Archive for the ‘పిచ్చాపాటి’ Category


నేను మీకు చెబుతానని మీరు ఇది చదవడం మొదలు పెట్టారు అంటే… మీకు బొత్తిగా బ్లాగ్లోకపు జ్ఞానం లేనట్టే! ఆ చిట్కాలు అవసరం నాకు వున్నంతగా బహుశా ఇంకెవరికి వుండదేమో! అంత కోపం నాకు. ఆ కోపం వలన ఎదుటి వారికి ఇబ్బంది వుండవచ్చు గాక! కానీ ఎక్కువ నష్టపోయెది నేనె! అసలు బ్లాగింగ్ చేసెది ఎందుకు ? కాలక్షేపానికి కొంతమంది, తమ రచనా పాటవాన్ని ప్రదర్శించడానికి కొంతమంది , సినిమాలకి రాయడంకి ప్రాక్టీసు చేసెవారు కొంతమంది , తమ భావజాలాన్ని నలుగురికి చెప్పడానికి కొంతమంది , పై కారణాలు ఏవీ కాకపోయినా కేవలం పాపులారిటీ కోసం కొంతమంది. పాపులారిటీ కోసం రాసె వారి పై నాకేదొ ద్వేషం వుంది అనుకునేరు. వారు పాపులర్ అయ్యిపోతున్నందుకు , నేను పాపులర్ కానందుకు కలిగిన అసూయ నాకైతే లేదు. అది కూడా ఒక కళే ! ఎవరి కారణాలు వారికి వుండవచ్చు. ఎదుటి వారికి ఇబ్బంది కలిగించనంతవరకు తప్పు లేదు. మరి నేనెందుకు బ్లాగు రాస్తున్నా ?

నేనొక అజ్ఞానిని . నా అజ్ఞానం అందరితో పంచుకోలేను. జ్ఞానం అంటే మాక్కావాలి, మాక్కావాలి అని అందరు ఎగబడతారు గాని, అజ్ఞానం ఎవరికి కావాలి బోడి ? అందుకని అజ్ఞానం పంచుకోలేకపోతున్నాను. కానీ నా అజ్ఞానం బయట పెట్టుకోగలను కదా. అప్పుడు ఎవరి దగ్గరన్నా కొంచెం జ్ఞానం వుంటే అది నాకు ఇస్తారని ఆశ ! అలాగే నేనొక అనుమానపు పక్షిని. ఆ అనుమానాలు తీర్చుకోవడానికి , అజ్ఞానం బయట పెట్టుకోవడానికి మరొ పక్షి రూపం ” పిల్లకాకి ” అవతారం ఎత్తాను అన్నమాట ! కానీ నా ఈ అవతారంలో ఒక పెద్ద ఇబ్బంది నా కోపం. నా అనుమానాలు, అభిప్రాయాలు ప్రకటించేటఫ్ఫుడు.. ఎవరన్నా ఒక మాట నన్ను అంటే ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది. నాకు కోపం వస్తుందా అని ఆశ్చర్యపోయె అమాయకులు కూడా వున్నారండొయి. నమ్మరా… ఇది  చూడండి.

ఇలాగె చాలా మంది నన్ను చూసి శాంతమూర్తి అనుకుంటారు. అదేమి వింతొ 🙂 కోపం మానవ స్వభావం. దానికి ఎవరు అతీతులు కాదు. ఎంత సాధు పుంగవులు అయినా కోపాన్ని అదుపులో పెట్టుకోగలరు మాత్రమే కానీ పూర్తిగా త్యజించలేరు. ఎంతొ కొంత పరిమాణంలో అది అందరిలోను వుంటుంది. మనం ఎంతగా అదుపులో పెట్టుకుందామనుకున్నా , మన మనసు పొరలులో తొక్కివేయబడ్డ కోపం హద్దులు తెంపుకుని బయటకి ఎప్పుడో అప్పుడు వస్తుంది.దానిని నియంత్రించుకునే అదుపు మనకి వుండాలి. ఎక్కువగా శాంతంగా వుండే వారు , అంటే కోపం తెచ్చుకోవలసిన పరిస్థితులలో కూడా శాంతం ప్రదర్శించేవారు, తమ ఆరొగ్యాలని తామే పాడు చేసుకుంటారు. ఏదొ ఒక రూపంలో ఆ కోపాన్ని బయట పెట్టాలి. ఒక పాజిటివ్ ఎనర్జీగా దానిని ఉపయొగించగలిగితే చాలా మంచిది. బహుశా వయసుతో కూడా ఆ నియంత్రణ వస్తుంది కామోసు. ప్రయత్నం తో ఎవరైనా సాధించవచ్చు అనుకుంటాను.

నేను కూడా శాంతం నటించి , కోపాన్ని తొక్కి పెడదామని ప్రయత్నించేవాడినే ! కానీ అది కరెక్ట్ కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఆ కోపం హద్దులు దాటి చెరుపు చేస్తుంది. ఇంట్లో పెళ్లాం తిడితే  స్కూలుకి వచ్చి పిల్లలని చితక్కొట్టేవారు, ఆఫీసులో సబార్డినేట్స్‌ని చీల్చి చెండాడేవారు నా కోవలోకే వస్తారు. ఇంటావిడ మా అయనకి అసలు కోపం అంటే తెలీదు అనుకున్నట్టె నా దగ్గరి వారు నా గురించి శాంతమూర్తిని అనుకుంటారు. కానీ నా అభిప్రాయాలు అనుమానాలు ఇంకా నా అజ్ఞానం బయట పెట్టుకునే దగ్గర ఎవరన్నా నన్ను ఏమి అన్నా అన్నారు అనుకోండి, అక్కడ కోపం వచ్చి నేను అదుపు తప్పితే నాకే నష్టం. ఉదాహరణకి మీ వాదనలో బలం వుంది , కానీ ఎదుటివారు సభ్యతగా వాదించలేక మిమ్మలని దివాలాకోరు అన్నా , వెటకారం చేసినా అది మిమ్మలని కోపం తెప్పించి వాదన పక్క దారి పట్టించడానికే! అప్పుడు మీరు వారు అనుకున్నట్టు అదుపు తప్పే కోపానికి గురి అయితే వాళ్ల లక్ష్యం నెరవేరుతుంది. మీ వాదన మరుగున పడుతుంది. కాబట్టి అప్పుడు కోపం వచ్చిన ఊరుకోవడం ఉత్తమం. ఆలోచించుకుని సమాధానం చెప్పడమొ , వ్యూహత్మక మౌనం పాటించడమో చెయ్యాలి.

ఇక మీదట బ్లాగ్లోకం లో నా కోపం అదుపులో పెట్టుకోవడానికి క్రింద సూచనలు పాటించాలి అనుకుంటున్నాను. ఇవి కాకుండా ఏమన్నా మీకు తోచితే నాకు చెప్పరూ ప్లీజు…

1) నా బ్లాగులో అందరికి భావ వ్యక్తీకరణ అవకాశం ఇద్దామనుకున్నా దానిని కొద్దిమంది దుర్వినియోగపరిచే అవకాశం వుంది కనుక కామెంటు మోడరేషన్ పెడదాము అని అనుకుంటున్నాను.
2) నా బ్లాగులో గాని, వేరె బ్లాగులలో కానీ చర్చ రచ్చ అయ్యే సంధర్భంలో వ్యూహాత్మక మౌనం పాటిస్తాను.
3) వేరె బ్లాగులలొ బ్లాగు ఓనరు తో తప్ప పక్క వాఖ్యాతలతో వాదం పెట్టుకోను ( వారే వాదానకి లాగినా.. ఎందుకంటే నా బ్లాగులో మీ పెంట ఏమిటి అని బ్లాగు ఓనరు అనుకోకూడదు కదా! )
4) రోజుకి కేవలం ఒక బ్లాగులో ఒకటి రెండు కామెంట్లు మాత్రమే పెడతాను. ( అవి ఎంత పెద్దవి అయినా సరె ! ) ఎందుకంటె ఎవరన్నా అవాకులు చెవాకులు వాగినా మరుసటి రోజుకి ఆ కోపం చల్లారి పోతుంది అని ఆశ !
5) రోజుకి కేవలం ఒక గంట మాత్రమే బ్లాగింగుకి వెచ్చిస్తాను.
హమ్మయ్యా! మరి ఇక బ్లాగులలొ సునామీలు , కామెంట్ల వర్షాలు [ ఎవరొ ఎక్కడొ అన్నారు , ఇంత వరకు ఒకరిని గోకితే కామెంట్ల వర్షం పడేది అంటా, ఇప్పుడు నన్ను గోకితే ఆ వర్షాలు పడుతునాయి అంటా 🙂 ] పడవని ఎవరన్నా బాధపడితే సారీ 🙂
ప్రకటనలు

చాలా రోజుల తరువాత బాగా నవ్వించిన టపా 4E గారి పేరులోనేముంది? నవ్వాపుకోలేకపోయాను. అయితే ద్రోణాచార్య గారు, ఈ బాధ అందరికి వుంటుందేమొ అసలు! చాలామందికి తమ పేరులు నచ్చవు. కొద్దిమందికి మాంఛి మోడ్రన్ పేరులు కుదురుతాయి, కానీ ఆ పేరుకి మనం పాతబడి పోయి ( అంటే మనం ముసలాళ్లు అయిపోయినట్టు మన పేరులు ముసలవి అవ్వవు కదా ) ఎబ్బెట్టుగా తయారు కావచ్చు. ఏంటిరా ముసలాడికి ఈ పేరు , పేరు చూసి బాలా కుమారుడు అనుకున్నారా అంటూ వెక్కిరింతలు…సరె మరి కొంతమందికి ముసలికాలం లో ఈ ఇబ్బంది పడకుండా పుట్టినప్పుడే మాంఛి ముసలి పేరు పెడతారు. గొప్పగా చావడానికి బీదగా బ్రతకనిచ్చే జీవిత భీమాలలా ఇవి కూడా పేరు పట్టింపు వుండే కాలం లో అక్కరకి రాకుండా , ఆ అక్కర వచ్చినప్పుడు పట్టింపు లేకుండా అటు ఫలం దక్కక ఇటు వ్రతం చెడ్డ రీతిన వుంటాయి. కొద్దిమంది అదృష్ట వంతులు అసలు పేరుతో ఇంత ఇబ్బంది పడరు, అయితే మటుకు వాళ్లు మటుకు సుఖ పడిపోతారు అనుకున్నారా? వారిని ఏడిపించడానికి అవి అసలు పేరులు కావచ్చు, ఇంటిలో వారు పిలిచే ముద్దు పేరులు కావచ్చు, లేక మన తోటి కేతిగాళ్లు ఏడిపించే పేరులు కావచ్చు తయారుగా వుంటాయి. కాబట్టి ఈ విషయంలో మీతో పాటు, నా తో పాటు సింపతీ చూపేందుకు చాలామందే వుంటారు లెండి. నా తో పాటు అంటే అర్ధం కాలేదా? నేను కూడా మీ లాంటి పేరు బాధితుడినే లెండి.

నా పేరుకొచ్చిన సినిమా కష్టాల జాబితా చాలా పెద్దది. నేను పుట్టక ముందే మొదలయ్యింది ముసళ్ల పండగ 🙂 . మా కుటుంబం లో ఆఖరి మగ నలుసు కావడం నేను చేసుకున్న పాపం. మా పెదనాన్నలు ఎవరూ వాళ్ల మగపిల్లలకి మా తాతగారి పెట్టుకోకపోవడం నాకు మూఢింది. మా తాతగారికి అట్టాంటి ఇట్టంటి పేరు వుండనేలా? వుండింది ఫో! అది నా కోసమే రిజర్వ్ చేయబడనేలా? చెయ్యబడింది ఫో! మా తల్లిదండ్రులు దానికి కట్టుబడనేలా? నాకిలా మూఢడం ఏలా? అంతా మన ఖర్మ 😦 ఇంతకీ మనకి ప్రాప్తించిన నామధేయం ఏమనగా….టట్టడొయీ..”కృష్ణమూర్తి” పుట్టినప్పుడు మనకేమి తెలుస్తాది ఈ పేరు తో పుర ప్రజలు మనలని ఎలా ఆడుకుంటారో?? గమ్మున ఊరుకున్నాను. ( ఊరుకోక అప్పుడు మటుకు చేసెదేమి లేదు కదా ) నెమ్మదిగా స్లో మోషన్లో పెద్దవ్వసాగాను. నా తో పాటె నా కష్టాలు పెద్దవయ్యాయి. చింకి లాగులు వేసుకుని చీమిడి ముక్కుతో ఆడుకునే రోజులలోనె పరిచయం వున్న ప్రతి దారిని పోయె దానయ్యా..” ఏరా బాబూ నీ పేరెంటిరా ? ” అని అడగడం… ముద్దు ముద్దుగా నేను కిత్నమూతి అనడం…… భళ్లున అద్దం పగిలినట్టు నేను జడుసుకునేటట్టు “హహహ్హాహ్హా ఏంటి కుక్కమూతా? ” అంటూ నన్ను ఆటపట్టించేవారు 😦 ఏమి చేస్తాను, ఆహ అసలు ఏమి చెయ్యగలను చెప్పండి, బుంగ మూతి పెట్టుకుని ఇంటికి పరిగెట్టడం తప్ప ? ఈ నా సినిమా కష్టాలు మా ఇంటివారు కి తెలిసి సరెలే పిల్లాడు తెగ ఇదయిపోతున్నాడు అని పేరు మార్చేసారు అప్పటి మన గవర్నర్ పేరు కృష్ణకాంత్ అని . హమ్మయ్యా అనుకున్నా నా కష్టాలు ఇక తీరిపోయాయని. నాకేమి తెలుసు అభీ పిక్చర్ బాకీ హై దోస్తు అని???

ఆ పేరు ఎక్కువ రోజులు అచ్చి రాలేదు. అసలు పేరు వదిలేసి ఏయ్ కాంతూ , ఓయ్ కాంతూ , ఎహెయ్య్ కాంతంగా అని మళీ ఏడిపింపులు స్కూలులో బుడంకాయలు. అయినా ఎక్కువ కాలం ఆ పేరుతో బాధ పడలేదు లెండి, ట్రాన్స్‌ఫర్ వలన మేము ఊరు మారినప్పుడు స్కూలు మార్పిడిలో నా పేరు ముచ్చట గా మూడోసారి మారిపొయ్యింది వెనకాల ఎటువంటి తోక లేకుండా వెంకట కృష్ణ అని. చచ్చినట్టు అందరూ ఇక కృష్ణ అని పిలుస్తారు అని ముచ్చట పడిపోయా! ఇంతలో హైస్కూలు లో పడ్డాను. కృష్ణ అన్న పేరుతో పిలవబడతాను అనుకున్న నా ఆశలు అడియాసలు అయ్యాయి. నా ఒంటి పేరు ముందు వున్న ఇంటి పేరుతో కలిపి పొడిగా ఎన్వీ కృష్ణా అయ్యిపోయాను. అక్కడ ఆడుకున్నారయ్యా నా సామిరంగా ! ఆ విధంబెట్టిదనినా…. ఆ కాలం లోనె పెళ్లి సందడి సినిమా వచ్చింది. నా ఖర్మ కాలి హిట్టయ్యి కుర్చుంది. ఆ సినిమా హిట్టయ్యితే నా ఖర్మ ఎలా కాలింది అంటారా? ఆ సినిమాలో హీరొ శ్రీకాంతు , బ్రహ్మానందం ఇద్దరి పేర్లు ఎన్వీ కృష్ణే! శ్రీకాంతు నిప్పు విజయ కృష్ణ అయితే బ్రహ్మానందం నెయ్యి విజయ కృష్ణ అన్న మాట! ఒరెయ్ నీ పేరు ఏంటిరా నిప్పా… నెయ్యా…. అంటూ కొద్దిసేపు నన్ను బ్రహ్మానందం తో ఆడుకున్నట్టు ఆడుకుని ఆ ముచ్చట తీరాక హఠాత్తుగా హీరొని చేసెసి ” ఒరెయ్ అన్నట్టు నీ స్వప్న సుందరి ఎవరు రా ? ” అంటూ చెడుగుడు ఆడేసుకున్నారు. కొన్నాళ్లకి ఆ సినిమా వేడి తగ్గింది. నాకు మంచి కాలం వచ్చింది అని సంతోషించా ! ఉహ్..ఉహ్హూ! నా భ్రమ ! అసలు ట్విస్టు అప్పుడే జరిగింది.

స్కూలుకి క్యారేజు వస్తే క్లాసు మధ్యలో ఆయా వచ్చి పేరు పెట్టి ఇదిగో బాబూ, ఇదిగో పాప ఇక్కడ పెడుతున్నా అని చూపించి తలుపు దగ్గర పెట్టేది. అలాగె ఒకరోజు ఆవిడ వచ్చి ” రమ్యకృష్ణ ఎవరూ ? ” అంది క్వశ్చన్ మార్కు ముఖం పెట్టి…అందరూ ముఖాలు చూసుకున్నాము ఈ పేరు తో ఏ అమ్మాయి మా క్లాసులోనె కాదు మా స్కూలులోనె లేదు కదా అని ! మరొ రెండు సార్లు అడిగాక నా జీవితాన్నే మార్చేసె అవిడియా ఆవిడ కి వచ్చి షరా మామూలుగా నాకు మూఢింది. ” ఇదిగో ఈ క్యారెజీ బుట్ట ఎవరిది ” అంటూ బ్యాగు ఎత్తి చూపింది. తెల్ల ముఖం వేసుకుని పిచ్చి చూపులు చూస్తూ లేచి నిలబడడం నా వంతు అయ్యింది. ఎన్వీ కృష్ణని కాస్త రమ్యకృష్ణ అని విన్న ఆవిడ ‘ కర్ణ కావరం ‘ కి మండిపోతు 😦 అయినా క్యారెజు బ్యాగు చూసి చొంగ కార్చుకుంటూ లేచినందుకు నన్ను నేనె తిట్టుకున్నాను లెండి. ఒక్క పూట ఆ క్యారేజు నాది కాదు అనుకుని కడుపు మాడ్చుకున్నా అంత పోయెదేమి లేదు, ఎలాగూ పక్కన వాళ్ల డబ్బాల మీద పడొచ్చు కదా! బుధ్ధి తక్కువ అలా బయట పడిపోయా. ఇక స్కూలు నుండి బయట పడేంత వరకు ఎవరికి ఎప్పుడు మూడొచ్చినా ఆడుకోవడానికి మనమే! కాలం చాలా గొప్పది. ఇన్ని కష్టాలు తో కూడా నెమ్మది నెమ్మదిగా నన్ను ఆ కుంపటి నుండి బయట పడేసింది. కాలేజి కొచ్చా! కష్టాలు కొంచెం తగ్గాయి. ఎటొచ్చి ఎన్వీ గా స్థిర పడిపోయిన నాకు అప్పుడప్పుడు నాన్వెజ్ కృష్ణా అని పిలిచేవారు మా కేతిగాళ్లు. మనం కూడా తెలివి మీరిపోయి పెద్దగా ముఖం మాడ్చుకునేవాళ్లం కాదు లెండి. దాని తో ఎంటర్‌టెయిన్మెంటు తక్కువ అయ్యి వాళ్లు ఆ పేరు కూడా వదిలేసారు.కాలేజి నుండి బయట పడ్డాక ఇక కష్టాలు పూర్తిగా తీరిపోనట్టే!  థాంక్ గాడ్! { అన్నట్టు నిజంగా థాంక్ గాడేనా? మానిన గాయాలు మళ్లీ రేగ్గొట్టుకోలేదు కదా! ఓహ్ మై గాడ్ 😦 }


నా జవాబు కోసం చాలా ఎదురు చూసినట్టు వున్నారు నిన్న! ఒకరి పెళ్లి రిసెప్సన్ కి వెళ్లవలసి వచ్చింది. అందు వలన ఆలస్యం. చాలా పెద్ద జవాబు నిన్న రాత్రి టైపు చెసా!కాని లెఖిని చేతులెత్తింది ఆఖరి నిమిషంలో!పాపం నేను రాలెదనుకుని చాలా మంది, నిరాశ పడ్డారు అనుకుంటా!సరె నా జవాబు: మత ద్వేషి….. కుల గజ్జి…… ఎవరిదొ తెలుస్తుంది ఇది చదివాక. ఇంత పెద్ద గొడవ అయ్యాక ఇన్నాళ్లు నిశ్శబ్దంగా వున్నదెవరు? నేనె భయపడి వుంటె ఈ విషయం ఎందుకు ఎత్తుకుంటాను ? ఆ గొడవ ప్రభావం ఎవరి మీద కొట్టొచ్చినట్టు కనిపించింది? వ్యక్తిగత దాడులు ఎవరి చేసారు? ఎవరు నాలిక కరుచుకున్నారు? మతం గురించి, నాకు కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి.నేనెమి, నాకు నన్ను ఆస్తికుడినొ, నాస్తికుడీనొ అనుకోను.నాకు దేముడి పట్ల ఎటువంటి అభిప్రాయం లేదు. దేముడు మనిషిని సృష్టించాడొ, లేక మనిషే దేముడిని సృష్టించాడొ ఎవ్వరము నిర్ధారించలేము. అయితే మతాన్ని ఆచరించడం వలన మనిషికి లాభమెంత? నష్టమెంత అని నాకు అనిపించిన భావాలని ఒక వరస టపాల పరంపరలో ఇంతకు ముందు రాసాను. అందులో దేముడిని, మతాన్ని సమర్ధించె పాత్రలోను, సాతానుని మతాన్ని వ్యతిరేకించె పాత్ర లోను, ఒక చర్చ జరుగుతుంది.మతం లో చెడుని అంగీకరిస్తు, దేముడు చివరికి ” మనిషి లోనె చెడు వుంది.నేడు మత వ్యవస్థ లేక పోయినా మనిషి మరొ విషయం మీద .. జాతి, కులం, భాష, వర్ణం,ప్రాంతం ఇంకా దేశం పేరు చెప్పి ఎదుటిని చంపుకుంటాడు అని, అటువంటి ద్వేషం లేని మరొ సృష్టి మొదలు పెడదామని బయలు దేరుతాడు.ఈ టపాలో నేను చెప్పాలనుకున్నది మతం వలన మనిషికి వ్యక్తిగతం గా , సామాజికం గా జరిగే నష్టాలని గురించి. సున్నితమైన విషయం. పైగా “దేముడిని పడగొడదాము రండి ” అన్న శీర్షికని చూసి చదవ వచ్చె వాళ్లు నొచ్చుకోకూడదు అని చాలా శ్రధ్ధ పెట్టి ప్రతి పదాన్ని ఆచి తూచి రాసాను. నా ఉద్దేశ్యం లో మతం లో చెడు దేముడూ ఒప్పుకున్నప్పుడే, చర్చ లక్ష్యం నెరవేరి పోయింది. మతం మనిషిని గొప్పగా ఏమి తయారు చెయ్యదని అతను ఒప్పుకున్నట్టు రాసాను. పైగా ప్రపంచం లో అతి ఎక్కువ మొత్తం లో ప్రజలు భావొద్వేగాలకి లోను అయ్యి, విచక్షణ కోల్పొయెది, మతం వలన అన్నది నా అభిప్రాయం.మిగిలిన జాతి, భాష, ప్రాంత వైషమ్యాలు, కూడా మనిషి కి మనిషి కి మధ్య దూరాన్ని పెంచుతాయి అని చెప్పాను.కాకపొతె మతం ఎంత ఎక్కువ మంది మనుషులని ఒక సమూహం గా , మరొ సమూహనికి వ్యతిరేకంగా కలపగలదొ మిగిలిన అంశాలు అంత ఎక్కువ ప్రభావం చూపలేవు అని అనిపిస్తుంది నాకు. భరద్వాజ బహుశా నా టపా అర్ధం చేసుకొలేక పోయాడు.లేదా నేను అంత విపులంగా నా భావాలని చెప్పలేక పోయాను.భలెగా వుంది అని అతడు ముచ్చట పడ్డాడు. అటు నాస్తికులు ఇటు ఆస్తికులు కూడా బావుందని అన్నారు.

తరువాత నేను రంగ నాయకమ్మ గారు రాసిన బలి పీఠం చదివాను.అసలు కధ కంటె ఆవిడ తనని తానె విమర్శించుకుంటూ రాసిన చివరి మాట నన్ను చాలా ఆకట్టుకుంది. అయితే ఆవిడ అభిప్రాయాలు కొన్నింటి తో నేను ఏకీభవించలేక పోయాను. వాటి పై నా అనుమానాలని ఒక టపా రూపం లో రాసాను.అందులో ఒక మతాంతర వివాహం ని తాను రూపు దిద్దిన తీరు పై ఆవిడ తనపై తాను కొంత విమర్శ చేసుకున్నారు. నీ భర్త నిన్ను బొట్టు మానెయ్యమంటె మానెస్తావా అని ఒక పాత్ర మతాంతర వివాహం చేసుకున్న యువతిని అడుగుతుంది. మానెస్తాను అని ఆ పాత్ర తో చెప్పించినందుకు, అది పురుషాదిక్యతని బలపరిచినట్టు వుందని అలా రాయడం చిన్న వయసులో తన అవగాహనా రాహిత్యం అని ఆవిడ చెప్పుకొచ్చారు.అయితే నాకు అనిపించింది ఏమిటంటె ఆ పాత్రకి, తన భర్త మీదున్న ప్రేమ కన్నా మతాచారాలు పైన నమ్మకం తక్కువ కావచ్చు, అందుకే బొట్టు మానెయ్యడానికి ఒప్పుకుంటాను అని అంది అని అనిపించింది.అయినా ఒక కమ్యూనిస్టు భావ జాలం వున్న వ్యక్తిగా , పురుషాదిక్యతని వ్యతిరేకించె మనిషిగా రంగ నాయకమ్మ గారు ఒక ప్రత్యేక కోణంలో మాత్రమె విషయాన్ని చూస్తున్నారని అనిపించింది.భర్త భార్యకి, భార్య భర్తకి తనకి నచ్చని విషయం చెప్పడంలో స్త్రీ వాదం, పురుషాదిక్యం వుండవు.మంచి అనిపించింది చెప్పడం లో తప్పు ఏమిటి?మతాన్ని వదులుకొమ్మని ఒక వ్యక్తి, తన జీవిత భాగస్వామికి చెబితే (తాను కూడా మతాన్ని వదెలెయ్యాలి)మంచిదే కదా అని అన్నాను.ఇప్పుడు భార్య భర్తని మందు తాగడం మానెయ్యమంటె ఇది నా స్వేచ్చకి భంగం,అని అతడూ అనగలడా?మతం కూడా మందులా చెడ్డదే కదా అని రాసాను. ఈ విషయం పై చర్చ పక్క దారి పట్టింది.

ఇప్పుడు ఆ వాఖ్య వెనక నా ఉద్దేశ్యం : మందు పూర్తిగా చెడ్డదా? మితం గా తాగినప్పుడూ, గుండె జబ్బులు ని దూరంగ వుంచడం లో సహాయ పడుతుంది.ఇంకా మందు కొన్ని చలి ప్రదేశాలలొ వెచ్చగా వుంచడానికి సహాయ పడుతుంది. అలా తాగె వారికి , పక్క వారికి ఏమి ఇబ్బంది వుండదు.స్పృహ తప్పెటట్టు తాగిన వాడికి సమాజం తో పని లేదు. వాడి వలన సమాజానికి నష్టం లేదు. మరి చిక్కెవడి తో? సగం స్పృహ వుండి, మంచి చెడు విచక్షణ కోల్పొయి, తనని తాను, తన చుట్టు పక్కల వాళ్లని ఇబ్బంది పెట్టె వాడితో! మతం తో ఇక్కడె దీనికి నేను పోలిక చూసాను.మితంగా మతాన్ని ఆచరించె వారి తో సమాజానికి చిక్కు లేదు.ఒకింత వ్యక్తిగతంగా ఒక్కొసారి, లాభదాయకం కూడా.అలాగె, పూర్తిగా మతాన్ని ఒంటబట్టించుకుని, పూజలు పునష్కారాలు, తపస్సులు చేసుకునే వారి తో, జన బాహుళానికి దూరమయిపొయె వాళ్లతో చిక్కేమి లేదు.చిక్కంతా ఎవరి తో? మతం మత్తు కొంత వరకు వుండి, దాని వలన మంచి చెడు విచక్షణ కోల్పొయి, కొంత మంది, స్వార్ధ పరుల చేతిలో కీలు బొమ్మలు అయ్యె వారి తో!ఇలాంటి వారు చాలా ఎక్కువ మోతాదు లో వుంటారు. మత నిర్దేశాలు అన్ని కూడా మనిషిని పూర్తిగా మంచి మార్గం లోనె నడవమని చెబుతాయి. ఇది మన భరద్వాజకి నచ్చలెదు.మా ఇద్దరి మధ్య చర్చ మొదలయ్యింది.

మతాన్ని తమ స్వార్ధ ప్రయోజనాల కోసం వాడుకునే వారు, మతాన్ని నిజంగా పాటిస్తున్నారని అనుకుంటున్నానా అని అతడు అడిగాడు. నిజంగా అంటె?? నాకు అసలు మతాన్ని పాటించడం అంటెనె సరిగా తెలియదు అన్నాను.మత నిర్దేశాలని 100% తూచా తప్పక పాటించడం అన్నాడు. నా మత పరిజ్ఞానం ఏమిటి అని అడిగాడు. చిన్నప్పుడు, మా కజిన్ సిస్టర్స్ స్కూలులో భగవద్గీత, రామాయణం, మహా భారతం పారాయణం చెయ్యించెవారు. ఇంగ్లిష్ మిడియం చదువులు అయినా, సంస్కృతం కూడా వుండేది. చిన్నప్పుడు నుంది, ఏదొ ఒకటి చదవడం నా బలహీనత. కిరాణా దుకాణంకి వెళ్లి పప్పులు, తెచ్చిన కాగితాలని కూడా వదిలే వాడిని కాదు.అలాగే వాళ్ల వద్ద వున్న భగవద్గీత, రామాయణ భారతాలు చదివాను. హైస్కూలు మిషనరి స్కూలు లో, అక్కడ బైబిల్ చదివాను. హైదరాబాదు లో వున్నఫ్ఫుడు, పాత నిబంధన గ్రంధం చదివాను. ఒక ముస్లిం స్నేహితుడు సాయం తో ఖురాను చదివాను.అది పూర్తిగా పాత నిబంధన గ్రంధమె! ఇక కాలేజి అయ్యక నాన్న గారి కలెక్షన్ లో డాక్టర్ అంబేద్కర్ రచన దమ్మ పధం వలన భౌధ్ధ మత పరిచయ జరిగింది.ఇక మిగిలినది, నా పరిశీలన. నా చుట్టు పక్కల వున్న వారిని పరిశీలించడం వలన నాకు కొన్ని అభిప్రాయాలు ఏర్పడ్డాయి.మతం చేసె మంచి కన్నా చెడు ఎక్కువ అని అనిపించింది.

మతం అనేది వుండడం వలన మనిషి, దానిష్ కార్టూన్లకి, డావిన్సి కోడ్లకి, బుస్సైన్ గీతలకి చలించి, అల్లర్లు చేస్తున్నాదు అన్నాను.నా వాదన తప్పు అయితే నాకు వివరించు, నేను నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను అన్నా! నా ప్రశ్నలకి జవాబు లేదు గాని, చిల్లర కోసం నా సహనాన్ని పరిశీలించడమే పనిగా అడ్డగోలు వాదనలు మొదలు పెట్టాడు.అయితే భరద్వాజ కేవలం బుస్సైన్ గీతల పైన మాత్రమె స్పందించాడూ.మిగిలిన విషయాలు నాకు అనవసరం. మిగిలిన మతాలలో వారు మనషులు కాదా అంటె? వారి విషయం, నాకు అనవసరం అన్నాడు.అప్పుడూ చర్చ హిందు మతం పైన కేంద్రీకృతమయ్యింది. హిందూ మతానికి దిశా నిర్దేఅశాలు చేసె చతుర్వేదాలు కేవలం ఒక వర్గం గుప్పిట్లో వుండడం ఎంత వరకు సమంజసం అని అడిగాను. వాటిని చదవడానికి ఒక అర్హత కావాలి అన్నాడు. సరె ఆ ఆర్హత పుట్టుక తో ఎందుకు నిర్ణయం అవుతుంది? అని నా ప్రశ్న. ఒక వాల్మికీ వేదాలు చదివె అర్హత సంపాదించిడానికి , ఒక బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన వాడికి కొలమానం ఒకటేనా అని అడిగాను.కాదు కదా సమాధానం లేదు.ఇప్పుడూ అందరు చదవ వచ్చు కదా అన్నాడు.మరి ఇన్నాళ్లు జరిగిన వివక్ష వలన నేటి సమాజం పరిస్థితి? ఆ చతుర్వేదాలు చదివిన వారిలో అధికులు నేటి కుల వ్యవస్థ కి కారణం కదా? మరి ఆ చతుర్వేదాలు చదివి వారికి, వారి వలన సమాజానికి కలిగిన లాభం ఏమిటి? చదివినా అర్ధం చేసుకొలేక పోతె, అర్ధం చేసుకున్నా దానిని ఆచరిచలేక పోతె అటువంటి చతుర్వేదాల వలన ఏమి ప్రయోజనం?

ఒహో … వీడు కూడా జాతి వైరం వలన నష్ట పోయిన మరొకడు? తేనె కరిగి ఇప్పుడు “కత్తి” కనిపిస్తుంది. పిల్ల కాకి రూపం లో వున్న రాబందు రెక్కలు విప్పుతుంది. అని భరద్వాజ వెక్కిరింత. అప్పటికే కొన్ని పదులు సార్లు నన్ను మత ద్వేషి అన్నా ఊరుకున్నా.అది నా పై వ్యక్తిగత దాడి అయినా గౌరవం ఇచ్చి మాట్లాడా! కుల గజ్జి అని అన్నప్పటికి నా సహనం చచ్చి మనోడికి మూడింది. వ్యక్తిగత దాడి, వెక్కిరింత అంటె ఏమిటో రుచి చూపించా!నాకె సిగ్గేసె స్థాయి లో తిట్టా! వీడితో చర్చ వలన తల నొప్పి తప్ప మనకి ఒరిగేదేమి లేదు అని అర్ధం అయ్యాక, మీరు నుండీ నువ్వుకి వచ్చా!నా కోపం చూసి, భరద్వాజ.. ” కెబ్లాసలు.. వీడు అనుకున్నంత సౌమ్యుడు కాదు. చూడండి అంటు సహాయం కోసం అర్ధించాడు.” నేను సౌమ్యుడిని అవునో కాదొ చూడడానికి ఇంత సమయం చర్చించావా అని బూతులు తిడీతే “కాదు..కాదు.. వంద డాలర్ల పదెం, నీ సౌమ్యత బూటకం అని నిరూపించడానికి ..నేను గెలిచా” అన్నడూ చిల్లర వెధవ. ఛీ..ఛీ.. మళ్లీ బూతులు వస్తున్నాయి. ఇలా బూతులు కామెంట్ల రూపం లో వుంచడం ఇష్టం లేక తొలిగించా!దీనికి గురించి, బ్లాగు ముఖంగా ఒక కామెంటు కూడా రాసా!ఎంత గా తల బొప్పి కట్టక పోతె, హఠాత్తుగా దెయ్యాలు వేదాలు వల్లిస్తాయి? మళ్లి కింద పడ్డ తనదే పై చెయ్యి అంటాడు. కామెంట్లు డిలీటు చేసినా నీ విషయం అందరికి చెబుతాలే అంటె…అవును ఏడ్చె చంటి పిల్ల వాడిలా వెళ్ళి కంప్లైంటు చేసుకో పొమ్మన్నాను.నేను భయపడిన వాడిని అయితే ఈ టాపిక్ మళ్లీ ఎందుకు ఎత్తుతాను?


స్వాతి వారపత్రిక చదవడమంటేనె సాహిత్యం చదవడమని,యండమూరి వీరెంద్రనాధే అసలు సిసలు రచయత అని అపోహలో వున్న నాకు మా నాన్నగారు మందలింపు వలన కొంత కనువిప్పు కలిగింది.ఆయన కలెక్షన్ వలన కొంతయిన మంచి సాహిత్యం చదవగలిగాను.అలాంటి నేను రంగనాయకమ్మ గారి మీద విమర్శ చెయ్యడం అంటే వుట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టె అని నాకు తెలుసు.దీనిని విమర్శ అనే కంటె నా అజ్ఞానం అనే అనాలి.నాకు తెలియని విషయాలు ఎవరైనా తెలియజేస్తారని ఆశిస్తున్నాను.చాలామంది రంగనాయకమ్మ గారు తన చిన్నతనంలో అంటే 23 సంవత్సరాల వయసులో రాసిన బలిపీఠం చదివే వుంటారు.అయితే నేను చదివింది,2008 మార్చి లో వచ్చిన 13వ ముద్రణ.దానికి ఆవిడ రాసిన ముందుమాట,కధ వెనక్కి వెళ్ల్లిపోయిన కొ.కు.గారి పీఠిక,చివరాఖరిలో తిరిగి రంగనాయకమ్మ గారు రాసిన చివరి మాట చాలా ఆలోచింప చేసాయి.

చిన్నతనంలో తన తెలియని తనం వలన కధలో రాసిన తప్పులని ఆవిడే చాలా చక్కగా విమర్శించారు.కాలగతిన మన ఆలోచన తీరు మారడం సహజం.బహుశా నేటి ఆవిడ భావజాలానికి బాగా విరుధ్ధంగా వున్నందున ఆవిడ ఒక సంజాయిషీలా ఈ చివరి మాట రాసుకున్నారు.నాకయితే అసలు కధ కన్నా ఈ చివరి మాటే ఇంకా నచ్చింది.ఈ పుస్తకం చదవని వారికి అవసరమయిన దగ్గర కొంత కధ వివరించరావచ్చు.అలసట తెలియక వినండి.కమ్యూనిస్టు కావలిసిన కధానాయకుడు రచయత (స్వయంగా చెప్పుకున్న)అజ్ఞానం వలన ఒక సంఘ సంస్కర్తగా మారిపోతాడు.కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడు అవుతున్న భాస్కర్, మహర్షి గారి మందలింపు వలన తన ‘పిచ్చి ‘ ఆలోచనలు కట్టి పెట్టి,సంస్కర్త గా మారిపోయేటట్టు చెయ్యడం తను చేసిన సంఘద్రోహంగా ఆవిడ భావించారు.ఆ వయసు నుండే రాజకీయ చైతన్యం కలిగిన వారిగా రంగనాయకమ్మ గారి ఆలోచనలు అలా కధలో చొరబడడం ఆశ్చర్యం కలిగించవు.కాకపోతే అది కధని కధాగమనాన్ని అస్సలు ప్రభావితం చెయ్యని విషయం.అసలు కమ్యూనిజం వలనే సమ సమాజం ఏర్పడుతుంది అని అప్పుడు కరుణ సమాజం వంటి ఆశ్రమాలు,భాస్కర్ వంటి సంఘ సేవకుల అవసరం వుండదని ఆవిడ అభిప్రాయం.అనాధలు అణగదొక్కపడ్డవారు వుండని సమాజం కోసం కమ్యూనిజం అవసరమని తెలిపారు.కమ్యూనిజం గురించి ఇంకా వివరిస్తూ,వేణుగోపాలరావు గారి పెదనాన్న బర్మా లో సంపాదించిన ధనమంతా (రిక్షాలు అద్దెకిచ్చి,హోటల్లు నడిపి)దోపిడి ధనమని రచయత్రి చెబుతారు.ఇక్కడ కమ్యూనిజం పైన నా అజ్ఞానాన్ని బయట పెట్టుకుంటున్నాను.

ఒక వ్యాపారం/పరిశ్రమ వృద్ధి చెందడానికి కార్మికుల పనితనం,నిబద్ధత ఎంత అవసరమో సరైన దిశానిర్దేశం కూడా అంతే అవసరం.లాభాలలో సరైనా వాటా ఇవ్వకపోతే పనివారిని దోచుకున్నట్టు అయితే మరి నష్టాలలో కూడా వాటా తీసుకుంటారా?పింకు స్లిప్పులు,వేతన కోతలు కమ్యూనిజం లో అంగీకారయొగ్యమేనా?కాదు కదా!మహా అయితే ఆ ఏడు బోనస్సులు వద్దంటారేమో?కాని ప్రతి ఏడు అల్లాగే వుంటే?అటువంటప్పుడు ఆ వ్యాపారాన్ని,లాభాల దిశలో నడిపినందుకు యజమానికి లాభాలలో కాస్త ఎక్కువ వాటా తప్పు కాదేమో?కమ్యూనిజం గురించి నాకేమి తెలియదని ముందే మనవి చేసుకుంటున్నాను.

ఇక కధ విషయానికి వస్తే రామనాధం గారు బాల్య వితంతువు అయిన అరుణ విషయం భాస్కర్ వద్ద ఎత్తినప్పుడు తనకు తార తో వున్న స్నేహం గురించి చెప్పకుండా మిన్నకున్నందుకు భాస్కర్‌ని ఉతికి ఆరేస్తారు రంగనాయకమ్మ గారు.సాదారణంగా ఎవరైనా పెళ్లి విషయం మాట్లాడడానికి సిగ్గు పడతారు.అటువంటి మొహమాటంతోనె భాస్కర్ తార విషయం చెప్పడానికి ఇబ్బంది పడి వుండచ్చు అని నా అభిప్రాయం.అది కాకుండా నేడొ రేపొ కన్ను మూసే పరిస్థితిలో అరుణని పెళ్ళి చేసుకుని ఆవిడ కి మనస్శాంతి కి కారణమవదామనుకున్నట్టూ కూడా అనిపిస్తుంది.ఎలాగూ ఆవిడ చనిపోతె తారని పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఏమి వుండదని భాస్కర్ అభిప్రాయం కూడా కావచ్చు.అయినా అరుణ తన అనారోగ్య కారణంగా భాస్కర్ సుఖ సంతోషాలకి లోటు జరగ వచ్చని,రెండో పెళ్లి చేసుకుంటే తనకి ఏమి అభ్యంతరం లేదు అని చెబుతుంది.నిజంగా తారని ఇష్టపడ్డవాడె అయితే ఆమెని కూడా చేసుకోవచ్చు కదా!బహుశా రెండు పెళ్లిల్లు చేసుకుంటే సమాజం లో తన ఇమేజి కి చేటు అని అలా చెయ్యలేదు అనిపిస్తుంది.అలా కాకుండా ముందు అరుణని పెళ్లి చేసుకుని ఆమె చనిపోతే మళ్లీ తారని చేసుకుంటె అటు తన సంస్కరణ కండూతి తీరుతుంది,తన మనసుకి నచ్చిన తార తో వివాహం కూడా జరుగుతుందని అనుకుని వుంటాడు.

ఆ విధంగా వర్ణాంతర వివాహం జరిగి భాస్కర్ అరుణ ఒకటవుతారు.కాని తన జాత్యాహకారం తో తన సంసారాన్ని అరుణ పాడు చేసుకుంటుంది.అయితే అరుణకి కనువిప్పు కలిగే విధంగా ఆవిడగారి కజిన్ సిస్టర్ అమల మతాంతర వివాహం చేసుకుని కూడా చక్కగా సంసారం సాగిస్తుంది.అమల వుద్యోగం మాని ఇంట పట్టున వుంటు అందరి మంచి చెడ్డ చూస్తు,వ్రతాలు నోములు చేసుకోవడం రంగనాయకమ్మ గారికి నచ్చలేదు.ఆర్ధిక స్వాతంత్రం ప్రతీ ఒక్కరికి అవసరమని చెబుతారు.ఒక సంధర్బంలో అరుణ అమలని “నువ్వు బొట్టు పెట్టుకోవడం మీ ఆయనకి ఇష్టం లేకపోతె ఏమి చేస్తావు”అని అడుగుతుంది.దానికి అమల ద్వారా చాల గొప్ప సమాధానం చెప్పిస్తున్నాను అనుకుని రంగనాయకమ్మ గారు ఇలా అనిపించినందుకు బాధపడ్డారు.”మానెస్తాను అక్కా!ఒకరికి ఒకరు అనుగుణంగా వుంటేనె కదా,సంసారం నడిచేది”.అనుగుణంగా వుండడం అంటే భర్త మతానికి భార్య మతం బానిస అవ్వడమా అని ప్రశ్నిస్తారు.బహుశా అమలకి తన మత విశ్వాసాల కంటె భర్త మీద వున్న ప్రేమానురాగాలు ఎక్కువ అని అనుకోవచ్చు కదా?ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మతాంతర,వర్ణాంతర వివాహం చేసుకునే ముందే ఇటువంటి విషయాలు ముందుగా మాట్లాడుకోవాలని ఆవిడ సూచిస్తారు.కాకపోతె నాకు ఒక అనుమానం.కమ్యూనుజం పై రంగ నాయకమ్మ గారి అభిప్రాయాలు మారినట్టె,మతం పైన వ్యక్తుల అభిప్రాయం మారవచ్చు కదా!పెళ్లికి ముందు మాట ఇచ్చినట్టు పెళ్లి తరువాత మాట నిలుపుకోవడం అవుతుందా?ఒక ఉదాహరణ.పెళ్లి అయిన జంటలో భర్తకి తాగుడో,పేకాటో లేక సిగరెట్లో అలవాటు అయ్యింది అనుకోండి,భార్య మానమని అడగడం,ఇంకా చెప్పాలంటె అతడి ఆరొగ్యం కోసం పోరు పెడితే ఇది “నా స్వవిషయం,ఇలా పోరు పెట్టడం నా స్వేచ్చకి భంగం కలిగించడమే!నీ పెత్తందారితనం కి నా నమస్కారం” అని అతడు విడిపోతానంటె ఎవరైనా సమర్ధిస్తారా? మతం కూడా ఒక మత్తు లాంటిదే కదా!దానిని మానమని ఒకరికి ఒకరు చెబితే అది మంచికే అని ఆలోచించాలా లేక ఇది నా వ్యక్తిగత స్వేచ్చకి సంబందించిన విషయం అని వాదనకి దిగాలా?నాకు తెలిసి కమ్యూనిష్టులు మతానికి వ్యతిరేకం కదా!మరి రంగ నాయకమ్మ గారి అబిప్రాయం ఏమయ్యి వుంటుంది?ముందుగానె చెప్పినట్టు ఈ ప్రశ్నలన్ని నాకు తెలియక అడుగుతున్నవే గాని,విమర్శిద్దామని కాదు,తెలిసిన వారు తెలియబరిస్తే సంతోషిస్తాను.


నేను  సానియా మీద అలిగాను. ఈ పోస్టు వెయ్యడానికి కూడా మనసొప్పలేదంటే నమ్ముతారా?కాకపోతే సాటి పెళ్లికాని మగ బ్లాగర్ల కోసం(అంటే వారి క్లారిఫికేషన్ కోసం) ఇది రాస్తున్నా!అసలు నాకు సానియా మీద కోపం ఎందుకొచ్చిందో చెప్పలేదు కదా!నా కంటే అందగాడా షోయబ్ మాలిక్?(డౌట్ వుంటే నా ప్రొఫైలు ఫొటొ చూడండీ! )నా కంటే ఈడు జోడునా వాడు? నాలాంటి యంగ్ హాండ్సము కుర్రాడిని వదిలేసి ఏవడో కౌన్ కిస్కా గొట్టాం గాడిని పెళ్ళి చేసుకుంటుందా సానియా?అసలు వాడిని చేసుకుని ఏమి సుఖపడుతుందండీ?వాడూ అంతర్జాతీయ క్రికెటరు కదా?సంవత్సరం లో పది నెలలు క్రికెట్ అంటు దేశం (ప్రపంచం) మీద పడి తిరుగుతాడు.అసలు సానియాని ఏమి పట్టించుకుంటాడు?(అఫ్‌కోర్స్ ఇప్పుడు మనోడి పరిస్థితి,వాళ్ల టీము పరిస్థితి చూస్తే అది అసంబద్దంగా అనిపిస్తుంది అనుకోండి.)ఇక ముద్దు ముచ్చట,ఆట పాట ఏమి జరుగుతాయి పాపం పిల్లకి?అదే నన్ను చేసుకుంటే ఎంత సుఖ పడుతుందని!

మనకున్న రాజ కార్యాలు అన్ని మానుకుని మరీ సానియా బాగోగులు చూసుకునే వాడిని కదా!అంతగా కావాలంటే తనకి టెన్నిస్ కోచ్ గా వుండి తన తో పాటు ఎప్పుడు తోడు నీడగా వుండేవాడిని కదా!(ఇంతకి టెన్నిస్ అంటే ఒక బల్ల వుంటాది,దాని మీద రంగు రంగు పెద్ద సైజు గోళీ కాయలు వుంటాయి.వాటిని ఒక పొడగాటి కర్ర పుల్ల తో పొడుస్తుండాలి అదే కదా?) నాకు తెలుసండి మీరు మరీను!(ఇక చూసుకోండి.చిన్న క్లూ ఇస్తే చెలరేగిపోను?) నెక్స్ట్ ఒలింపిక్స్ లో మనకి మాణ్ణాలుగు స్వర్ణ పతకాలు తెప్పించెస్తాను.సానియా తో పాటు మన దేశం కూడా క్రీడల్లో ముందుకు దూసుకు పోయేది.హ్మ్ ……ఏమి చేస్తాము చెప్పండి,ఎవరి రాతని ఎవరు మార్చగలరు?ఇది మన కోప కారణం.

అంతే తప్ప షోయబ్ మాలిక్ పాకిస్తాని అనో, భారత దేశంలో ఇంకెవరు దొరకలేదనొ ఆడిపోసుకోవడం అర్దం లేనిది.అతడు ఏదొ తప్పు చేసాడని మనం అనుమానాలు వ్యక్తపరిచి ఇంత తెలివి తక్కువగా వాడి బుట్టలో పడ్డావేంటి సానియా అని జాలి పడక్కరలేదు.అతడు తప్పు చేసాడొ లేదో గాని ఆ వివాదం ఇప్పుడు ముగిసింది.ఆ నిజానిజాలు మనకి తెలియవు.ఇంకొంతమంది,అసలు ఇంత తొందరగా వీళ్లు ఎందుకు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నారని,కళ్యాణమొచ్చినా,కక్కొచ్చిన అసలు ఆగదు,ఆ కక్కే ముందు వస్తే అస్సలు ఆగదు అని ఛంఢాలమైన అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.అది చాలా అసంబధ్ధంగా అనిపిస్తుంది.అది కాకుండా మనకి తెలియని మనుషుల వ్యక్తిత్వం పై అంత చౌకబారు ఆరొపణలు చెయ్యడం మన దిగజారుడుతనం ని చాటి చెబుతుంది.ఒక మనిషి మంచొడా చెడ్డొడా అన్నది వాడి జాతీయత మీద ఆధార పడదు.ఈ సంకోచపు చట్రాలను వదిలి సాటి మనిషిని సాటి మనిషిలా చూడాలి.అంతే కాకుండా ఎదుటి వ్యక్తికి వ్యక్తిగత స్వేచ్చ అనేది ఒకటి వుంటుంది అని (సెలబ్రిటి అయినా) గుర్తుంచుకోవాలి.

ఈ ఆడ సెలబ్రిటిలు అందరు ఇలా రెండో పెళ్లి వారిని ఎందుకు పెళ్లి చేసుంటారని ఒక పెద్దాయన అనుమానం వెలిబుచ్చారు,దానికి సమాధానం నా దగ్గర లేదు గాని సానియా నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదొ మటుకు తెలుసు.చిన్నప్పుడు హైస్కూలువరకు తను చేసిన ప్రతిజ్ఞ చాలా సీరియస్సుగా తీసుకుందట!ఆ ప్రతిజ్ఞ ఏమిటంటారా?

“భారత దేశం నా మాతృదేశం.భారతీయులు అందరు నా సోదర సోదరీమణులు……..”


గత వారం అర్జెంట్‌గా ఆంధ్ర ప్రదేశ్ వెళ్ళవలిసి వచ్చింది.చాలా సంవత్సరాల తరువాత మన ఎర్ర బస్సు కూడా ఎక్కడం జరిగింది.అలా అనుకోకుండా ఒక సారి ఎర్ర బస్సు ఎక్కినప్పుడు జరిగినది అందరి తో పంచుకుందామనుకున్నాను. అయితే రవిచంద్ర గారి అంతర్వాహిణి లో కూడా ఇదే విషయం గురించి ఆయన చర్చించడంతో ఈ టపా అవసరం లేదు అనుకున్నా!కాని ఒక కామెంట్ గా నా ఆలోచనలు అన్ని చెప్పడం కూడా కుదరక మనసు మార్చుకున్నాను.వైజాగ్ లో నాన్‌స్టాపు బస్సు ఎక్కి శ్రీకాకుళం వెళ్ళవలిసిన పని పడింది.అప్పటికే కొంచెం లేట్ కూడా అయిపోయింది.రాత్రి 8 గంటలకి బయలు దేరాము.రెండు గంటల ప్రయాణం!లేట్ అయితే హోటల్లు కూడా కట్టేస్తారు అని నన్ను నేనే తిట్టుకోవలిసిన పరిస్థితి.బస్సు మంచి స్పీడు మీద వుండడంతో ఆలోచనలు కట్టి పెట్టి కునుకు మొదలెట్టా. హఠాత్తుగా ధడ్ ధుడ్ మంటు శబ్దాలు.కునుకు మత్తు కళ్ళగప్పి పోయింది.ఏమయ్యిందో కాసేపటి వరకు తెలియలేదు.ఆ కాసేపటి తరువాత కూడా తెలిసినది సగం సగం!మా బస్సు లారిని గుద్దిందో లేక లారి నే మా బస్సు ని గుద్దిందో గాని,ఒక చిన్న పాటి యాక్సిడెంట్ అయ్యింది.

మా బస్సు డ్రైవరు ఒక చిన్నపాటి చేజింగ్ చేసి ఆగకుండా వెళ్ళిపోయిన లారిని పట్టుకున్నాడు.పెద్దపాటి గొడవ వేసుకున్నాడు ఆ లారి డ్రైవరు తో!లారి డ్రైవరు మటుకు ఏమి పట్టించుకోకుండా డాబాకి వెళ్ళి భోజనం చెయ్యడం మెదలెట్టాడు.మధ్యలో పాసింజర్లంతా వెర్రి మోహాలు వేసుకుని చూస్తున్నాము మా పరిస్థితి ఏంటి అని?ముందు లారి డ్రైవరిని ఆడిపోసుకున్నాము మా వాడితో కైలిసి,తరువాత నెమ్మదిగా మా పరిస్థితి ఏంటని అడిగాము వాడిని.”డిపో కి ఫోను చెయ్యాలి,ఎవరైనా వచ్చి కంప్లయింటు రాసుకుని పోలిసు రిపోర్టు రాసుకున్నాకా బస్సు కదులుతుంది” అన్నాడు. సరెలెమ్మని అందరు ఫోన్లు తీసిచ్చారు,తొందరగా అక్కడ నుండీ బయట పడుదామని.ట్విస్టు ఏమిటంటే వాడికి డిపో ఫోను నంబరు తెలీదంటా!!కుడితిలో పడ్డ ఎలుక లా తయారయింది మా పరిస్థితి!ఎవడో శనిగొట్టుగాడు మా తో పాటు బస్సు ఎక్కడం వల్లే ఇలా అయిందని ఒకరు ముఖాలు ఒకరు చూసుకున్నాము.ఇలాగయిత ఎలాగా మాపరిస్థితి అని ఒక పెద్దాయన గొడవ వేసుకున్నాడు.”మీ పరిస్థితి కి ఏమయ్యిందండీ,నా తప్పు లేకపోయినా ఈ నష్టం అంతా నా జీతంలోనె కట్ చేసి కవరు చేస్తారు” అని ఏడుపు ముఖం పెట్టాడు మా డ్రైవరు!ఏదొ ప్రైవేటు సర్వీసు అయితే ఎలగో వాళ్ళ కాళ్ళ వేళ్ళ పడి క్షమించమని అడిగెయ్యొచ్చు.ఆర్టీసు వారి కి అంత దయ ఎక్కడ?”అని అన్నాడు వాడు.ఇంతలో ఒక బస్సు అటు వైపు వస్తే దాని ఆపి మమ్మలని అందులో ఎక్కించాడు.అది కూడా డొక్కు పాసింజరు!69 రుపాయలు పెట్టి నాన్‌స్టాపు టికెట్ తీసుకుని,డొక్కు పాసింజరు లో వెళ్ళవలిసి వచ్చింది.అదే మేము పాసింజరు బస్సులో వుండి దానికి ఏదయినా రిపైరు వస్తే నాన్‌స్టాప్ బస్సు ఆపుతాడా?

అసలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సంస్థ లా పని చేస్తుందా మన ఆర్టిసీ?ఇది ప్రజల సౌలభ్యం కోసం నడుపుతున్నారా?లేక లాభ ఆపేక్ష కోసమా?ప్రజలనే కాదు,వారి సిబ్బంది కూడా ఈ డబ్బు పిశాచి లాంటి సంస్థ,దాని వెనక తోడ్పాటు అందివ్వని ప్రభుత్వం కి బలి అయ్యిపోతున్నారు.వైజాగు లో బస్సు చార్జీల కంటే ఆటో చార్జీలు చాలా తక్కువ!విధ్య,వైధ్యం మరియు రవాణా కనీస అవసరాలు కావా?ప్రభుత్వం నడిపే స్కూల్లు,ఆసుపత్రులు నష్టాల్లో వున్నాయని మూసేస్తారా?కనీసం సిబ్బంది కి కూడా జీతాలు సమకూర్చుకోలేవు కదా ఆ స్కూల్లు,ఆసుపత్రులు?అంతర్వాహిణి రవిచంద్ర గారు తమ కామెంట్ లో బిజీ వేళలో బస్సులు తక్కువని వాపోయారు.కరక్టే!కాని నేను అనేదేమంటే,రాష్ట్రం లో రోజుకి ఒక బస్సు అది కూడా ఒక్కసారే తిరిగే వూళ్ళెన్నో?మన దేశం లో అయితే అసలు బస్సు సర్వీసు లేని ప్రాంతాలు ఎన్నో కదా?అలాంటి చోట ఏ మెడికల్ ఎమర్జన్సి అయినా కేవలం రవాణా సదుపాయం లేక ఎన్ని ప్రాణాలు పోతాయో కదా?మన ప్రభుత్వాలకి ఏమి భాద్యత వుండదూ?


గత నవంబరు లో ఒకే రోజు మా స్నేహితుల్లో ముగ్గురి పెళ్ళి కుదిరింది.అందులో ఇద్దరి పెళ్ళి వైజాగు లో ,మరొకడిది నాగ్‌పూర్ లో.మోకాలిని తడుముకుంటు తెగ ఆలోచించా!చించగా మిగిలింది ఏమిటంటే వైజాగు లో ఇద్దరి పెళ్ళి అయినా ముహుర్తం టైముకి ఎవరో ఒకరి దగ్గర మాత్రమే వుండగలం,ఇంకా ఇద్దరిలో ఎవరి పెళ్ళి ముహుర్తానికి హాజరు అయినా మరొకరు ఆడిపోసుకుంటారు ఇంత దూరం వచ్చి పెళ్ళి చూడలేదు అని.అందుకని నాగ్‌పూర్ చెక్కేశా హుషారుగా,కాని నాకేమి తెలుసు పెళ్ళికని బయలు దేరి చావు చూస్తానని?

అమ్మాయి అబ్బాయి ఇద్దరు గుజరాత్ లోనే సూరత్ లో ఎస్సార్ స్టీల్స్ లో జాబు చేస్తుండెవాళ్ళు.అసలే మావాడిది లవ్‌మ్యారేజ్!అతి కష్టం మీద మావాడి ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు.వాళ్ళిద్దరికి సపొర్టుగా మా స్నేహితులంతా అక్కడ నుండె ఒక టయొటా బుక్ చేసుకుని వచ్చారు.ఇంకా ట్విస్ట్ ఏమిటంటే రవిగాడి అన్న ఇంకా పెళ్ళికాని బాలా కుమారుడాయే!అన్నగాడు పెళ్ళికూతురు చెల్లికి లైను వేస్తుంటే నవ్వు ఆపుకోలేకపొయాము.వెదవకి ఇన్నాళ్ళు బుద్ది ఏమి అయ్యింది?తమ్ముడు ఎవరినో ప్రేమించి పెళ్ళి చేసుకోడానికి రెడీ అయ్యేంతవరకు మీనమేషాలు లెక్కపెట్టుకునొ,అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటే వచ్చె కట్నం మీద ఆశతోనొ మంచి కాలం మించనిచ్చి,ఆకులు వెతుకుతుంటే పగలబడీ నవ్వుకున్నాము.మావాడి కజిన్ సిస్టర్ హడావుడి కూడా చూడవలిసిందే.మగపెళ్ళివారి హూందా అంతా ఆవిడ తన భుజస్కందాల పైనే మోసింది.ఎలాగంటే పెళ్ళికూతురు చీర కంటే ఖరీదైన చీర కొనుక్కుని.??!!ఆడ పెళ్ళివారిని  ఆవిడ, పెళ్ళి కూతురి చెల్లిని మా వాడి అన్నగాడు చెడుగుడు ఆడేసుకుంటుంటే మా స్నేహితులంతా కలిసి వీలయిన దగ్గరల్లా కవర్ చేసేము.చాలా రోజులు కి కలిసారు మా ఫ్రెండ్స్ అందరు.అందులో ముగ్గురు పెళ్ళి అయిన వాల్లు,ముగ్గురు బ్రహ్మచారులు.టయోటా లో వాళ్ళ ప్రయాణం ఒక పెద్ద స్టోరి.

సరయిన కాగితాలు లేని ఆ బండిని సూరత్ నుండీ నాగ్‌పూర్ కి తెచ్చెటప్పటికి తడిసి మోపెడు అయ్యిందట మావాళ్లకి.అసలే ఆ డ్రైవర్ బాగా తేడా అని మా వాళ్ళందరు అంటున్నా నేను మరుసటి రోజు మా ఫ్రెండ్ ని రిసీవ్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ కి బలవంతంగా బయలుదేరించాను.ముఖం చిటపటలాడించుకుంటూ ఆ డ్రైవర్ ఎలాగో బయలుదేరినా కొద్ది దూరం వెళ్ళటప్పటికే ఒక సైకిల్ కుర్రాడిని గుద్దేసి, నా సరదా కూడా తీర్చేసాడు.అది కూడా ట్రాఫిక్ సిగ్నల్ కి ఎదురుగా!!అటు సైకిల్ కుర్రాడికి ,ఇటు ట్రాఫిక్ పోలీసులకి చదివించుకున్నాకా ఇక పెళ్ళిలో చదివించడానికి పెద్దగా మిగల్లేదు!బుద్దొచ్చింది నాకు కూడా.మా కాటేజ్ కి ఎదురుగా వాడు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కుర్చున్నా కాళ్ళీడదీసుకుంటూ, తిరిగాము మేము ఆ తరువాత! ఆ రోజు మధ్యాహ్నం నేను ఎదురుగా హోటల్లో టీ తాగుతున్నప్పుడు ఒక టీ వాడికి పంపి శాంతి ఒప్పందం చేసుకున్నాను.మనిషి మంచోడె! మళ్ళీ మనకి అవసరం పడినప్పుడు కుట్ర పన్ని జేబులో దాచుకున్న నాలుగు రాళ్ళు రాలగొట్టడని!

ఇంకా ఆడ పెళ్ళివాళ్ళు పూర్తిగా ఉత్తర భారత  సంప్రదాయాలు పాటించారు.సాయంత్రం పెళ్ళి కొడుకుని తెచ్చెటప్పుడు వాళ్ళలోనే కొంతమంది,బారాతి గా బయలుదేరి డాన్సులు చెయ్యడం మొదలు పెట్టారు.ఇంకా మాకు తప్పింది కాదు.మగ పెళ్ళివారికి ఇది అలవాటు లేదాయే!తెగ ఇబ్బంది పడిపోయారు.వాళ్ళు ఇబ్బంది పడ్డంత వరకు మాకు ఇబ్బంది అనిపించలేదు కాని,మా వాడిని కూడా కారు దింపి డాన్సు చెయ్యడానికి పిలవమని పెళ్ళికూతురి చెల్లి మా రవి గాడి అన్నని అడిగింది.అన్న కూడా మేము వెళ్ళి బలవంతం చేస్తే కారు దిగిన మా వాడు ప్రళయ తాండవం మొదలు పెట్టాడు.అయితే మమ్మల్ని తన్నేటట్టు కాళ్ళు చేతులు విసరడం లేక పోతె అసహ్యంగా నడుము వూపడం!!బిత్తర చూపులు చూడడం ఆడ పెళ్ళి వారి వంతయ్యింది.కళ్యాణ మండపం కి చేరుకున్నాక కొంత సేపు సేద తీరి,బయటకి వచ్చాము చల్లగా ఏమయినా తాగుదామని గార్డెన్లోకి.

ఇంతలో మా కాటేజ్ కి ఎదురుగా వున్న హోటెల్ సప్లయర్ ఒకడు పరిగెట్టుకుంటూ వచ్చి చెప్పాడు మా డ్రైవర్ పడిపోయాడు  అని.అప్పుడే వాడు చేసిన నిర్వాకాల గురించి తిట్టుకుంటున్నాము మేము.తెగ సిగరెట్లు కాలుస్తున్నాడు తొందరగా పోతాడని.ఇది వినగానే వడి వడిగా పరిగెట్టుకుంటు అక్కడికి వెళ్ళాము.నోటి దగ్గర నురగ.ఫిట్సా అని కంగారు పడుతుంటే హోటెల్ వాడు చెప్పాడు స్పృహ తెప్పించడానికి తానే వుల్లిపాయ పెట్టానని.గుండెల్లో మంటగా వుంది,తిన్నదరగలేదేమోనని తన దగ్గర డైజిన్ మాత్రలు తీసుకున్నాడని చెప్పాడు.భారీ విగ్రహమాయె!కిందపడ్డవాడిని సరిగా పెట్టడానికి చాలా కష్టం అయ్యింది.శ్వాస ఆడుతున్నట్టూ అనిపించింది?పక్కనే వున్న చిన్న హాస్పిటల్కి తీసుకెల్లాము.ఎమర్జెన్సీ సర్వీసు వుంది అని బోర్డు వున్నా డాక్టరు లేరని నర్సు అడ్మిట్ చేసుకోలా.అసలు పెళ్ళి హడావుడీ లో వున్నారు కదా అని మా వాళ్ళెవరి కి చెప్పొద్దని ఒక ఫ్రెండ్ ని అక్కడే వదిలి మిగిలిన వాళ్ళం హాస్పిటల్ కి బయలు దేరాము. 

దారి పొడుగునా కృత్రిమ శ్వాస అందివ్వడానికి ప్రయత్నించాను.కాని భయం తో మెదడు మొద్దుబారి పోయింది.టయోటా నడుపుతున్న మా ఫ్రెండ్ కూడా డ్రైవింగ్ కి కొత్త.ఈ పరిస్థితి కి ఇంకా భయపడిపోయాడు.హాస్పిటల్ చేరుకునేటప్పటికే గుండె పోటు తో   చనిపోయాడని ధృవీకరించారు డాక్టర్లు.అప్పటి వరకు వాడినే సిగరెట్లు ఎక్కువ కాలుస్తాడు ఎక్కువ కాలం బతకడు అని తిట్టిన మా ఫ్రెండ్ కంటి కొలుకన కన్నీటి చుక్క!తన మాట నిజమయ్యిపోయిందేమో అని?దారి పొడుగున వాడికి ఏమి కాదు అని హడావిడీ చేస్తు మాకు ధైర్యం చెప్పి వచ్చి రాని కృత్రిమ శ్వాస అందించిన వాడు స్తబ్దుగా వుండిపోయాడు.అందరికి షాక్!వాడి సామానులు మాకు ఇచ్చేసారు.అందులో ఫోను తీసుకుని నంబర్లు చెక్ చేసాను.లక్కీగా వాడి ఇంటివాళ్ళ నంబర్లు కాకుండా ఇంకొన్ని నంబర్లు వున్నాయి.తక్కువ సార్లు ఫోను చేసిన నంబరికి చేసి వాడి ఇంటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాను.ఒక రెండు మూడు ఫోను కాల్స్ తరువాత వాడి ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసు నంబరు దొరికింది.వాడి ఒక్కగానొక్క కూతురి పుట్టిన రోజంట ఆ రోజు.సెలవు అడిగినా ఇవ్వనందుకు చాలా కోపంగా వున్నాడని,అతడు వాపోయాడు.

మార్చురి కూడా లేని ఆ హాస్పిటల్ నుండీ గవర్నమెంట్ హాస్పిటల్ కి బాడీ వాన్ లో తీసుకు వెళ్ళేటప్పుడూ చాలా భయ పడ్డాము.మా కళ్ళ ఎదుటే బాడీ నల్ల పడిపోవడం,కళ్ళ నుండీ ,చెవుల నుండీ నీళ్ళు కారుతుంటే చావుని అంత దగ్గర నుండి చూసి వణికిపోయాము.గవర్నమెంట్ హాస్పిటల్ లో పోలీసుల విచారణ,అనుమానపు చూపులు రాత్రి రెండు వరకు భరించి,పెళ్ళి అయ్యేంత వరకు ఆగి అప్పుడూ మా స్నేహితుడు ద్వారా పెళ్ళి కూతురు తండ్రి తాలుకు వారికి కబురు పెడితే వారు వచ్చి మమ్మల్ని తొందరగా ఆ వాతావరణం నుండి బయటకి రావడానికి ఇంఫ్లుయెన్స్ ఉపయోగించారు.పెళ్ళి బాగానే జరిగిందట!థాంక్‌గాడ్ !!కాకపోతె వాడి బాడీ రికవరీ చేసుకునేటప్పటికి వాడి ఇంటివాళ్ళకి మూడు రోజులు పట్టిందట!!!! 

  జీవితం ఎంత క్షణ భంగురం?