దేవుడిని పడగొడదాము రండీ!-ముగింపు

Posted: ఏప్రిల్ 5, 2010 in అఙ్నానం, కధలు
ట్యాగులు:,

“అసలు పొగడ్త కి అర్హులు ఎవరు అన్నది పక్కన పెడితే ఎవరిని మనం ప్రశంసించితే మనకు లాభమో చూడాలి.దేవుడిని ప్రశంసించడం అంటే అతని శక్తిని సామర్ద్యాన్ని మనకి మనం గుర్తు చేసుకోవడం మాత్రమే గాని ఒక అపాత్రుని పొగడ్డం ఎంత మాత్రం కాదు.పూజించడం వలన కష్టకాలం లో తనని ఆదుకునే ఒక ఆపన్న హస్తం వుందని ఒక ధైర్యం కలుగుతుంది.అందువలన మనసు పరిస్థితుల ప్రభావంతో విచలితం కాకుండా సరైన మార్గం లో ఆలోచించి తనంత తానే ఒక పరిష్కారాన్ని కనుగొనగలదు.మనసు విపరీత పరిస్థితుల్లో కూడా ఆశాభావాన్ని కలిగి వుండి తప్పుదారి పట్టకుండా వుండగలదు.
మనం చేసె మంచి పనులని,చెడ్డ పనులని ఇతరుల పట్ల మన ప్రవర్తన ఆమోదయోగ్యమా కాదా అని చూసేందుకు ఒకరు వున్నారని మనకి మనం గుర్తు చేసుకోవడం వల్ల వ్యక్తిగా మన ప్రవర్తన, సమాజంగా మన అందరి ప్రగతి కి ఒక క్రమబద్దీకరణ ఏర్పడుతుంది.అలాగే బలవంతుడు ఒక బలహీనుడిని దోచుకునే ముందు తన కన్నా బలవంతుడు తనని అందుకు శిక్షించవచ్చు అని ఆలోచించేటట్టు చేస్తుంది దేవుడి పైన నమ్మకం. అంతేగాని ప్రశంసలకి పొంగిపోయి మనకి ఏమన్న మేలు చెయ్యగలడో లేడో తెలియని వ్యక్తి వద్ద మన ప్రశంస అనుకున్న ఫలితం సాదించదేమో గాని దేవుడిని పూజించడం ఎల్లప్పుడ్డు మనకి మంచినే చేస్తుంది.” అన్నాడు దేవుడు.

“మన చర్చ చాలా వరకు మతం మంచిదా లేక నాస్తికత్వం మంచిదా అన్న విషయం మీద జరుగుతుంది,సంతోషం.మీరు కూడా పూజించడం వలన నిరూపణ కి నిలబడని అధ్బుతాలు జరుగుతాయని అనకపోవడం కూడా చర్చని పక్కదారి పట్టించడం లేదు. అయితే మీరు చెప్పినదాని తో నేను అంగీకరిస్తున్నాను అనుకునేరు!దేవుడిని పూజించడంకి,ఒక అవకాశవాదిలా ఎవరిని అన్న పొగడడానికి తేడా వుంది అంటే ఒప్పుకుంటాను.కాని మన కష్టాలని మనమే ఎదురుకోకుండా ఎవరో తీరుస్తారు అనుకోవడం,తమ స్వశక్తి మీద ఆధారపడక లేనిపోని ఆశలు కల్పించుకోవడం పూజించడం వల్ల కలిగే నష్టాలు.బాగా చదువుకున్న నాస్తికునికి వున్న మంచి చెడు విచక్షణ,చదువు సంస్కారాలు లేని ఒక ఆస్తికుడికి వుండవు.దేముడి మీద భక్తి ఒక బలవంతుడిని ఒక బలహీనుడిని దోచుకోకుండా ఆపుతుంది అన్నది పస లేని వాదన.స్వలాభం కోసం ఎవరన్న కూడని పని చేసినా, ప్రతి మతం గోహత్య నుండి నర హత్య వరకు ప్రతి దానికి ఏదో పరిహారం కల్పించింది.అలాంటప్పుడు మతం ఏ విధంగా మంచిని పెంచుతుంది?”అన్నాడు సాతాను.

“మీరు గొప్ప యుధ్ధ ప్రావీణ్యులు.కాకపోతె మీ చంటి పాప ఆరొగ్యం బాగోక వైధ్యుడు దగ్గర కి తీసుకు వెళ్ళారు.వైధ్యం మీ చేతిలో పని కాదు.వైధ్యుడి మీద నమ్మకం వుంటే పర్లేదు మీరు నిశ్చింతగా వుంటారు.లేదా జబ్బు ప్రమాదకరం కాకపోయినా పర్లేదు.అలా కాని పరిస్థితిలో?మీ యుధ్ధ నైపుణ్యం ఏ విధంగా మిమ్మలని నిబ్బరంగా వుండనిస్తుంది?అదే మీకు దేవుడి మీద అచంచల విశ్వాసం వుందనుకోండి,ఫలితం వచ్చే కాసేపటి వరకన్నా ఏదో గుడ్డి నమ్మకమన్నా మిమ్ములని స్థిమితంగా వుండేటట్టు చేస్తుంది.భావుకులయ్యి ఏ అఘాయిత్యం తల పెట్టకుండా మిమ్ములని ఆపుతుంది కదా?ప్రతి ఒక్కరికి ప్రతీది సాధ్యం కాదు,తమ స్వశక్తి మీద ఆధార పడడానికి!పక్క వాడి మీద మరి తప్పక ఆధార పడాలి.”అవసరానికి ఆదుకునే పక్కవాడే దేముడు!ప్రతి ఆత్మలో పరమాత్మ వున్నాడు అని” అనుకునేలా హెచ్చు తగ్గులు పెట్టిన ఆ దేముడి అవసరం లేదంటారా మనిషికి?మరి తన కన్న ఒక విషయం లో బలహీనుడు అయిన వాడు మరో విషయం లో మన కన్నా బలవంతుడు అన్న విషయం ఇలా అర్దం అయిన వాడు దోచుకునే అవకాశం లేదు కదా!!”అని సమాధానం ఇచ్చాడు దేముడు.కాసేపటి వరకు ఏమనాలో తెలియకనో,లేక అనుకున్నది ఎలా చెప్పాలన్న ఆలోచనతోనొ సాతాను మౌనం గా వున్నాడు.

“కష్ట కాలంలో దేవుని దయ వలన మంచే జరుగుతుంది అనుకున్నప్పుడు మనసు స్థిమిత పడుతుంది కాని అన్ని వేళల మంచి జరగదు కదా?అప్పుడు నమ్మకం వమ్ము అయిన ఆస్తికుని పరిస్థితి ఏమిటి?ఓహొ!!దీనికి కూడా మతం లో సమాధానం వుంది కదా!ప్రపంచం లోనె ‘అత్యధికులు అనుసరించే మతం’ అంతా ఒక ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారమే జరుగుతుంది అంటుంది.ఆ మతం ప్రకారం దేముడిని నమ్ముకున్న వాడికి వచ్చే కష్టాలు సాతాను పెట్టే శోధనలు,అదే దేముని నమ్మని వానికి కష్టాలు నమ్మనందుకు ప్రతిఫలం!కష్టం వచ్చినా నమ్ముకున్నందుకు ఏమి ఖచ్చితమైన హామి వుండదు కదా!అన్ని మతాలు ఇలా ప్రతి విషయం లో బొమ్మ పడ్డా బొరుసు పడ్డా తమ మాటే చెల్లించుకుంటాయి.పొరపాటున ఎవరికి అయినా హామి ఇచ్చినా నమ్మకముంటేనె ఫలం దక్కుతుంది అని ఒక మెలిక!కష్టం గట్టెక్కితే దేముడి గొప్ప,అలా కాకపోతె మన ఖర్మ ఫలం!”సాతాను ఆవేశంగా ఇంకా ఇలా అన్నాడు”ఆ మతం తరువాత ఎక్కువ మంది అనుసరిస్తున్న మతం?దేముడి మీద భక్తి తో ప్రజలు ఏ పాపం చెయ్యరని అనుకోదు కామోసు?కన్ను కి కన్ను,పన్ను కి పన్ను అంటుంది.మీ దేముడు సృష్టించిన స్త్రీ జాతి ఆ మతం లో రెండవ స్థాయి కి చెందిన మనుషులు!అందమయిన పరాయి స్త్రీ ని వాంచిచడం తప్పని మగవాడికి చెప్పదు కాని,ఆ అందమయిన స్త్రీ పరాయి పురుషుడు ముందు తన అందం చూపిస్తే తప్పు!!”
“ఇంకా ఈ రెండు మతాలు చెప్పే కొన్ని విషయాలు తప్పకుండా చర్చించవలిసిందే!దేముడి మీద నమ్మకం కంటే ఆ నమ్మకం ఎలా వుండాలో అన్న విధి విధానాలని పాటించడం ముఖ్యం.ఈ మతాల ప్రకారం దేముడి కి తన మీద విశ్వాసం కన్న తనని ఏ పేరు తో పిల్చారు,ఏ రూపం తో ఆలోచిస్తున్నారు అన్నది ముఖ్యం.నమ్మకమున్నా పద్దతి వేరు అయితే అంత కన్న పాపం లేదు,ఆ పాపం కి ప్రాయశ్చిత్తం కూడా లేదు.జన్మ నిచ్చే తల్లి ఆరోగ్యం,పిల్ల ఆరోగ్యం కన్న పుస్తకం లో ఏమి రాసారన్నది ముఖ్యం!సాటి మనిషి ని ప్రేమించమన్న నోటితోనె వాడి తల నరకమంటుంది తమ దేముడికి వ్యతిరేకమయితే!ఇంకా ‘పురాతన మతమే’ గుడ్డిలో మెల్ల.(ఓ పాఠకుడా!చదివే మీ అందరిలో ఈ మతానికి చెందిన వారే ఎక్కువనో,దీన్ని విమర్శిస్తే అందరూ తీవ్రం గా విరుచుకుపడతారనో నేను ఇలా నలేదు.ఇది పాత్ర అభిప్రాయం.)పర మత సహనం దేవుడు ఒక్కడే అన్న మతం ఇదే!కాకపోతె ‘పరమతాన్నీ సహించమన్న ఈ మతం ‘తనా ప్రజలనే సహించక హింసించింది.దేవుడి ఒక్కడే,అన్ని దేవుళ్ళు ఒకరే అని దొంగ స్వామీలని పెంచి పోషించింది ఈ మతమే! ఏ మతము చూసినా ఏమున్నది గర్వ కారణం?మనుషులని విడగొట్టి వేరు చెయ్యడమే కదా వీటి పని!ఇలాంటి మతాల వల్ల మనిషి మనుగడకే ముప్పు!”

తన కన్న తమ మతాలకే మనుషులు విలువ ఇస్తున్నారని దేముడికి అర్దం అయ్యింది.

ఒక పొలములో మనం ఒక పంట వేసాము అనుకోండి.అందులో మంచి మొక్కలతో పాటు కలుపు మొక్కలు,చీడ పట్టిన మొక్కలు వుంటాయి.వాటిని చూచి మొత్తం పంట వృధా అని అనుకోవద్దని ప్రజలకి తిరిగి చెబుదాము అనుకున్న దేముడికి నేడు పంట దగ్గర నుండీ చూసాక అందులో అసలు పంట కన్నా కలుపు మొక్కలు,చీడ పట్టిన మొక్కలు ఎక్కువ అని,పంట ని ప్రక్షాళణ చెయ్యాల్సిన సమయం వచ్చింది అని అర్దం అయ్యింది.తన అద్భుత సృష్టి అయిన మానవుని లో అనుకోకుండా కలిగిన లోపం గుర్తుకి వచ్చింది.

ముగింపు: “లోపం మతం లో లేదు.మనిషిలో నుంది.అది ద్వేషం!!మనిషి మతం లేక పోయిన నేడు ఇలాగే వుండేవాడు.మతానికి బదులు ప్రాంతం పేరు మీదో,భాష పేరు మీదనొ,రంగు పేరు మీదనో ఇలాగే తనవాళ్ళతో తానే యుధ్ధం చేసె వాడు.మతం,భాష,జన్మభూమి ఇవన్నీ మనిషి మంచి కోసమే అయినా నేడు వాటిని తన ద్వేషం తీరేటట్టు వాడుకుంటున్నాడు.మిగిలిన జంతుజాలాని కన్న మనిషి ఇందులో అధముడు.ఈ విషయం లో ఆ దేవుడు కూడా మనిషిని మార్చలేడు.”ఇలా అని దేవుడు సెలవు తీసుకున్నాడు మరో సృష్టి మొదలెడదామని!

ప్రకటనలు
వ్యాఖ్యలు
 1. Malakpet Rowdy అంటున్నారు:

  WOW, I should say!

 2. శ్రీవాసుకి అంటున్నారు:

  కథ ముగింపు బాగుంది. ఇంతకీ మీరు దేవుడ్ని నమ్ముతారా. ఈ కథ మీ సొంతమా లేక? ఇలా అడిగానని తప్పుగా అనుకోవద్దు.

  • krishna అంటున్నారు:

   కధ ముగింపు మీకు నచ్చినందుకు చాలా సంతోషం.నాకు ఇంకా ఆయన తో పరిచయం కాలేదండీ!అందరు చెబితే విన్నాను చాలా గొప్పవారిని,నాకు ఇంత వరకు అనుభవం కాలేదు.
   ఇది నా సొంతమే!

 3. sowmya అంటున్నారు:

  చాలా చాలా బాగా రాసారు కృష్ణగారూ

  కరక్ట్ గా నేను ఏమి అనుకుని మతాన్ని విసర్జించానో ఆ ఆలోచనలకి మీరు అక్షర రూపం ఇచ్చారు. సాతాను వాదనలు, దేవుని వాదనలను సమతూకం వేసినట్టుగా, సమంజసంగా, చాలా నిర్భయంగా రాసారు….ఈ ముగింపు టపా కోసం నేను చాలా ఎదురుచూసాను సుమండీ!

  నా మనసులోని మాట

  “ఈ ప్రపంచలో ఏదో ఒక శక్తి ఉంది అని నేను నమ్ముతున్నాను. దానికి ఒక ప్రత్యేక రూపమిచ్చి ఆ రూపం కోసం గొడవపడను. ఆ శక్తి ఈ కొట్లాటలకు, నమ్మకాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు అతీతమైనది. అది నాకు ప్రాణాన్నిచ్చింది. అంతకుమించి ఇంకేం కాదు. అది నన్ను ముందుకు నడిపించదు, చావకుండా ఆపదు. నా స్వశక్తితోనే నేను ముందుకు సాగాలి. మార్గంలో వచ్చే అవాంతరాలను నేనే ఎదుర్కోవాలి. నా శరీరలో అవయవాలకు చేవ తగ్గగనే నేను నశించిపోతాను. అంతే. ఆ శక్తి ఏమిటి, ఎక్కడనుండి వచ్చింది, దానికి మూలమేమిటి అన్న దానిపై ఈనాటికి పరిశోధన జరుగుతూనే ఉంది. సైన్సు దాన్ని “ఇది” అని నిరూపించేవరకు దానికి నేను రూపమివ్వను. ఒకవేళ దాన్ని సైన్సు నిరూపించలేకపోతే అందరు దాని రూపం ఒకటే అని నమ్మేవరకు నేను దానికి రూపమివ్వను. ఒకవేళ అలాంటి శక్తే ఉంటే అది ప్రపంచం మొత్తానికి ఒకే విధంగా కనిపించాలి. అలా కనిపించేవరకు దానికి నేను ఏ రూపు ఇచ్చుకోలేను. శక్తికి రూపమివ్వడమే ఈ రాగద్వేషాలకి కారణం”

  కానీ మీరు చెప్పిన ముగింపుతో నేను అంతగా ఏకీభవించలేను.
  “లోపం మతం లో లేదు.మనిషిలో నుంది.అది ద్వేషం!!మనిషి మతం లేక పోయిన నేడు ఇలాగే వుండేవాడు.” దీనిని నేను పూర్తిగా ఏకీభవించను. మనుషులు మతం కోసమో, భాష కోసమో, రంగు కోసమో, లేదా మరే ఇతర కారణం కోసమో కొట్లాడుకోవడం నిజమేగానీ…వీటిల్లో ఒక్కొక్క ముల్లుని త్రుంచుకుపోయే దిశలో అభివృద్ధి సాగుతోంది. ఈరోజు రంగు, భాష అనే ముళ్ళను తెంపి ఏరంగు మనిషికైనా, ఏ భాష మనిషికైనా గౌరవమిచ్చే పరిస్థితి కొంతవరకైనా వచ్చింది. అలాగే మతమనే మౌఢ్యాన్ని కూడా మనం అధిగమించగలమని ఆశిస్తున్నాను. మతం లేని నాడు మనిషి ఇంకా ప్రశాంతంగా ఉండగలడు.

  • krishna అంటున్నారు:

   చాలా చాలా థాంక్సండీ! రాయడానికి పడ్డ కష్టం మీ అందరి కామెంట్లని చూసి తీరిపోయింది.(కొత్త కదండీ,అలవాటు లేదు.ఏమి రాద్దామా అని బుర్ర బద్దలు కొట్టుకోవడం,ఏదో ఆలోచన వచ్చినా సిస్టం ముందు కుర్చున్నప్పుడు మర్చిపోవడం!)నా టపా కంటే మీ కామెంటే బాగుంది.క్లారిటి ఆఫ్ థాట్ వుంది మీకు,నేను కొంచెం కంఫ్యూజన్ టైప్.
   ఇక మీ అబిప్రాయం తో నేను కూడా కొంత వరకు అంగీకరించలేక పోతున్నాను.ముందు కంటే పరిస్థితులు మెరుగయ్యాయా?ఇంఫర్మేషన్ టెక్నాలజి పుణ్యమా అని ధానిష్ కార్టూన్లు పడ్డ నెల కల్లా, ప్రపంచమంతా హంగామా చేసారు.నేను వేరు తాను వేరు అని అనుకునే వారే ఇప్పటికి ఎక్కువ,అది జాతి,లింగ,వర్ణ,భాషీయ,ప్రాంతీయ భేదాలు వల్ల కావచ్చు,మతం కాకుండా!మీరు ఆశించినట్టు జరిగితే చాలా ఆనందిస్తా!

   • sowmya అంటున్నారు:

    నా ఉద్దేశ్యం ప్రపంచమంతా సమానమైపోయింది అని కాదండీ. కాని సమానతవైపు కొన్ని రకాలుగానైనా సాగుతోంది. ఒకప్ఫుదు అమెరికాలో ఉండే నల్లజాతీయుల వివక్ష ఇప్పుడు లేదు. మనదేశంలో ఉండే అంటరానితనమ కాస్త తగ్గింది (ఇప్పటికీ బ్రాహ్మణులు, శూద్రులు అనే తేడా ఇంకా ప్రస్పుఠంగానే ఉందనుకోండి). అలాగే భాషా బేధాలు చాలామటుకు తగ్గాయి అనే చెప్పుకోవాలి. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ వివాహాలు అడప దడపా జరుగుతూనే ఉన్నాయి. అలాగే లింగ వివక్ష కాస్త తగ్గుముఖం పట్టింది. కానీ మతమౌఢ్యమే ప్రబలుతోంది. దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. అదే నా బాధ. సమానత దిశ వైపు వేసే అడుగుకింద మతం కూడా నలిగేరోజు వస్తుందనే చిన్ని ఆశ నాలో ఉంది.

   • sowmya అంటున్నారు:

    ధన్యవాదములు కృష్ణగారూ,ఏదో నాకు ఉన్న ఆలోచనను మీతో పంచుకున్నాను అంతే.

   • krishna అంటున్నారు:

    మీరు గ్లాసు సగం నిండి వుంది అంటున్నారు నేను సగం ఖాళీగా వుంది అంటున్నాను.ఇద్దరం కరెక్టే/తప్పే!!!

   • sowmya అంటున్నారు:

    హ హ హ మీరు లౌక్యులు సుమండీ 😀

 4. sowmya అంటున్నారు:

  “ఈ మతాల ప్రకారం దేముడి కి తన మీద విశ్వాసం కన్న తనని ఏ పేరు తో పిల్చారు,ఏ రూపం తో ఆలోచిస్తున్నారు అన్నది ముఖ్యం.నమ్మకమున్నా పద్దతి వేరు అయితే అంత కన్న పాపం లేదు,ఆ పాపం కి ప్రాయశ్చిత్తం కూడా లేదు.జన్మ నిచ్చే తల్లి ఆరోగ్యం,పిల్ల ఆరోగ్యం కన్న పుస్తకం లో ఏమి రాసారన్నది ముఖ్యం!”

  “మీ దేముడు సృష్టించిన స్త్రీ జాతి ఆ మతం లో రెండవ స్థాయి కి చెందిన మనుషులు!అందమయిన పరాయి స్త్రీ ని వాంచిచడం తప్పని మగవాడికి చెప్పదు కాని,ఆ అందమయిన స్త్రీ పరాయి పురుషుడు ముందు తన అందం చూపిస్తే తప్పు!”

  ………గుళికలంటారు చూసారూ అలాంటివే ఇవి, Excellent !

  మీరు కొ.కు, చలం పుస్తకాలు చదివారా? మీ వ్యాసం చదివాకా నాకు చలం గారు రాసిన “సావిత్రి” గుర్తొచ్చింది.ఇది 5-6 చిన్న కథల పుస్తకం. ఇందులో పురాణ పాత్రలను తీసుకుని వాటి గురించి సరికొత్తకోణంలో వాదనలు చేస్తారు. అందులో ఇది నిజం కాదు అని చెప్పగలిగేవీ ఏవీ ఉందవు, అలా అని ఆయన ఎవరిని కించపరచలేదు. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వాదనసరళి. మీరు తప్పక చదవండి. I am sure you will like it !

  On a lighter note:

  “మిగిలిన జంతుజాలాని కన్న మనిషి ఇందులో అధముడు.ఈ విషయం లో ఆ దేవుడు కూడా మనిషిని మార్చలేడు”….మరీ అలా అనేసారేంటండీ బాబూ, మనల్ని మనమే ఇంతల కించపరిచేసుకుంటే ఎలా 🙂

  • krishna అంటున్నారు:

   ఈ మధ్యనే చలం గారి మైదానం చదివా!చిన్న పుస్తకం,అదో లోకం లో జరుగుతున్నట్టు భలేగా అనిపించింది.(ఇదే నేను చదివిన చలం గారి మొదటి పుస్తకం అని చెప్పడానికి సిగ్గు పడుతున్నా!)
   కొ.కు.గారి కధలు కొన్ని చదివినట్టు గుర్తు.కధలు గుర్తున్నంతగా రచయితలు గుర్తుండరు నాకు,వారి గొప్పదనం తెలియక కాబోసు!
   లక్కీగా మా వూరిలో కొత్తగా విశాలాంధ్ర వారి బుక్‌స్టాలు పెట్టారు.ఇక మంచి మంచి పుస్తకాలు చదవడానికి దొరుకుతాయి.’సావిత్రీకూడా చదవాలి,చదివి తీరుతా:-)

   • sowmya అంటున్నారు:

    ఓహ్ విశాలాంధ్ర ఉంటే ఇంకేం, చక్కగా అన్ని పుస్తకాలూ కొని చదువుకోవచ్చు.
    మైదానం మీకు నచ్చినందుకు సంతసిస్తున్నాను. చలం గారిది “జెలసీ” కూడా బాగుంటుంది. అసలు ఒకటేమిటి అన్నీ బాగుంటాయి. బ్రాహ్మణీకం, స్త్రీ, బిడ్డల శిక్షణ ఇలా ఎన్నో ఉన్నాయి చదివే టైం ఉండాలేకానీ

    పుస్తకాల విషయంలో నా ఉచిత సలహాలు, సూచనలు మీకెప్పుడూ అందుబాటులోనే ఉంటాయి 😀

   • krishna అంటున్నారు:

    అంపశయ్య నవీను గారివి కొన్ని కదల పుస్తకాలు చదివాను. అంపశయ్య మాత్రం చదవలేదు:-(అదేంటో మొదట్లో బాగానే అనిపించినా,ఆయన కేవలం స్త్రీ పురుష సంబందాల గురించి మాత్రమే రాసాడని మొనాటని కలిగింది.మీ అభిప్రాయం ఏంటి?

   • sowmya అంటున్నారు:

    అంపశయ్య నవీన్ గారివి నేను ఎక్కువ చదవలేదండీ. అంపశయ్య కొద్దిగా చదివా, నాకు అంత ఉత్సాహంగా అనిపించలేదు.

 5. bondalapati అంటున్నారు:

  rendu pakkala vaadanaloo balam gaa unnaayi.
  mee muginpu tO nenu ekeebhavistaanu. jantuvula kante manam goppa anukovatam vaatini kinchaparachatame

 6. శ్రీవాసుకి అంటున్నారు:

  అదేమి ఖర్మమోగాని ధర్మం తప్ప మతంలేని మనదేశంలో ఈరోజు మనం ఫలానా మతస్తులమని చెప్పుకోవల్సి వస్తోంది. ఆది నుంచి ఈ గడ్డ మీద సనాతన ధర్మంతో కూడిన జీవన విధానమే ఉండేది. అది కేవలం దైవాన్ని పూజించడం ఎలాగో అన్న విషయమే కాక విలువలతో కూడిన జీవితాన్ని కూడా తెల్పింది. క్రమక్రమంగా చాలా విషయాలు కాలగర్భంలో కలిసిపోయాయి.

  • Chandu అంటున్నారు:

   This is the nicest coment in this post. “ధర్మం తప్ప మతంలేని మనదేశంలో ఈరోజు మనం ఫలానా మతస్తులమని చెప్పుకోవల్సి వస్తోంది. ” These lines just remined me of one lecture of my father in “Shringer Shankara matt”.

   Good one Vasuki gaaru.

   Post is good.

  • krishna అంటున్నారు:

   సనాతన ధర్మమా?లేక సంప్రదాయమా?రెంటికి తేడా వుంది కదా!అందులో కొన్ని అధర్మమయినవి లేవు?
   జంతు బలులు?
   అస్పృశ్యత?
   బాల్య వివాహాలు?
   సతీ సహగమనం?
   వీర శైవం Vs వైష్ణవం?
   ఇంకా చాలా పొడుగు లిస్టే వుందండీ.కాకపోతే ప్రశ్నించడంని ఎప్పుడు అడ్డుకోలేదు ఇక్కడ.
   పురాతన దురాచారాలు అందుకే వదిలించుకోగలిగాము.

 7. శ్రీవాసుకి అంటున్నారు:

  @కృష్ణగారు

  నేనన్నది సనాతన ధర్మం గురించే. సనాతనం అంటే పురాతనమైనది అన్ని కాలాలలోను ఆచరించదగినది. సంప్రదాయాలనేవి మనుషులనిబట్టి, దేశ కాలమాన పరిస్థితులనుబట్టి మారుతుంటాయి. వేదాలలోను, సనాతన ధర్మంలోను చెప్పబడనవి కేవలం మీకు మనుషులలోనే కనిపిస్తాయి. ఆచార వ్యవహారాలు ఒకందుకు పెడితే అవి మానవ ఆచరణా తీరు వల్ల గతి తప్పుతుంటాయి. ధర్మంలో తప్పు లేదు దానిని ఆచరించేవాళ్ళలోనే దోషాలున్నాయి. మీరు రామాయణం చదివితే మీరడిగిన అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది. “రామో విగ్రహవాన్ ధర్మహః” అని వేదోక్తి ధర్మానికి రూపమిస్తే అది రాముడిలాగే ఉంటుంది. ఒక సగటు మానవుడిగా ధర్మాచరణ చేసి చూపించాడు. మీరు పేర్కొన్న సాంఘిక దురాచారాలు మధ్యకాలంలో వచ్చినవి. ధర్మం కానిదేదైనా ఖండించవలసిందే. ధర్మ సంస్థాపన కోసం తాను మళ్ళీ పుడతానని భగవంతుని మాట.

  • krishna అంటున్నారు:

   సనాతన ధర్మంకి నిర్వచనం ఏమిటి శ్రీవాసుకి గారు?కేవలం ఒక వ్యక్తి నడిచి చూపిన బాటనా మనం నడవవలిసింది?లేక ఆ కాలం లో అందరి మన్నన పొందినది అయిన పద్దతినా?ఎందుకంటే అప్పుడు కూడా చెడు వుంది అని మీరు చెప్పిన గ్రంధంలోనె వుంది.మీరు సూచించిన వ్యక్తి పైన కూడా చాలా మంది ఆరోపణలు చేసారు.నేను వాటి జోలికి పోదలుచుకోలేదు.ఎందుకంటే అవి ఎప్పటికి తెగనివి.ఇక పోతే మిగిలిన మతాల కంటే ఈ సనాతన ధర్మం ఏ విధంగాను తేడా కాదు.ఈ సనాతన ధర్మం ఆచరించే వారు,అదే ధర్మం పేరు చెప్పి చాలా అధర్మమైన పనులు చేస్తుంటారు.కాబట్టి ఏ మత/ధర్మ/ సంప్రదాయాల్లోనైనా తప్పులు వున్నాయి.వాటిని సరిదిద్దుకుంటేనె ప్రగతి లేకుంటే అధోగతి!!

   • శ్రీవాసుకి అంటున్నారు:

    @ కృష్ణగారు

    ఒక వ్యక్తి నడిచి చూపిన బాటనా మనం నడవవలసినది అన్నారు ఆయన నడిచింది తన సొంత బాటలో కాదు అప్పటికే చెప్పబడియున్న ధర్మం ప్రకారం నడిచారు. ఎలా నడిచారు ఒక సామాన్య మానవునిగా కష్టనష్టాలు ఎదురైనా భీతిల్లక నీతిగా ధర్మం తప్పక నడిచారు. తద్వారా ముందు తరాలకు ఆదర్శంగా నిలిచారు. ధర్మం అనేది చాలా గొప్పది. అప్పటి ధర్మం ఇప్పటి కాలానికి కూడా సరిపోతుంది. అయినా అది కూడా కాలగతిలో మార్పులు చెందుతోంది. దానిలో సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలు చాలా ఉన్నాయి. అందుకే ధర్మ సూక్ష్మాలు అన్నారు. మన కంటికి కనబడినదే నిజమనుకోవడం భ్రమ. “అప్పుడు కూడా చెడు వుంది అని మీరు చెప్పిన గ్రంధంలోనే”. మంచి, చెడులు నాణానికుండే బొమ్మ బొరుసులాంటివి. ప్రకృతి ఉంటే వికృతి కూడా ఉంటుంది. రాముడు శంభుకుడు అన బడే ఒక శూద్రుడు తపస్సు చేసినందుకు అతని తల నరికాడు అని బొందలపాటి గారన్నారు. దానికి ఆధారమైన మూలకథ ఏమైనా చదివారా. దాంట్లో ఉండే ధర్మసూక్ష్మం తెలుసుకున్నారా. ఈనాటి కులాన్ని బట్టి ఆయన ఆ ధోరణిలో చూసారనిపిస్తోంది. అదే రాముడు నిమ్నజాతి వాడైనా గుహుడ్ని హత్తుకున్నాడు. శబరి పెట్టిన ఎంగిలి పళ్ళు తిన్నాడు. రామాయణం వ్రాసిన వాల్మీకి ఒక బోయవాడు. తపస్సు చేసి రామానుగ్రహం సంపాదించి రామాయణ రచన చేసాడు. ఒక విషయాన్ని పైపై చదివి తప్పుగా భావించటం సరి కాదని నా ఉద్దేశ్యం. “సనాతన ధర్మం ఆచరించే వారు, అదే ధర్మం పేరు చెప్పి చాలా అధర్మమైన పనులు చేస్తుంటారు”. మన సనాతన ధర్మంలో ఎవరో అనాచారం చేసాడని, తప్పుడు పనులు చేసాడని చెప్పి దేవుడి మీద, ధర్మం మీద అలగడం మూర్ఖత్వం. అత్త మీద కోపం దుత్త మీద చూపినట్టు. ఉదా: ఇంటర్నెట్ ని మంచికి ఉపయోగించేవాళ్ళు ఉన్నారు, చెడుకి ఉపయోగించే వాళ్ళూ ఉన్నారు. చెడు జరుగుతోంది కాబట్టి ఇంటర్నెట్ చెడ్డదా. ఇక దాంట్లో మంచిని చూడరా, స్వీకరించరా. ధర్మం కూడా అంతే ఎప్పుడు సత్యమే చెబుతుంది. దానిని నిక్కచ్చిగా ఆచరించడం ఎవ్వరికో కాని సాధ్యం కాదు. అది కత్తి మీద సామే. ఆ సాముని చేసి చూపిన వాడు శ్రీ రాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మః అన్నారు.
    కొంచెం ఎక్కువ చేసుంటే మన్నించండి.

 8. Jayavani అంటున్నారు:

  ఈ కథ అందులో మీ ఆలోచనలు చాలా బావున్నయ్, అందరి అభిప్రాయాలు ఒకరిని మించి ఒకరివిగా వున్నయ్. ఈ బ్లాగులో నా అభిప్రాయాన్ని పెట్టడానికి కూడ సంకోచముగా వుంది, నా మాతృభాష తెలుగే అయినా కూడా నా కామ్మెంటు ని తెలుగు లో రాయడానికి ఇంత కస్టముగా వున్నప్పుడు అర్ధమవుతుంది నా తెలుగు భాష తో నాకున్న పరిచయం ఎంత చిన్నదో అని 🙂

  మతం గురించి నా అభిప్రాయం ఒక్కటే, నేను అన్ని మతాలనూ గౌరవిస్తాను, నా దృస్టిలో ఏ మతమయిన చెప్పేది ఒక్కటే, మనిషి గా ఎలా నడుచుకోవాలి అని

  కానీ దేవుడి విషయం లోనే నాకు నిర్ధిష్టమయిన అభిప్రాయము లేదు. ఈ విషయం గురించి ఎప్పుడూ సంఘర్షణ జరుగుతునే వుంటుంది నాలో! నాలో వున్న రీజనింగు నేను దేవుడి ముందు నిలబడినప్పుడల్లా నన్ను పదే పదే ప్రశ్నిస్తుంది నిజంగా దేవుడు వున్నాడా అని? ఈ ఆత్మ సంఘర్షణ ని తట్టుకోలేకనే అలాంటి సందర్భాలని తప్పించుకోవడానికే ప్రయత్నిస్తుంటాను. 🙂

  మంచి జరిగినా చెడు జరిగినా అది మన పూర్వజన్మ సుకృతం అని అయితే నమ్మను కానీ, ఏదైనా మనం చెసే పనికి తగ్గ ప్రతిఫలమే మనకి దక్కుతుందని పూర్తిగా నమ్ముతాను
  శౌమ్య గారి అభిప్రాయాలతొ నేను పూర్తిగా ఏకిభవిస్తాను, కానీ తప్పు చేసే సమయాల్లో ఆ శక్తికి భయపడడం, మంచి జరిగినా చెడు జరిగినా ఆ శక్తిని తలచుకొవడం నాకు కొంచెం వూరటనిస్తాయి. అందుకే దేవుడిని నమ్మడం వల్ల వచ్చే లాభాల విషయం లో నేను పిల్ల కాకి తో ఏకీభవిస్తాను

 9. Jayavani అంటున్నారు:

  small correction, its not pilla kaaki’s opinion, it’s the character GOD’s opinion, right?

  చివరగా “ఇలా అని దేవుడు సెలవు తీసుకున్నాడు మరో సృష్టి మొదలెడదామని!” అన్నారు కదా, ఈ మాట తో దేవుడిని నమ్మేవాళ్ళు ఏకీభవించచ్చు కానీ నేను దేవుడు వున్నాడో లేడో తెలియని వర్గం కి చెందిన దానిని, సైన్సు చదువుకున్నదాన్ని కాబట్టి పై వాక్యాన్ని మరోలా అర్ధం చేసుకున్నాను
  సృష్టి ఆరంభం ఏదో శక్తే చేసిందో లేక బిగ్బాంగ్ థియరీనే కరెక్టో తెలియదు.
  కానీ సృష్టి ముగింపు మాత్రం మనిషే చేస్తున్నాడు తన అత్యాశతో! ఇందులో దేవుడి ప్రమేయము ఏమీ లేదు.

 10. krishna అంటున్నారు:

  ముగింపు లో నా వుద్దేశ్యం కూడా అదే!తెలుగు లో కామెంట్ రాసినందుకు థాంక్స్!

 11. bondalapati అంటున్నారు:

  నేను నీరజాక్షుణ్ణి కాదు. వక్రాక్షుణ్ణి. మీ పోస్ట్ కి వచ్చిన కామెంట్లు చూస్తే నాకు కన్ను కుడుతోంది, కుళ్ళు గా ఉంది. పోస్ట్ బాగుంది. కానీ కామెంట్లు ఇంకా ఫలప్రదం గా ఉన్నాయి. మీ తెలుగు చాలా బాగుంది. మీ తరం లో ఇంత మంచి తెలుగు రాయగల వాళ్ళు చాలా తక్కువైఉండవచ్చు. తెలుగు ఏమైపోతోందో అన్న నా బెంగ మీలాంటి వారిని చదవటం వలన తగ్గుతుంది.

  ఇక పోతే రాముడి గురించి శ్రీ వాసుకి గారి ఆరాధనా భావాన్ని నేను అర్ధం చేసుకోగలను. నా “ఒక తెలుగు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కథ” లో రామాయణం గురించిన ఒక భాగం ఉంది. కానీ రాముడు శంభుకుడు అన బడే ఒక శూద్రుడు తపస్సు చేసినందుకు అతని తల నరికాడు. ఇప్పటి సమాజ విలువల తో చూస్తే ఇది చాలా తప్పు.కాబట్టీ రాముడు అప్పటి సమాజ విలువలను బట్టి అప్పటి ధర్మానికి ప్రతి రూపం. కానీ ఇప్పటి సమాజం కూడా దాని విలువలకు వ్యతిరేకం గా వెళ్ళిన వారిని దండిస్తుంది.ఇద్దరు ముగ్గురు భార్యలు కలిగిన వాడిని ఇప్పటి సమాజం బహుభార్యాత్వం కింద దండిస్తుంది కదా.అలాంటి వాడికి ప్రభుత్వ ఉద్యోగం కూడా రాదు. కనీ దానికి సంబంధించిన వాళ్ళందరికీ ఇష్టమైతే ఇద్దరు ముగ్గురిని పెళ్ళి చేసుకోవటం లో తప్పేమిటి? అదే పురాణ కాలం లో ఇద్దరు ముగ్గురు భార్యలు ఉండటం తప్పుకాదు.తప్పు ఒప్పులనేవి ఆయా సమాజాల విలువలను బట్టి ఉంటాయి.

  • krishna అంటున్నారు:

   నేను కూడా ఒక పురాణ పురుషుడుగా రాముడిని గౌరవిస్తాను అండీ.కాకపోతె పర్‌ఫెక్ట్ అని మాత్రం అనుకోను.ఆయన కంటె శ్రీకృష్ణుడు ఇంకా మాయవాడని చెప్పుకుని చేసాడు కాబట్టి ఏ పనిని ప్రశ్నించడానికి లేదు.బహుశా అందరు రాముడిని ఆదర్శ ప్రాయుడిగా ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి ఎక్కువగా విమర్శకి ఆయన నోచుకుంటాడు అనిపిస్తుంది.

 12. nagarjuna అంటున్నారు:

  Excellent post series i’ve read on this topic bro. It has rekindled my opinions of disbelief in religion.

  >>తన కన్న తమ మతాలకే మనుషులు విలువ ఇస్తున్నారని దేముడికి అర్దం అయ్యింది.

  పరమాత్మ అయిన దేవుడి తత్వాన్ని సున్నితంగా చెప్పారు.
  నా అభిప్రాయంలో దేవుడు అచంచల ప్రేమమూర్తి, అందుకనే అతిశక్తిమంతుడు. ప్రాణికోటి పట్ల ప్రేమ కలిగివుండమనడానికి అతిపెద్ద స్ఫూర్తి, ఆద్యుడు అతను. మతానికి,

  ఆచారాలకు అతీతుడు. తనని నమ్మని, విమర్శించే, సాటిప్రాణులకు మేలుచేసె నాస్తికుని సైతం దగ్గరకు తీసుకునేవాడు ఆయన. He’s above all

  మీ పోస్టులొ సైతాను ’మంచి సైతాను’లా అనిపించాడు 🙂 he’s trying to put things rationally . బహుశా ప్రాణులని హింసించని సాతాను ఇక్కడే దొరుకుతాడేమో…. 😉
  మొదటి భాగంలొ మనుషులు తనకు మొక్కులు మొక్కడం లేదని, బలులు ఇవ్వడంలేదని అందుకని దేవుడికి కోపం వచ్చిందని రాసారు-ఇవి మతంలో కదా ఉంటాయి!

  చివరిదాంట్లో మనుషులు తన కన్నా తమ మతాలకే విలువ ఇస్తున్నందుకు ఆవేదన పడ్డాడన్నారు- దేవుడు మారాడా లేక దేవుడి పట్ల మీ దృక్పదం మారిందా?

  నిజానికి దేవుడికి కావల్సిందేమిటి మనుషులకు తనపై విశ్వాసముండటమా లేక తన సృష్టిలోని సాటిమనుషుల మీద విశ్వాసమా?

  Very nice post though….couldn’t resist reading again and again. will refer to my frnds too

 13. krishna అంటున్నారు:

  చాలా థాంక్స్ నాగార్జునాచారి గారు!మీ బ్లాగులో నా కామెంట్ చూసారనుకుంటా!ఇక మీ ప్రశ్న విషయానికి వస్తే,మొదటి పోస్టులో సాతాను తన మీద కొత్త పద్దతిలో చేసిన దాడి పట్ల దేవుడు కోపం గా వున్నాడని నా వుద్దేశ్యం!అయితే ప్రజలు కి భక్తిప్రవుత్తుల్లు తగ్గి పూజలు పునస్కారాలు మానేసారన్నది రచయత ప్రకటన!ఇక మంచి సాతాను గురించి చెప్పాలంటే అది నేనే!మా స్నేహితుడు ఒకడి తో నాకు చాలా చర్చ జరిగేది వాడి మతం గురించి.వాటిని ఒక plain post లా వెయ్యకుండా కొంచెం fiction కలిపా!నాకు సంబందించిన వరకు మంచి చేసే సాటి మనిషిలోనె దేముడు,హాని చేసె వాడిలోనె సాతాను వుంటారనిపిస్తుంది.కాబట్టి దేముడిని నమ్ముతామనుకునే వాళ్ళు సాటి మనుషులని నమ్మాలి,మత నమ్మకాల కి అతీతంగా! నేను సరిగా చెప్పలేకపోయాను అని నాకు అనిపిస్తుంది.ఇంకా చాలా తప్పులు వున్నాయనుకోండి.మీ సద్విమర్శ కి నా ధన్యవాదాలు. this kind of comments are very much welcome.they will make me improve!

 14. npchary అంటున్నారు:

  fiction అయినాకాని balance of reason పోకుండా సాగింది మీ కథనం. ఈ టాపిక్ పైన ఇటువంటి పంథాలో వెళ్లే చర్చలు అరుదుగా అగుపిస్తుంటాయి.
  మీవల్ల bondalpati గారి స్పిరిట్యుయల్ బ్లాగు పరిచయమయ్యింది, చదువుకోడనికి భలే మేత. thanks for this

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s