ్యార్ది బలగం తో భాగ్యనగరం పంపాడు.కోటముట్టడింపు రోజు రానే వచ్చింది.ఇరువర్గాలు భీకర హింస కి పాటుపడ్డారు.రక్తం ఏరులై పారింది.ప్రజల కనీస అవసరాలయిన రవాణా,వైద్యం వగైరా కూడా అందని పరిస్థితి!రామ్,శ్యామ్ తీవ్రంగా గాయపడ్డారు.ఊహ తెలిసిన తరువాత అదియే కలుసుకోవడం,విధి వైపరీత్యం!వారికి తెలుసు అదియే ఆఖరు అని.అంత తీవ్రంగా వున్నాయి  గాయాలు.అన్యాయం వైపు ఎందుకు నిలబడ్డావని ఒకరిని ఒకరు ప్రశ్నించుకున్నారు.ముక్కు చంద్రం కుట్ర గురించి రామ్ చెప్పగా విని ఆశ్చర్య పోయినా శ్యామ్ తనకి ముక్కు చంద్రం ద్వారా తెలిసిన లంగడా లంకేశ్వరం అవినీతి వ్యాపారాల గురించి వివరించాడు.అన్నదమ్ములు తాము ఎలా ఇద్దరు అవినీతి,స్వార్ద నాయకుల వల్ల శతృవుల్లా ఎదురుపడవలిసి వచ్చిందని ఆవేదన పడ్డారు.ఒకరిని ఒకరు అర్దం చేసుకున్నారు,కాని అప్పటికే ఆలస్యం అయ్యిపొయింది.కాకపోతే అన్నదమ్ముల వంటి ఇరు ప్రాంత వాసులు మటుకు నిజం చూడలేకపోతున్నారు.ఒకరిని ఒకరు అర్దం చేసుకోక పగ ద్వేషాలతో రగిలిపోతు ఒకరి కంటిని ఒకరు పొడుచుకుంటున్నారు!!నిజం ఎప్పటికి తెలుసుకుంటారో?


ఇది “తెలుగోడు”- “ఒక ఉధ్యమం” వరుస టపాల  లోనిది కాదు.గమనించగలరు.

ఈ కధ లోని పాత్రలు వాటి పేర్లు పూర్తిగా కల్పితం!అవి మీకు ఎవరినన్నా ఉద్దేశించినట్టు అనిపిస్తే మీ తెలివి కి నా జోహార్లు!!

 అనగనగా ఒక వూరు. ఆ వూరిలో ఒక పేధ్ధ తోట. అది ఆ వూరి ప్రజల ఉమ్మడి ఆస్తి. అందరు కలిసి కష్టపడేవారు. ఎవరు ఎంత కష్టపడితే అంతకు తగ్గ ఫలం అన్న మాట! వూరి ప్రజలంతా కలిసి ఒకరిని తోటమాలిగా పెట్టుకునే వారు. దొంగతనం గా ఎవరు తోటని కొల్లగొట్టకుండా చూడడం వాడి పని.అయితే తోటమాలి పులిరాజా చేను మేసె కంచె వంశం కి చెందిన వాడు. వాడి కొడుకు జగ్గడు తండ్రి కి తగ్గ కొడుకు.తండ్రి స్నేహితుడు గాలి రెడ్డి తో కలిసి దొంగతనం గా తోట ని దోచుకునెవాడు. ముఖ్యంగా ఆ తోటలోని ఓబులా వృక్షం వీళ్ళ దొంగతనంకు ప్రధాన లక్ష్యం. వాళ్ళ ఆకృత్యాలునుండి వూరి వాళ్ళ కళ్ళగప్పె పని పులిరాజాది.మునుపటి మాలి గెడ్డం బాబు అరిచి గీపెట్టేవాడు పులిరాజా, వాడి కొడుకు దొంగలని! ఏమో తను దోచుకోవలిసింది వీళ్ళు దోచుకుంటున్నారనో లేక ఈ దొంగతనం బయటపెడితె పులిరాజా వుద్యోగం తనకు మళ్ళీ దొరుకుతుందనో??

గెడ్డం బాబు ఆరోపణలని పులిరాజా చిరునవ్వుతో కొట్టిపడెసేవాడు!అంతా  గెడ్డం బాబు కుళ్ళుమోత్తనమని, తొమ్మిదేళ్ళగా తోటమాలి గా వున్న తనివితీరక గ్రామ ప్రజలని తన పై అనవసరంగా అనుమానపడెటట్టు చెయ్యడమే వాడి పని అని, వాడు మాలిగా వున్న కాలం లో జరిగిన అవకతవకులు తాను బయట పెడతాను అని అనేవాడు. ఇలా ఒకరిపై ఒకరు నిందలు వేసుకుని కాలం గడుపుతుంటే ఇటువైపు జగ్గడు,గాలిరెడ్డి ఓబులావృక్షం ని నిలువనా దోచిపారేసేవాళ్లు! అయితే ఒక రోజు పాపమనే పాము కరిచి పులిరాజా మరణించాడు. కధ మలుపు తిరిగింది ఇక్కడే!!

గెడ్డం బాబు దొరికిందే అదను అని రెచ్చిపోయాడు. తండ్రి అండ లేని జగ్గడిని,గాలిరెడ్డి ని ఎలాగైనా దొంగలుగా నిరూపించాలని శపధం పూనాడు.అయితే జగ్గడు తండ్రి మరణం తరువాత మాలి పని తనకే దొరకడం ఖాయమనుకున్నాడు.అలా అయితే తన దొంగ పనులు నిరాకంటంగా కొనసాగించవచ్చని ఆశపడ్డాడు.ఈ లోపు గెడ్డం బాబు వుచ్చు బిగించసాగాడు.కాని కధలో మరో ట్విస్ట్!!
రోశం అంటె తెలియని మీసాలే లేని రొయ్య గారు ముదు ముసలి కాలంలో మాలి గా నియమించ బడ్డాడు.ఇది జగ్గడికి మింగుడు పడలేదు. ఇలా అయితే తను ఇంకా దొంగతనం కొనసాగించడం తరువాత ముందు చెరసాల పాలు కావడం తప్పదని తెలుసుకున్నాడు. డబ్బులు ఇచ్చ్చి జనాలని కొనుక్కుని వాళ్ళ చేత తనకి మాలి ఉధ్యోగం వచ్చెటట్టు పైరవి చేయించసాగాడు.కాని రొయ్య గారు మటుకు పోనిలెమ్మని వూర్కుంటారా?ఆయనకి వయసు మీద పడ్డ వచ్చిన అవకాశం వదులుకోవడం ఇష్టం లేదు.తన ప్రయత్నాలు ఆయనా చేసాడు. ఇరుకున పడ్డ జగ్గడు, గాలి రెడ్డి బ్రహ్మాస్త్రం వదిలారు.గ్రామ ప్రజల దృష్టి మరల్చడానికి తాగుబోతు ముక్కు చంద్రం కి డబ్బులు ఇచ్చి కొనేసారు.తన వర్గం వారిని రెచ్చగొట్టి దృష్టి మరల్చడానికి ప్రయత్నిచాడు. 
తాగుబోతు ముక్కు చంద్రం తన వర్గం వారికి వివక్ష జరుగుతుంది అని,మిగిలిన వారంతా తమ శ్రమ ఫలాన్ని దోచుకుంటున్నారని, అమాయకులని చేసి ఆడుకుంటున్నారని, తమ వర్గ సంప్రదాయ కట్టుబాటులే వేరని, కాబట్టి తోటని విడగొట్టి తమ వర్గం వారికి వేరేగా ఇచ్చెయాలని నిరాహార దీక్ష మొదలెట్టాడు.వాడి ఆరోపణల్లో నిజానిజాలు పక్కన పెడితే నిరాహార దీక్ష మటుకు చాలా గొప్పది.రొయ్య గారు అవసరమైన దానికంటె ఎక్కువ హడావుడి చేసి చేతులు కాల్చుకున్నాడు.రెండు రోజులు ఆగితే వాడు మటుకు వాడే లేచి కుర్చునేవాడు, దొంగతనంగా బిర్యాని పొట్లం తెప్పిచ్చుకుని దొరికిపోయాడు.అయితే అప్పటికే ఆ వర్గ ప్రజల మన్సుల్లో విషం నింపడం లో సఫలం అయ్యాడు ముక్కు చంద్రం! మిగిలిన వూరి ప్రజలని అనుమానం గా చూడసాగారు వారు. మానిన గాయాలని రెచ్చగొట్టాడు ముక్కు చంద్రం.వాడి మాయమాటల్లో పడిపొయిన వారిని చూసి జాలి పడాలో, అర్హత లేకపోయినా పేద్ద నాయకుడు అయ్యిపొయిన చంద్రం ని ఏడవాలో తెలియని పరిస్థితి!! ఎంకి పెళ్ళి సుబ్బి చావు కి వచ్చినట్టు జగ్గడి దొంగ బుద్ది రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది.దొంగలు దొరల్ల తిరుగుతుంటే జనాలు మటుకు అనవసరం గా వారి మాయలో పడి ప్రాణ త్యాగాలు, పగలు కక్షలు అంటు తమ జీవితాలు పాడుచేసుకుంటున్నారు!!


 ఎందుకు ఆగుతుంది అండి? వచ్చే లాభాలు తగ్గిపొతాయని భయం కాబోలు మన రైలు మంత్రిణి గార్కి! కాని మన రాష్ట్ర ఎంపీలకి చాలా బాధ వేసింది అంట! ఏంటి నవ్వుతారు నిఝ్ఝం! ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మన వాళ్ళకి రాస్తా రోకోలతొ గిట్టుబాటు అవ్వడం లేదు! స్టేషన్ కి వెళ్తే తెగ వెయిటింగ్ చెయ్యాలి మరి ట్రైన్ల కోసం!(మరి బోల్డన్ని ట్రైన్లు కదా!)అందుకే చానా బాధపడిపొయినారంట.కాని లాభాలు ముఖ్యం కద.అందుకని మమత గారు మన దక్షిణ మధ్య రైల్వే బాగు దృష్టిలో పెట్టుకుని ఇబ్బడి ముబ్బడిగా కొత్త ట్రైన్లు ఇవ్వకుండా ఆపారంట!
 సరే గాని లాభాలు ఎందుకో చెప్పలేదు కదా!ఇప్పుడు బెంగాలు,బీహారు లా బోల్డన్ని ట్రైన్లు వుంటె అందరికి ఇట్టే రిజర్వేషన్లు దొరికెస్తాయికదా! అప్పుడు టిటి లకి జేబు ఖర్చులు ఎక్కడినుండి వస్తాయండి? టిటిల లాభాలు పక్కన పెడితె మరి రైల్వే కి కూడా లాభాలు తగ్గిపోవు.అందరు టికెట్లు కొన్నారో లేదో చెక్ చెయ్యడానికి అప్పుడు ఎలాగు టిటిలు సరిపోరు కదా!(కొత్త వుద్యోగాలు తెగ ఎక్కువ కదా) మరి మాలాంటి వాళ్ళకి ఫైన్ ఎవరు వేస్తారు? ఇప్పుడు చెప్పండీ లాభమా మరి నష్టమా?(ఎవరికి అని అడగకండి)