ఔనౌను … పేరులో ‘నేముంది???

Posted: జూన్ 6, 2010 in పిచ్చాపాటి

చాలా రోజుల తరువాత బాగా నవ్వించిన టపా 4E గారి పేరులోనేముంది? నవ్వాపుకోలేకపోయాను. అయితే ద్రోణాచార్య గారు, ఈ బాధ అందరికి వుంటుందేమొ అసలు! చాలామందికి తమ పేరులు నచ్చవు. కొద్దిమందికి మాంఛి మోడ్రన్ పేరులు కుదురుతాయి, కానీ ఆ పేరుకి మనం పాతబడి పోయి ( అంటే మనం ముసలాళ్లు అయిపోయినట్టు మన పేరులు ముసలవి అవ్వవు కదా ) ఎబ్బెట్టుగా తయారు కావచ్చు. ఏంటిరా ముసలాడికి ఈ పేరు , పేరు చూసి బాలా కుమారుడు అనుకున్నారా అంటూ వెక్కిరింతలు…సరె మరి కొంతమందికి ముసలికాలం లో ఈ ఇబ్బంది పడకుండా పుట్టినప్పుడే మాంఛి ముసలి పేరు పెడతారు. గొప్పగా చావడానికి బీదగా బ్రతకనిచ్చే జీవిత భీమాలలా ఇవి కూడా పేరు పట్టింపు వుండే కాలం లో అక్కరకి రాకుండా , ఆ అక్కర వచ్చినప్పుడు పట్టింపు లేకుండా అటు ఫలం దక్కక ఇటు వ్రతం చెడ్డ రీతిన వుంటాయి. కొద్దిమంది అదృష్ట వంతులు అసలు పేరుతో ఇంత ఇబ్బంది పడరు, అయితే మటుకు వాళ్లు మటుకు సుఖ పడిపోతారు అనుకున్నారా? వారిని ఏడిపించడానికి అవి అసలు పేరులు కావచ్చు, ఇంటిలో వారు పిలిచే ముద్దు పేరులు కావచ్చు, లేక మన తోటి కేతిగాళ్లు ఏడిపించే పేరులు కావచ్చు తయారుగా వుంటాయి. కాబట్టి ఈ విషయంలో మీతో పాటు, నా తో పాటు సింపతీ చూపేందుకు చాలామందే వుంటారు లెండి. నా తో పాటు అంటే అర్ధం కాలేదా? నేను కూడా మీ లాంటి పేరు బాధితుడినే లెండి.

నా పేరుకొచ్చిన సినిమా కష్టాల జాబితా చాలా పెద్దది. నేను పుట్టక ముందే మొదలయ్యింది ముసళ్ల పండగ 🙂 . మా కుటుంబం లో ఆఖరి మగ నలుసు కావడం నేను చేసుకున్న పాపం. మా పెదనాన్నలు ఎవరూ వాళ్ల మగపిల్లలకి మా తాతగారి పెట్టుకోకపోవడం నాకు మూఢింది. మా తాతగారికి అట్టాంటి ఇట్టంటి పేరు వుండనేలా? వుండింది ఫో! అది నా కోసమే రిజర్వ్ చేయబడనేలా? చెయ్యబడింది ఫో! మా తల్లిదండ్రులు దానికి కట్టుబడనేలా? నాకిలా మూఢడం ఏలా? అంతా మన ఖర్మ 😦 ఇంతకీ మనకి ప్రాప్తించిన నామధేయం ఏమనగా….టట్టడొయీ..”కృష్ణమూర్తి” పుట్టినప్పుడు మనకేమి తెలుస్తాది ఈ పేరు తో పుర ప్రజలు మనలని ఎలా ఆడుకుంటారో?? గమ్మున ఊరుకున్నాను. ( ఊరుకోక అప్పుడు మటుకు చేసెదేమి లేదు కదా ) నెమ్మదిగా స్లో మోషన్లో పెద్దవ్వసాగాను. నా తో పాటె నా కష్టాలు పెద్దవయ్యాయి. చింకి లాగులు వేసుకుని చీమిడి ముక్కుతో ఆడుకునే రోజులలోనె పరిచయం వున్న ప్రతి దారిని పోయె దానయ్యా..” ఏరా బాబూ నీ పేరెంటిరా ? ” అని అడగడం… ముద్దు ముద్దుగా నేను కిత్నమూతి అనడం…… భళ్లున అద్దం పగిలినట్టు నేను జడుసుకునేటట్టు “హహహ్హాహ్హా ఏంటి కుక్కమూతా? ” అంటూ నన్ను ఆటపట్టించేవారు 😦 ఏమి చేస్తాను, ఆహ అసలు ఏమి చెయ్యగలను చెప్పండి, బుంగ మూతి పెట్టుకుని ఇంటికి పరిగెట్టడం తప్ప ? ఈ నా సినిమా కష్టాలు మా ఇంటివారు కి తెలిసి సరెలే పిల్లాడు తెగ ఇదయిపోతున్నాడు అని పేరు మార్చేసారు అప్పటి మన గవర్నర్ పేరు కృష్ణకాంత్ అని . హమ్మయ్యా అనుకున్నా నా కష్టాలు ఇక తీరిపోయాయని. నాకేమి తెలుసు అభీ పిక్చర్ బాకీ హై దోస్తు అని???

ఆ పేరు ఎక్కువ రోజులు అచ్చి రాలేదు. అసలు పేరు వదిలేసి ఏయ్ కాంతూ , ఓయ్ కాంతూ , ఎహెయ్య్ కాంతంగా అని మళీ ఏడిపింపులు స్కూలులో బుడంకాయలు. అయినా ఎక్కువ కాలం ఆ పేరుతో బాధ పడలేదు లెండి, ట్రాన్స్‌ఫర్ వలన మేము ఊరు మారినప్పుడు స్కూలు మార్పిడిలో నా పేరు ముచ్చట గా మూడోసారి మారిపొయ్యింది వెనకాల ఎటువంటి తోక లేకుండా వెంకట కృష్ణ అని. చచ్చినట్టు అందరూ ఇక కృష్ణ అని పిలుస్తారు అని ముచ్చట పడిపోయా! ఇంతలో హైస్కూలు లో పడ్డాను. కృష్ణ అన్న పేరుతో పిలవబడతాను అనుకున్న నా ఆశలు అడియాసలు అయ్యాయి. నా ఒంటి పేరు ముందు వున్న ఇంటి పేరుతో కలిపి పొడిగా ఎన్వీ కృష్ణా అయ్యిపోయాను. అక్కడ ఆడుకున్నారయ్యా నా సామిరంగా ! ఆ విధంబెట్టిదనినా…. ఆ కాలం లోనె పెళ్లి సందడి సినిమా వచ్చింది. నా ఖర్మ కాలి హిట్టయ్యి కుర్చుంది. ఆ సినిమా హిట్టయ్యితే నా ఖర్మ ఎలా కాలింది అంటారా? ఆ సినిమాలో హీరొ శ్రీకాంతు , బ్రహ్మానందం ఇద్దరి పేర్లు ఎన్వీ కృష్ణే! శ్రీకాంతు నిప్పు విజయ కృష్ణ అయితే బ్రహ్మానందం నెయ్యి విజయ కృష్ణ అన్న మాట! ఒరెయ్ నీ పేరు ఏంటిరా నిప్పా… నెయ్యా…. అంటూ కొద్దిసేపు నన్ను బ్రహ్మానందం తో ఆడుకున్నట్టు ఆడుకుని ఆ ముచ్చట తీరాక హఠాత్తుగా హీరొని చేసెసి ” ఒరెయ్ అన్నట్టు నీ స్వప్న సుందరి ఎవరు రా ? ” అంటూ చెడుగుడు ఆడేసుకున్నారు. కొన్నాళ్లకి ఆ సినిమా వేడి తగ్గింది. నాకు మంచి కాలం వచ్చింది అని సంతోషించా ! ఉహ్..ఉహ్హూ! నా భ్రమ ! అసలు ట్విస్టు అప్పుడే జరిగింది.

స్కూలుకి క్యారేజు వస్తే క్లాసు మధ్యలో ఆయా వచ్చి పేరు పెట్టి ఇదిగో బాబూ, ఇదిగో పాప ఇక్కడ పెడుతున్నా అని చూపించి తలుపు దగ్గర పెట్టేది. అలాగె ఒకరోజు ఆవిడ వచ్చి ” రమ్యకృష్ణ ఎవరూ ? ” అంది క్వశ్చన్ మార్కు ముఖం పెట్టి…అందరూ ముఖాలు చూసుకున్నాము ఈ పేరు తో ఏ అమ్మాయి మా క్లాసులోనె కాదు మా స్కూలులోనె లేదు కదా అని ! మరొ రెండు సార్లు అడిగాక నా జీవితాన్నే మార్చేసె అవిడియా ఆవిడ కి వచ్చి షరా మామూలుగా నాకు మూఢింది. ” ఇదిగో ఈ క్యారెజీ బుట్ట ఎవరిది ” అంటూ బ్యాగు ఎత్తి చూపింది. తెల్ల ముఖం వేసుకుని పిచ్చి చూపులు చూస్తూ లేచి నిలబడడం నా వంతు అయ్యింది. ఎన్వీ కృష్ణని కాస్త రమ్యకృష్ణ అని విన్న ఆవిడ ‘ కర్ణ కావరం ‘ కి మండిపోతు 😦 అయినా క్యారెజు బ్యాగు చూసి చొంగ కార్చుకుంటూ లేచినందుకు నన్ను నేనె తిట్టుకున్నాను లెండి. ఒక్క పూట ఆ క్యారేజు నాది కాదు అనుకుని కడుపు మాడ్చుకున్నా అంత పోయెదేమి లేదు, ఎలాగూ పక్కన వాళ్ల డబ్బాల మీద పడొచ్చు కదా! బుధ్ధి తక్కువ అలా బయట పడిపోయా. ఇక స్కూలు నుండి బయట పడేంత వరకు ఎవరికి ఎప్పుడు మూడొచ్చినా ఆడుకోవడానికి మనమే! కాలం చాలా గొప్పది. ఇన్ని కష్టాలు తో కూడా నెమ్మది నెమ్మదిగా నన్ను ఆ కుంపటి నుండి బయట పడేసింది. కాలేజి కొచ్చా! కష్టాలు కొంచెం తగ్గాయి. ఎటొచ్చి ఎన్వీ గా స్థిర పడిపోయిన నాకు అప్పుడప్పుడు నాన్వెజ్ కృష్ణా అని పిలిచేవారు మా కేతిగాళ్లు. మనం కూడా తెలివి మీరిపోయి పెద్దగా ముఖం మాడ్చుకునేవాళ్లం కాదు లెండి. దాని తో ఎంటర్‌టెయిన్మెంటు తక్కువ అయ్యి వాళ్లు ఆ పేరు కూడా వదిలేసారు.కాలేజి నుండి బయట పడ్డాక ఇక కష్టాలు పూర్తిగా తీరిపోనట్టే!  థాంక్ గాడ్! { అన్నట్టు నిజంగా థాంక్ గాడేనా? మానిన గాయాలు మళ్లీ రేగ్గొట్టుకోలేదు కదా! ఓహ్ మై గాడ్ 😦 }

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. సుజాత అంటున్నారు:

  బావున్నాయి మీ పేరు కష్టాలు! పేరులోనేముందిలే? అనుకోడానికి లేదు! నేనూ రాస్తా ఉండండి ఒక పోస్టు..నా పేరు మీద కాదు, కామన్ గా కొందరి పేర్లకు ఉన్న కష్టాల గురించి.!

  • krishna అంటున్నారు:

   అవునండీ సుజాతగారు, ఇంతా జరిగాక కూడా పేరులోనేముందిలే…….అని తేలిక గా అనలేములెండి. మీ పోస్టు కోసం ఎప్పటిలానె ఎదురు చూస్తున్నాను.

 2. nagarjuna అంటున్నారు:

  చిన్నప్పటి ‘కిత్నమూతి’ మీకు ఇంకాగుర్తున్నాడంటే మీ memory power కు దండేసి దండం పెట్టాలి…
  ఉత్తి కృష్ణ రమ్యకృష్ణ అయినతీరు కడు రమ్యముగానున్నది… 🙂 అయినా పేరుని మూడుసార్లు మార్చుకునే అవకాశం వచ్చినందుకు ఐ NV యూ….

  పోస్టుకు పబ్లిసిటి ఇస్తున్నందుకు చాలా థాంకులు గురు…

  • krishna అంటున్నారు:

   4E గారూఊఊ….. నాకు దండతో పాటు పండు కూడా కావాలి అంతే!
   మీరు రాసినది మంచి పోస్టు,… ఇందులో నేను ఇచ్చె పబ్లిసిటి ఏమి లేదులెండి….. దాని విజయం తో నేను కాష్ చేసుకుంటున్నా అంతే!!!

 3. sowmya అంటున్నారు:

  భలే భలే కిత్నమూతి….హ హ హ 😀

  మొత్తానికి కృష్ణమూర్తి కాస్త రమ్యకృష్ణ అయిపోయారన్నమాట.

  హి హి హి…..మొన్న char’i’ గారు ఈరోజు కిత్నమూతిగారు భలే నవ్వించారు పేర్లతో 😀
  నా పేరుకీ ఉంది ఓ పేద్ద కథ, నేనేం తక్కువ తిన్నానని…నేనూ రాస్తా నా పేరు కథ 😛

  • krishna అంటున్నారు:

   @ సౌమ్య గారు..హన్నా! మా కష్టాలు చెప్పుకుంటే మీకు నవ్వ్లాటగా వుందా? సరెలెండి, మీరు మీ పేరు వెనక కధ రాయండి, మేము వచ్చి హహ్హహ్హా… హిహిహిహ్హి..ఎహెహ్హె…ఒహ్హొహ్హొ అంటూ నవ్వుతాము…ఆ..
   @ సుజాత గారు, సౌమ్య గారు,
   ఒక వినతి… మీరు రాసే టపాలకి కూడా 4E గారి టపా పేరులోనెముంది అన్న పేరు శీర్షికలో వచ్చేటట్టు రాస్తారా? ఒక కనెక్టివిటీ వుంటుంది. సీరియస్ విషయాలలో వాద ప్రతి వాద టపాలు వచ్చినట్టు ఇలాంటి సరదా విషయాలు మీద కూడ వస్తే బాగుంటుంది. అవి చదివి తమ కష్టాలు టపాలు రాసేవారు కూడా ఆ శీర్షికని వాడుతూ రాస్తే ఎలా వుంటుంది? ఆలొచించండి ఒకసారి.

 4. చంద్రమౌళి అంటున్నారు:

  చాలా బాగుందండీ..

 5. sowmya అంటున్నారు:

  హ హ హ మీ సూచన బావుంది…అలాగే చేద్దాం 😀

 6. bondalapati అంటున్నారు:

  hilarious..esp kitna mooti episode

 7. Jayavani అంటున్నారు:

  That’s a very funny post kitna moothi! hahaha
  I’m quite impressed with the first paragraph, the way you gave resemblance to old type names and the insurance policies 🙂

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s